లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్

 లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్

హైదరాబాద్:లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, డ్రగ్స్, మద్యంతోపాటు ఉచిత పంపిణీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటి మొత్తం విలువ రూ.8,889 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే అందులో రూ.3,959 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు తెలి పింది. తెలంగాణలో  మొత్తం రూ. 333.55 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు పట్టుబడినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండగా..ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తైంది. మే 20వ తేదీ అయిదో దశ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీల్లో పట్టుబడిన నగదు, డ్రగ్స్, మద్యం వివరాలను ప్రకటించింది. మరోవైపు మే 26, జూన్ 1న ఆరు, ఏడు దశల్లో పోలింగ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగనుంది.

తెలంగాణలో రూ.76 కోట్ల విలువైన 30 లక్షల లీటర్ల మద్యం, రూ.114 కోట్ల నగదు, రూ.29 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.77 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన లోహాలు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.8,889 కోట్ల మేర జప్తు చేసినట్లు భారత ఎన్నికల సంఘం నివేదిక పేర్కొంది.

తెలంగాణాలో 36 కోట్ల విలువైన ఇతర ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. డ్రగ్స్ , సైకోట్రోపిక్ పదార్ధాలతో సహా మత్త పదార్థాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.