న్యూఢిల్లీ: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నట్లు (క్యాష్ ఫర్ క్వైరీ) ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31న విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంది. మొయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ ను గురువారం ఎథిక్స్ కమిటీ విచారించింది. తర్వాత ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ మీడియాతో మాట్లాడారు.
వారి వాంగ్మూలం నమోదు చేసుకొని అన్నింటిపై కమిటీలో చర్చించామన్నారు. మొయిత్రాను కూడా విచారించేందుకు ఈ నెల 31న కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. తీవ్రమైన ఆరోపణలు కావడంతో దర్యాప్తులో కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖల సాయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా శాఖలకు లెటర్లు కూడా రాసినట్లు చెప్పారు.