ఇండియా ధర్మసత్రం కాదు.. అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవ్: అమిత్ షా

ఇండియా ధర్మసత్రం కాదు.. అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవ్: అమిత్ షా

న్యూఢిల్లీ: భారత దేశం ధర్మసత్రం కాదని.. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గురువారం (మార్చి 27) ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను లోక్ సభ ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చకు కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని దేశంలోకి ప్రవేశించడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని.. జాతీయ భద్రత విషయంలో రాజీపడబోమని తేల్చి చెప్పారు. 

దేశ అభివృద్ధికి తోడ్పడటానికి ఎవరైనా ఇక్కడికి వస్తే వారిని ఎల్లప్పుడూ స్వాగతిస్తామన్నారు. పర్యాటకులుగా లేదా విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం కోసం భారతదేశానికి రావాలనుకునే వారిని స్వాగతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇదే సమయంలో దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిపై తీవ్రంగా వ్యవహరిస్తామని హెచ్చరిచారు. ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం దేశ భద్రతను బలోపేతం చేస్తుందని.. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, ఆరోగ్యం, విద్య రంగాలను ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 ఇమ్మిగ్రేషన్ బిల్లు భారతదేశాన్ని సందర్శించే ప్రతి విదేశీయుడి సమాచారాన్ని సేకరిస్తోందని తెలిపారు. ఈ బిల్లు ద్వారా భారత్ వచ్చే ప్రతి విదేశీయుడి సమాచారం మన వద్ద ఉంటుందని నేను దేశానికి హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. దేశంలో వ్యక్తిగత లాభాల కోసం ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు పెరిగారని.. దీనివల్ల దేశం సురక్షితంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

చొరబాటుదారులు భారతదేశంలో అశాంతిని సృష్టిస్తే ఉపేక్షించబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం సహాయపడుతుందన్నారు. బంగ్లా నుంచి బెంగాల్‏కు వచ్చే అక్రమ చొరబాట్లపై మమతా బెనర్జీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్ నుంచే దేశంలోకి ఎక్కువ అక్రమ వలసలు జరుగుతున్నాయి. 

బెంగాల్‎లోని తృణమాల్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆధార్ కార్డులు అందేలా చూస్తోంది. తద్వారా వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారని నిప్పులు చెరిగారు. దక్షిణ 24 పరగణాలలో గరిష్ట సంఖ్యలో అక్రమ ఆధార్ కార్డులు కనుగొన్నాం. కానీ బెంగాల్ పౌరులు చింతిచొద్దు. ఎందుకంటే మేము వచ్చే ఏడాది బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వెంటనే బంగ్లా-బెంగాల్ బార్డర్లో పెండింగ్‎లో ఉన్న 450 కి.మీ ఫెన్సింగ్ నిర్మాణం పూర్తి చేసి అక్రమ వలసలను పూర్తిగా అరికడతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025 ఏంటి..?

ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025 ప్రకారం.. ఇకపై విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి లేదా దేశంలో ఉండటానికి లేదా దేశం నుండి బయటకు వెళ్లడానికి నకిలీ పాస్‌పోర్ట్ లేదా వీసాను ఉపయోగిస్తున్నట్లు తేలితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది.

ఈ చట్టం ప్రకారం.. దేశంలోని హోటళ్ళు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు విదేశీయుల సమాచారాన్ని తప్పని సరిగా సేకరించాలి. తద్వారా వీసా, పాస్‎పోర్టు గడువు ముగిసిపోయిన కూడా భారత్‎లోనే ఉంటోన్న విదేశీయులను ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటారు. చట్టబద్ధమైన పాస్‌పోర్ట్ లేదా వీసా, ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోని ఏదైనా ప్రాంతంలోకి ప్రవేశించే విదేశీయుడు.. చట్టంలోని నిబంధనలను  ఉల్లంఘించినట్లయితే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 5 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించబడేలా ఈ చట్టంలో పొందుపర్చిచారు. 

విదేశీయులు, వలసలకు సంబంధించి ప్రస్తుతం దేశంలో నాలుగు చట్టాలు ఉన్నాయి. అవి.. పాస్‌పోర్ట్ (భారతదేశంలోకి ప్రవేశం) చట్టం. 1920 విదేశీయుల నమోదు చట్టం. 1939 విదేశీయుల చట్టం, 1946 వలస చట్టం. ఇప్పుడు ఈ నాలుగు చట్టాలు రద్దై.. ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం 2025 చట్టం అమల్లోకి వస్తోంది.