నాలుగో విడత పోలింగ్.. ఏఏ రాష్ట్రాల్లో అంటే?

 నాలుగో విడత పోలింగ్.. ఏఏ రాష్ట్రాల్లో అంటే?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏపీ(25 ఎంపీ సీట్లు), బిహార్(5), ఝార్ఖండ్(4), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఒడిశా(4), తెలంగాణ(17), యూపీ(13), ప.బెంగాల్(8), జమ్ముకశ్మీర్(1) ఈ 4వ విడతలో ఉన్నాయి. మే 20, 25, జూన్ 1న తదుపరి విడతల పోలింగ్ ఉంటుంది. జూన్ 04వ తేదీన  ఫలితాలు వెలువడనున్నాయి. 

 తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో  మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లో 45 మంది,  ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.   ఇక ఏపీ విషయానికి వస్తే  25 లోక్‌సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387మంది పోటీలో నిలిచారు.  తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి ఆరుగురు పోటీలో ఉన్నారు.

ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. పోలింగ్ కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీసు విభాగాలు పాల్గొంటున్నాయని చెప్పారు. 164 కేంద్ర బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్ డ్ బృందాలు వచ్చాయన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సోదాల్లో రూ.320 కోట్ల సొత్తు సీజ్ చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. 48 గంటల్లో వచ్చే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ దగ్గర పడటంతో నిఘా మరింత పెరుగుతుందని తెలిపారు. ఎల్లుండి రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.