విద్య , వైద్యం ఫ్రీగా ఇయ్యాలే

విద్య , వైద్యం ఫ్రీగా ఇయ్యాలే
  • ఐఐజీహెచ్​ సెమినార్​లో జయప్రకాశ్ నారాయణ్​​ 
  • 8 ఏండ్లలో రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడి 
  • రిపోర్టును చెన్నై నుంచి విడుదల చేసిన గవర్నర్​ తమిళిసై 

హైదరాబాద్, వెలుగు : విద్య, వైద్యం ఫ్రీగా అందించాల్సిన అవసరం ఉందని, అప్పుడే  పేదరికం తగ్గుతుందని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్​ నారాయణ్​ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీలకు వలసలు మరింత పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గత 8 ఏళ్లలో తెలంగాణకు డిపార్ట్ మెంట్ల వారీగా కేంద్రం ఇచ్చిన నిధుల  వివరాలను  ఐఐజీహెచ్ (ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇన్​క్లూజివ్ గవర్నెన్స్ హైదరాబాద్)  రిపోర్ట్ రూపంలో తయారు చేసింది. ఈ నివేదికను గవర్నర్ తమిళిసై శనివారం చెన్నై నుంచి ఆన్​లైన్​లో విడుదల చేయగా, బేగంపేట టూరిజం ప్లాజాలో జయప్రకాశ్​ నారాయణ్, బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ భానుమూర్తి విడుదల చేశారు. అనంతరం జరిగిన సెమినార్​లో పలు అంశాలపై రిసెర్చ్ స్కాలర్లు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు చర్చించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ పార్టీలు మ్యానిఫెస్టోలో పెడుతున్న అన్ని హామీల అమలు సాధ్యం కాదన్నారు.

తమిళనాడులో ఓట్ల సమయంలో కలర్ టీవీలు ఇస్తామని డీఎంకే ప్రకటించిన టైమ్ లో తాను ఈసీకి లేఖ రాశానని గుర్తుచేశారు. అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఫెస్టిసైడ్లపై అధిక సబ్సిడీ ఇస్తున్న దేశం మనదే అని ఆయన అన్నారు. యూరియా తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కారణంగా, దిగుబడి అధికంగా రావాలన్న ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో యూరియా వినియోగిస్తున్నారని, దీనివల్ల భూసారం తగ్గి, పంట దిగుబడి తగ్గుతోందన్నారు. వంటనూనెల ధరలు పెరగడం, దిగుమతులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయిల్ ఫాంను మరింత ప్రొత్సహించాలని ఆయన సూచించారు.