లోకాయుక్త, లోక్ పాల్ అధికారాలు, విధులేంటి.?

లోకాయుక్త, లోక్ పాల్ అధికారాలు, విధులేంటి.?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సాధారణ పరిపాలనలో చేపట్టిన చర్యల్లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగంపై అవినీతి అక్రమాలపై విచారణ జరపడం కోసం ఏర్పాటు చేసిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ లోకాయుక్త, ఉపలోకాయుక్త. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విభాగంలో అనుభవజ్ఞులైన వ్యక్తులను లోకాయుక్త, ఉపలోకాయుక్తలో సభ్యులుగా నియమిస్తుంది. 

1982లో ఎన్.టి.రామారావు ప్రభుత్వ కాలంలో శాసనసభ ఆమోదించిన లోకాయుక్త బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు కేంద్రానికి పంపించగా, 1983, ఆగస్టులో రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, ఉపలోకాయుక్త చట్టంగా ఉనికిలోకి వచ్చింది. ఇప్పటివరకు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం 19 రాష్ట్రాల్లో మా లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాగా, 9 రాష్ట్రాల్లో  ఏర్పాటు చేయలేదు.

లోకాయుక్త పరిధిలోకి వచ్చేవారు

  • రాష్ట్ర మంత్రులు
  • విధానసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు
  • ప్రభుత్వ ఉద్యోగులు
  • జిల్లా పరిషత్ చైర్మన్లు, పరిషత్ అధ్యక్షులు
  • మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు

ప్రభుత్వ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు, ప్రభుత్వ సహాయం పొందే సంస్థల అధికారులు, కో–ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు
యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, ప్రభుత్వ 
కార్యదర్శులు, యూనివర్సిటీ రిజిస్టార్లు.

విచారణకు అవకాశం లేనివారు

ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అకౌంటెంట్ జనరల్, హైకోర్టు ప్రధాన, ఇరత న్యాయమూర్తులు, జ్యుడీషియల్ సర్వీసులకు చెందినవారు. 

నియామకం

లోకాయుక్త, ఉప లోకాయుక్తలను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. లోకాయుక్తగా, ఉపలోకాయుక్తగా నియామకమయ్యే వారు హైకోర్టులో న్యాయమూర్తిగా గానీ, ప్రధాన న్యాయమూర్తిగా గానీ పనిచేసినవారు లేదా పనిచేస్తున్న వారై ఉండాలి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత నియమిస్తారు. ఉపలోకాయుక్తగా నియామకమయ్యే వారు జిల్లా  జడ్జీలుగా పనిచేసిన వారై ఉండవచ్చు. లోకాయుక్తగా, ఉపలోకాయుక్తగా పనిచేసేవారు పార్లమెంట్ లేదా శాసనసభల్లో సభ్యులుగా కొనసాగరాదు. ఆదాయాన్నిచ్చే ఉద్యోగులుగా కొనసాగరాదు. ప్రభుత్వ సంస్థల్లో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన వారై ఉండరాదు. రాజకీయ పార్టీలతో సంబంధం కలిగిన వారై ఉండరాదు. 

పదవీకాలం

లోకాయుక్త, ఉపలోకాయుక్తలుగా పనిచేసేవారు ఐదేండ్లు పదవిలో కొనసాగుతారు. పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా చేయాలంటే తమ రాజీనామాను రాష్ట్ర గవర్నర్​కు సమర్పించాలి. లోకాయుక్తగా లేక ఉప లోకాయుక్తగా పనిచేసినవారు అనంతర కాలంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు. 

►ALSO READ | Good News : సీబీహెచ్ఎఫ్ఎల్​లో 212 పోస్టులు

తొలగించే పద్ధతిఆంధ్రప్రదేశ్​ లోకాయుక్త, ఉపలోకాయుక్త చట్టం–1983 ప్రకారం అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలపై వీరిని పదవి నుంచి తొలగించే అధికారం గవర్నర్​కు ఉన్నది. లోకాయుక్త, ఉపలోకాయుక్తలపై వచ్చే ఆరోపణలను రాష్ట్ర శాసనసభ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానించిన తర్వాత మాత్రమే గవర్నర్ వారిని పదవి నుంచి తొలగిస్తారు. శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికంటే ముందు ఆరోపణలను విచారించడానికి గవర్నర్ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయవచ్చు. లోకాయుక్త, ఉపలోకాయుక్త తొలగింపునకు గురైనవారు అనంతర కాలంలో ఎలాంటి పదవులకు పోటీ చేయడానికి అర్హులు కారు. 

విచారించే పద్ధతులు 

  • రూ.150 డీడీ చెల్లించి ఫిర్యాదు చేసిన సందర్భంలో విచారణ.
  • గవర్నర్ ఆదేశాలను అనుసరించి విచారణ.
  • సుమోటో కేసులు నమోదు చేసి విచారించవచ్చు.
  • ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారిపై విచారణ.
  • అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ.
  • ఆరు నెలలలోగా విచారణ పూర్తి చేయాలి. ప్రత్యేక కారణాలు ఉన్నట్లయితే మరో ఆరు నెలల వరకు సమయాన్ని పొడిగించవచ్చు. అంటే ఏడాదికాలంలో విచారణ పూర్తిచేయాలి.

సివిల్​ కోర్టు అధికారాలు

లోకాయుక్తకు సివిల్​కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. అంటే విచారణ సందర్భంలో లోకాయుక్త సంబంధిత అధికారులు, వ్యక్తులను తమ ముందు హాజరై అవసరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశించవచ్చు. సంబంధిత రికార్డులను పరిశీలనకు పంపాలని అధికారులను ఆదేశించవచ్చు. అఫిడవిట్లను కోరవచ్చు. సంబంధిత సంస్థలకు సంబంధించిన వివరాలను తెలపాలని ఆదేశించవచ్చు. 

లోక్​పాల్​ వ్యవస్థ 

ఎలాంటి రాజ్యాంగబద్ధత లేకుండా చట్టబద్ధమైన సంస్థగా లోక్​పాల్ ను ఏర్పాటు చేశారు. లోక్​పాల్ వ్యవస్థలో ఒక చైర్మన్ తోపాటు ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. 

చైర్మన్: సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా లేదా సాధారణ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి లేదా ప్రముఖ న్యాయ నిపుణులై ఉండాలి. 
4 సభ్యులు: సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో ప్రధాన లేదా న్యాయమూర్తులుగా పనిచేసిన వారై ఉండాలి.
4 సభ్యులు: సీవీసీ, సీబీఐ, ఈడీ, ఏసీబీ లాంటి అవినీతి నిరోధక శాఖల్లో కనీసం 25 సంవత్సరాలు పనిచేసిన అనుభవజ్ఞులై ఉండాలి. 

అర్హతలు/ అనర్హతలు

లోక్​పాల్​లో సభ్యులుగా నియామకమయ్యేవారు 45 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.పార్లమెంట్​లో సభ్యుడిగా, శాసనసభ సభ్యుడిగా కొనసాగరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో క్రమశిక్షణ చర్యలకు గురై ఉండరాదు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారై ఉండరాదు. కేంద్ర, రాష్ట్రాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు చేసిన వారై ఉండరాదు. క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటూ రాజకీయ పార్టీల్లో సభ్యులుగా కొనసాగరాదు. 

నియామక పద్ధతి

లోక్​పాల్ చైర్మన్, ఎనిమిది మంది సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సూచనను అనుసరించి రాష్ట్రపతి నియమిస్తారు.  

సెలెక్షన్ కమిటీ: ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,  లోక్​సభ స్పీకర్, లోక్​సభల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, భారత రాష్ట్రపతి నియమించిన న్యాయ నిపుణుడు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సెర్చ్ కమిటీ సమర్పించిన జాబితాలోని సభ్యుల పేర్లను ఆధారంగా చేసుకుని లోక్​పాల్ వ్యవస్థలోని సభ్యులను సెలెక్ట్ చేయగా, రాష్ట్రపతి నియమిస్తారు. 

సెర్చ్ కమిటీ: లోక్​పాల్ వ్యవస్థ నిర్మాణంలో పేర్కొన్న అర్హతలను ఆధారంగా చేసుకుని దేశంలో అనుభవజ్జులైన వారి పేర్ల జాబితాను సెర్చ్ కమిటీ రూపొందిస్తుంది. ఒక చైర్మన్ ఆధ్వర్యంలో ఎనిమిది మందికి మించకుండా సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 


లోక్ పాల్ పరిధి

  • ప్రధాన మంత్రి (దేశ రక్షణ, విదేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను మినహాయించి)
  •  కేంద్ర మంత్రి మండలి సభ్యులు.
  •  లోక్​సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు.
  •  కేంద్ర ప్రభుత్వ అధికారులు.
  •  ఏడాదికి 10 లక్షల కంటే ఎక్కువ విదేశీ విరాళాలు పొందే ఎన్​జీవోలు.
  •  ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే అధికారులు.
  •  వివిధ కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు.
  •  అఖిల భారత సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులు.

లోక్​పాల్  పదవీకాలం 

లోక్​పాల్  వ్యవస్థలో చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేండ్లు లేదా 70 ఏండ్లు అంటే ఏది ముందు పూర్తయితే దానిని ఆధారంగా పదవి నుంచి వైదొలుగుతారు. పదవీకాలం పూర్తికాక ముందే రాజీనామా చేయాలనుకుంటే  రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. అసమర్థత, దుష్ప్రవర్తన అనే ఆరోపణల ఆధారంగా సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ చేసిన తర్వాత ఆ ఆరోపణలు రుజువైతే రాష్ట్రపతి లోక్​పాల్ సభ్యులను పదవి నుంచి తొలగిస్తారు. 

లోక్​పాల్ వ్యవస్థలో సభ్యులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత అనంతర కాలంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు.  లోక్​పాల్​లో సభ్యులుగా పనిచేసిన వారు పదవీ విరమణ అనంతరం ఐదేండ్ల వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు పార్లమెంట్, శాసనసభలు,స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హులు కారు.