ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణలు విచారించడానికి లోకాయుక్త సంస్థను నియమించాలని ప్రభుత్వాన్ని పాలన సంస్కరణల కమిషన్ (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కమిషన్ ) కోరింది. అందుకు అనుగుణంగా 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చింది. సామాన్యుడికి తక్కువ ఖర్చుతో తొందరగా న్యాయం చేకూరేలా అలాగే పాలనలో అవినీతి, తప్పుడు నిర్ణయాలు ఆశ్రిత పక్షపాతం వంటి వాటిని నివారించుటకు లోకాయుక్త చట్టం తీసుకురాబడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత 1983 లోకాయుక్త చట్టాన్ని కొద్ది మార్పులతో తెలంగాణ రాష్ట్రం అన్వయించుకొని 2017లో తెలంగాణ లోకాయుక్త చట్టాన్ని అమలులోనికి తీసుకురావడమైంది. కేంద్ర ప్రభుత్వం 2013లో కేంద్రంలో లోక్పాల్ , రాష్ట్రాలలో లోకాయుక్తలను నియమించాలని చట్టం చేయడంతో చాలా రాష్ట్రాలలో లోకాయుక్తల నియామకం జరిగింది. అయితే తెలంగాణలో అప్పటికే చట్టం ఉండటం వల్ల అలాగే లోకాయుక్త, ఉప లోకాయుక్త పనిచేస్తున్నారు.
లోకాయుక్తగా నియమించబడే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తి లేదా విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి. లోకాయుక్త నియామకంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్ర గవర్నర్ లోకాయుక్తను నియమిస్తారు. అలాగే ఉప లోకాయుక్త జిల్లా జడ్జి హోదా కలిగిన వ్యక్తిని హైకోర్టు సూచించిన విధంగా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఉప లోకాయుక్త, లోకాయుక్త అధీనంలో పనిచేస్తారు.
లోకాయుక్త ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. కేసుల పరిష్కారంలో సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా విధి విధానాలు ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలకు తొందరగా తీర్పు ఇచ్చే విధంగా పనిచేస్తుంది. లోకాయుక్త ముందుకు వచ్చిన ఫిర్యాదులను సంవత్సరం లోపు విచారణ జరిపి తీర్పు ఇవ్వాలి. కోర్టులను ఆశ్రయించి సంవత్సరాల తరబడి ఎదురుచూసేబదులుగా లోకాయుక్తలో ఫిర్యాదు సంవత్సరంలోపు పూర్తి కావడం బాధితులకు ఎంతో ఊరట కలిగిస్తుంది. లోకాయుక్తలో ఫిర్యాదు చేయుటకు నిర్దేశించిన ఫారంలో విషయాలు రాసి, రూ.150 డీడీ ద్వారా లోకాయుక్త కార్యాలయంలో చెల్లించిన ఫిర్యాదు నమోదు చేస్తే విచారణ జరుగుతుంది.
పెరిగిన రాజకీయ నేతల అవినీతి
2017 సంవత్సరంలో లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ కాలం ముగియడంతో తదుపరి నియామకాలు జరగలేదు. దానితో తెలంగాణ రాష్ట్రంలో లోకాయుక్త ఉండి కూడా లేని పరిస్థితికి వచ్చింది. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ వేయడం (9/2019) కోర్టువారి ఆదేశాలతో లోకాయుక్త, ఉపలోకాయుక్తల నియామకం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత రాజకీయ నాయకుల అవినీతి బాగా పెరిగిపోయింది.
ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ? అన్న చందాన రాజకీయనాయకుల విచ్చలవిడి అవినీతి, తప్పుడు నిర్ణయాలను, ఆశ్రిత పక్షపాతం వంటి వాటిని ఆసరాగా తీసుకుంటూ అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. న్యాయంగా పొందవలసిన ఏ చిన్న పనికైనా లంచం ఇవ్వనిదే పని జరిగే పరిస్థితి లేకుండాపోయింది. ఇక రాజకీయనాయకులు తప్పుడు నిర్ణయాలను, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు, గొర్రెల పంపకం వంటి వాటిని ప్రశ్నించే వేదిక లేకుండా పోయింది.
పాలనలో పారదర్శకత జవాబుదారీతనం లోపించి రాజకీయ నాయకుల తప్పుడు నిర్ణయాలను నిలదీసే వ్యవస్థే లేకుండాపోయింది. కోర్టులు ఉన్నా.. రాజకీయనాయకుల అధికార దుర్వినియోగం, తప్పుడు నిర్ణయాలు, అవినీతి వంటి వాటిపై ప్రశ్నించడం ఖర్చుతో కూడుకున్న పనియే కాక తొందరగా పరిష్కరించే పరిస్థితి లేదు.
పకడ్బందీగా లోకాయుక్త చట్టం
చాలా రాష్ట్రాలలో లోకాయుక్త చట్టం పకడ్బందీగా ఉంది. లోకాయుక్తకు రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు శీఘ్రగతిన విచారించే యంత్రాంగం అలాగే అధికారాలు ఉన్నాయి. పక్క రాష్ట్రమైన కర్నాటకలో లోకాయుక్త ముఖ్యమంత్రితో సహా అందరు రాజకీయ నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలను, తప్పుడు నిర్ణయాలను అధికార దుర్వినియోగాన్ని ఆదాయానికి మించిన ఆస్తులు వంటి వాటిపై విచారణ చేసే అధికారముంది. అప్పటి కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు రాగా కర్నాటక లోకాయుక్త విచారణ జరిపి అవినీతి ఆరోపణలు నిజమేనని తేల్చడంతో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1983 నుంచి లోకాయుక్త పనిచేస్తున్నా దానికి రాజకీయ నాయకులపై విచారించే అధికారం లేదు. చిన్న చిన్న భూతగాదాలు ప్రభుత్వ కార్యాలయాలలో నిలిచిపోయిన పనులు వంటి వాటిలో విచారణ వరకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పెద్దలు కావాలని లోకాయుక్త పరిధి నుంచి శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రిపై విచారించే అధికారాలు చట్టంలో పొందుపరచలేదు.
లోకాయుక్తతో అవినీతికి కళ్లెం
2017లో తెచ్చిన తెలంగాణ లోకాయుక్త చట్టంలో మంత్రులపై కార్యదర్శులపై ఫిర్యాదు చేయాలన్నా ముఖ్యమంత్రి అనుమతి కావాలి. అలాగే శాసనసభ, శాసన మండలి సభ్యులపై ఫిర్యాదులకు సభాపతి అనుమతి కావాలి. ఇంతవరకు ఇటువంటి అనుమతులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ కర్నాటక రాష్ట్రంలో లోకాయుక్తకు ఉన్న అధికారాలు తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తకు ఉంటే చాలామంది శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి తమ పదవులు కోల్పోయేవారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన రాజకీయనాయకులు జైలులో ఉండేవారు.
గత పది సంవత్స రాలలో రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం, తప్పుడు నిర్ణయాలు, అవినీతి ఆశ్రిత పక్షపాతం వంటివి తారస్థాయికి చేరాయి. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంతో తప్పుడు పనులు ఆగుతాయని అనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవినీతి రహిత సుపరిపాలన అందించా లంటే కర్నాటక మాదిరిగా లోకాయుక్త చట్టానికి సవరణలు చేస్తూ లోకాయుక్తకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు, శాసనసభ్యులపై వచ్చే అవినీతి, అధికార దుర్వినియోగం వంటి వాటిపై విచారణ జరిపే అధికారాలు, తగిన సిబ్బందిని ఇస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న రాజకీయ అవినీతికి కళ్ళెం వేయవచ్చు.
ఎం. పద్మనాభరెడ్డి,
అధ్యక్షుడు,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్