వెయ్యి కోట్లకు పైగానే అక్రమ మైనింగ్​ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త

వెయ్యి కోట్లకు పైగానే అక్రమ మైనింగ్​ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ప్రభుత్వ సర్వే నెంబర్లలో ఉన్న గుట్టల మట్టిని వ్యాపారులకు తవ్వుకోవడానికి ఇవ్వగా, వాటి హద్దులను అధికారులు చూపకపోవడంపై లోకాయుక్త ఎంక్వైరీ ఆఫీసర్ ​మాథ్యూ కోషి అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని కోయచలక రెవెన్యూ పరిధిలోని192/1,యం.చింతగుర్తి రెవెన్యూలోని 266/1, 266/312...366 నుంచి 327 ఉన్న సర్వే నెంబర్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో జరిపిన అక్రమ మైనింగ్​పై సామాజిక కార్యకర్త కోయిని వెంకన్న ఫిర్యాదు చేశారు. 

దీంతో లోకాయుక్త విచారణాధికారి మాథ్యూ కోషి బుధవారం ఖమ్మం వచ్చారు. తహసీల్దార్ ఆఫీస్​కు వచ్చిన ఆయన సర్వే నెంబర్ల  వివరాలు హద్దుల గుర్తింపుపై ఆయా శాఖల ఆఫీసర్లను వివరాలడిగారు. తర్వాత అక్రమ మైనింగ్ జరిగిన పువ్వాడ ఉదయ్ నగర్ లోని పీర్లగుట్ట భూమిని పరిశీలించారు. అక్కడ 17 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మట్టి తవ్వకాల కోసం వ్యాపారులకు ఇచ్చిన భూమి హద్దులు చూపాలని అధికారులను కోరగా వారు స్పందించిలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  

ఫైన్​కట్టలే..తవ్వుకుపోతున్నరు

సర్వే నెంబర్లు 30,280లలో అక్రమార్కులు 11 హెక్టార్లలో గ్రావెల్ తవ్వకానికి అనుమతి పొంది 280 ఎకరాల్లో మట్టి తవ్వి అమ్ముకున్నారని ఫిర్యాదుదారుడు కోయిని వెంకన్న ఎంక్వైరీ ఆఫీసర్ ​మాథ్యూ కోషి దృష్టికి తెచ్చారు. వ్యాపారులు 70 వేల క్యూబిక్ మీటర్ల పర్మిషన్ పొంది..16 లక్షల క్యూబిక్ మీటర్లు అదనంగా తవ్వారన్నాడు. ఇందులో మొత్తంగా రూ. వేయి కోట్లకుపైగానే అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపించారు. పువ్వాడ ఉదయ్ నగర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల పొడవు, అర కిలోమీటర్ వెడల్పు, ఐదు వందల మీటర్ల లోతు మైనింగ్ చేశారని చెప్పాడు. 2020లోనే తాను ఫిర్యాదు చేయగా 2022లో లోకాయుక్త విచారణ జరిపి కాంట్రాక్టర్​ రావెళ్ల సురేశ్​కు రూ.16 కోట్ల జరిమానా విధించిందని, ఆ ఫైన్ కట్టకపోగా, అవినీతి కూడా ఆగలేదన్నారు. 

సర్వే  నెంబర్ 37లో అక్రమార్కులు బెరైటీ రాళ్లు, మట్టి తవ్వకాలు జరిపితే, ఫైన్ వేసిన రూ.3 కోట్ల 96 లక్షలు కూడా చెల్లించలేదన్నారు. ఇంకా అక్రమాలు చేస్తూనే ఉన్నారన్నారు. సర్వే నెంబర్1912/1లో వ్యాపారి రావెళ్ల అశోక్ 4 హెక్టార్లను తెలంగాణ మినరల్స్ పేరుపై 2016లో అనుమతి పొంది, ఐదేండ్లున్న లీజులో తవ్వాల్సిన మట్టిని ఏడాదిలోనే తరలించుకుపోయాడన్నారు. ఇంకా అక్రమంగా మట్టి తవ్వుకుపోతున్నా అధికారులు ఆపలేకపోయారన్నారు. తను ఫిర్యాదు చేశాక విచారణ కోసం మైనింగ్ డైరెక్టర్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,మూడు పర్యాయాలు లోకాయుక్త వచ్చి విచారణ జరుపుతున్నా అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదేన్నారు. తహసీల్దార్ లూథర్ విల్సన్, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసరావు, మైనింగ్ శాఖ ఆఫీసర్లు, మండల కాంగ్రెస్ పార్టీ లీడర్ మందా బుచ్చి బాబు ఉన్నారు.