సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు

సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు

బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ లో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త శుక్రవారం కేసు నమోదు చేసింది. మూడు రోజుల క్రితం కర్నాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ ఎఫ్​ఐఆర్ సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొంది. ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామితో పాటు మరోవ్యక్తి పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది.'ముడా' స్థలాల కేటాయింపులో రూ.4 వేల కోట్ల అక్రమాలు జరిగాయని.. ఇందులో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుటుంబసభ్యులకు లబ్ది చేకూర్చారని సామాజిక కార్యకర్త అబ్రహం గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆగస్టు 16న సీఎంను విచారించేందుకు గెహ్లాట్ అనుమతిచ్చారు. ఈ అనుమతిని రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా గవర్నర్  తోసిపుచ్చారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతివ్వడం చట్టబద్ధమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాగా, కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు పార్టీ అండగా నిలుస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌‌ను తప్పుపట్టారు. ఆయనపై ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదని..దోషిగా నిర్ధారణ కాలేదన్నారు.