ముడా కేసు.. సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు

ముడా కేసు.. సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు

మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 6న బుధవారం ఉదయం విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

లోకాయుక్త పోలీసులు పంపిన సమన్లపై సిద్ధరామయ్య స్పందించారు. చెప్పిన తేదీ ప్రకారం, లోకాయుక్త ముందు హాజరవుతానని తెలిపారు. 

ALSO READ : టపాసుల డబ్బాపై కూర్చోబెట్టి మంట పెట్టారు.. పందెంలో కుర్రోడి ప్రాణమే పోయింది

"అవును.. ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళతాను.." అని సిద్ధరామయ్య అన్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా సిద్ధరామయ్య భార్య పార్వతిని లోకాయుక్త పోలీసులు ప్రశ్నించారు.

ఏంటి ఈ ముడా స్కామ్..?

మూడేళ్ల క్రితం అనగా, 2021లో ముడా అభివృద్ధి కోసం ప్రభుత్వం..  సీఎం సిద్ధరామయ్య స్వగ్రామమైన మైసూరులోని కేసరే గ్రామంలో ఆయన భార్య పేరిట గల 3 ఎకరాల 16 గుంటల భూమిని స్వాధీనం చేసుకుంది. అందుకు ప్రతిఫలంగా ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే దక్షిణ మైసూర్‌లోని విజయనగర్‌లో భూములను కేటాయించింది.

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి ధరలతో పోలిస్తే.. వారికి కేటాయించిన భూముల ధర చాలా ఎక్కువని, ఈ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆర్టీఐ కార్యకర్త ఇబ్రహీం ఫిర్యాదు చేశారు. దీనికి రాజకీయ రంగు పులుముకోవడం సిద్ధరామయ్య తలకు ఈ భూములు ఉచ్చులా మారాయి. మొదట ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పిన సిద్ధరామయ్య.. ఈ తలనొప్పంతా ఎందుకని తన భార్యకు కేటాయించిన భూములను సైతం తిరిగి ముడాకు అప్పగించారు. అయినప్పటికీ ఆయన ఈ చిక్కుల నుంచి బయట పడలేకపోతున్నారు.

కాగా, తనకు ఖరీదైన ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) అధికారులకు సిద్ధరామయ్య భార్య పార్వతి లేఖ రాసినట్లు ఇటీవల వెలుగు చూసింది. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రిపబ్లిక్‌ కన్నడ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఓ కథనంలో ప్రచురించింది.