నేను తడబడను.. ఎడిట్ చేసి పెడుతున్నారు: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరిదృష్టి ఐటీ మంత్రి లోకేశ్ పైనే ఉంది. ఆయన మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై నవ్యాంధ్ర రాష్ట్ర తొలి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు లోకేశ్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాంతం పరిధిలోని మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మంగళగిరిలో టీడీపీకి సిట్టింగ్ సీట్ కాదు. కానీ.. అది అమరావతి డెవలప్ మెంట్ జోన్ లో ఉండటంతో.. టీడీపీకి అది సేఫ్ జోన్ గా పరిగణిస్తున్నారు. లోకేశ్ పోటీతోపాటు… ఆయన ప్రసంగాలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఐతే.. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో పలుమార్లు తడబడిన లోకేశ్… విమర్శల పాలయ్యారు. వీ6 ప్రత్యేకంగా ఇదే అంశంపై ఆయనను ఓ సందర్భంలో ప్రశ్నించింది. వీ6 ఛానెల్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.

“మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. షార్ప్ గా కట్ చేస్తూ మాట్లాడుతున్నారు.  గెలుపుపై ధీమాగా ఉన్నారు. కొన్నికొన్నిసార్లు ఎందుకు తడబడుతున్నారు ?” అని ప్రశ్నించింది.

దీనికి బదులిచ్చిన లోకేశ్… తానెప్పుడూ తడబడలేదన్నారు. అదంతా ప్రతిపక్షాలు చేసే ప్రయత్నమే అన్నారు. “నేను తడబడను. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఇలా చేస్తాయి. యూట్యూబ్ లో నా మాటల కటింగ్ లు పెట్టి… ఈ మాటను ఆ మాట మార్చి… గుచ్చి చేస్తారు(హావభావాలతో చెబుతూ..). ఇలాంటివాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు… ప్రజలకు నేను సమాధానం చెప్పుకుంటాను” అని లోకేశ్ చెప్పారు.