ఎన్నికల ​బరిలో లోకేశ్: మంగళగిరి నుంచి పోటీ

 వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయనను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేశారు. లోకేశ్ ను రంగంలోకి దించడంతో మంగళగిరి గ్రూపు రాజకీయాలకు చంద్రబాబు చెక్ పెట్టారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంగళ గిరిలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2014 ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి ఓడిపోయారు. గెలిచిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి టీడీపీ నేతలకు తల నొప్పిగా మారారు. రాజధాని ప్రాంతంలో సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయం పై ఆయన కోర్టుకెక్కారు. లోకేశ్ ను రంగంలోకి దించడం ద్వారా ప్రత్యర్థిని ఓటమి, రాజ ధాని ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించ వచ్చని బాబు భావిస్తున్నారు.