భారతీయ ఏకాత్మ దర్శనం లోక మంథన్‌‌‌‌‌‌‌‌

భారతీయ ఏకాత్మ దర్శనం  లోక మంథన్‌‌‌‌‌‌‌‌

భారతదేశంలో  ప్రతి 100 కిలోమీటర్లకు  జనజీవన  స్రవంతిలో  ఆహార పద్ధతి  మారుతుంది.  వేష, భాషలు  మారతాయి.   భాష ఒకటే  అయినా యాస మారుతుంది.  కులాచారాలు వేరుగా ఉంటాయి. ఆచార సంప్రదాయాలు  వేర్వేరుగా  ఉంటాయి.  ఆరాధన పద్ధతులు  కూడా  వేరుగానే ఉంటాయి.  ప్రతిప్రాంతంలో కళారూపాలు  భిన్నంగా  కనిపిస్తాయి.  ప్రకృతిని చూసే దృష్టి వేరేగా ఉంటుంది. అయితే ఇవన్నీ భిన్నంగా కనిపించినప్పటికీ వీటిలో ఉండే  సూత్రం మాత్రం ఒకటే.  అదే  భారతీయ ఏకాత్మత భావం. ఇన్ని వేర్వేరు దర్శనాలు ఉన్నప్పటికీ  అందులోని  నిదర్శనాలు ఒక్కటే.  ఇలాంటి  భారతదర్శనాన్ని  మొదటిసారి  భాగ్యనగర  ప్రజలకు తెలియపరిచేందుకు లోకమంథన్‌‌‌‌‌‌‌‌  కార్యక్రమం జరగునుంది.  భారతీయ  భాషలన్నిటికీ 14 మహేశ్వర  సూత్రాలు  ఆధారమైతే  వాటి నుంచి ఎన్నో లిపి ఉన్న భాషలు పుట్టుకొచ్చాయి.  


లిపిలేని కొన్ని భాషలకు ఇప్పుడిప్పుడు లిపి కూడా తయారు చేస్తున్నారు.  ఉత్తరప్రదేశ్​లో  మాట్లాదే అవధి,   తెలంగాణలో  మాట్లాడే  గోండు భాష,  నార్త్‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌    లో  మాట్లాడే నాగ.. వాటన్నింటిలో  వర్ణ విన్యాసం ఒక్కటే.  ఆ అన్న అక్షరం ప్రణవ సంబంధమైన ఓం శబ్దం లాంటి మూలం కనిపిస్తుంది.   సంస్కృతంలో  ప్రసిద్ధమైన పాణినీయం అయినా.. గోండుల వంశపారంపర్య కథ గాయకులైన పర్ధన్లు  దాచుకున్న పదజాలమైన ఒకే రకమైన ధ్వనిని తెలియజేస్తుంది.  బొబ్బిలి యుద్ధగాథను గానం చేసే దండ దాసర్లు చెప్పిన కథలోని సారాంశమైనా లవకుశలు చేసిన రామకథా గానమైనా అందులో ఉన్న ధర్మం ఒక్కటే.  వాటి లక్ష్యం ధర్మాన్ని నిలబెట్టడం. స్వేచ్ఛకోసం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడమే.  

కొలనుపాక చైతన్యం

కులతత్వ నిరసన చేయడం కోసం కొలనుపాకలోని 18 కుల మఠాలకు చెందిన కుల పురాణ కళాకారులు జాంబ పురాణం వంటి ఉపకథలను సమాజానికి అందించి సమాజంలో  చైతన్యం కలిగించారు. ఒక విస్తృతమైన సామాజిక ఉద్యమాన్ని సాధారణ పద్ధతుల్లో తీసుకువెళ్లడం కళారూపాల ప్రతిభకు తార్కాణం. మన దగ్గర కూచిపూడి వీధి భాగవతులలా తంజావూరు జిల్లాలో మేలటూరు వూర్తుకుడి శూల మంగళం వంటి ప్రాంతాలలో భాగవత కళాకారులు విస్తృత ప్రాచర్యం 16వ శతాబ్దం నుంచి పొందారు. 

అంతా భారతీయ దర్శనమే

తెలంగాణలో  ఒక్క  చెర్విరాల బాగయ్య 100 యక్షగానాలు రచించి ప్రజల్లో కళాభిమానాన్ని,  ధర్మాగ్రహాన్ని ఏకకాలంలో చూపించగలిగాడు.  కళల  ద్వారా  ఇంత  అద్భుతమైన పనిచేయవచ్చని వీళ్లంతా నిరూపణ చేశారు. అలాగే,   త్యాగరాజ కీర్తనలు,  సారంగపాణి  పదాలు,  క్షేత్రయ్య  మువ్వగోపాల పదాలు ఎంత ప్రాచుర్యం పొందాయో భద్రాచల రామదాసు  కీర్తనలు,  తూము నరసింహదాసు సంకీర్తనలు అంతే శక్తిమంతమైనవిగా సమాజంలోకి వెళ్లాయి.    వాటిల్లో ప్రతిబింబించేది భారతీయత.  వాల్మీకి రామాయణంలోని రాముని  పాత్ర  ఎంత ధర్మ ప్రబోధం కలిగిస్తుందో  కంబన్‌‌‌‌‌‌‌‌.. దేశ భాషల్లో  తొలిసారి తమిళంలో రాసిన కంబన్‌‌‌‌‌‌‌‌ రామాయణం ద్వారా  రాముని ధర్మనిష్టను అక్కడి ప్రాంత ప్రజలకు అంతే గొప్పగా వివరించే ప్రయత్నం చేశాడు.

 అమర్​నాథ్‌‌‌‌‌‌‌‌  క్షేత్రంలో  చెప్పే సంకల్పమైనా  రామేశ్వరంలో  చెప్పే సంకల్పమైనా రెండింటిలో  సారూప్యం ఉంది.  తమిళ ప్రాంతంలో పరిపాలన చేసిన చోళ, పాండ్య రాజుల శిల్పకళా నైపుణ్యం మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో పరిపాలన చేసిన రాణి అహల్యబాయి నిర్మించిన దేవాలయాల్లోని కళాదృశ్యాలు సౌందర్యయుతంగా  అందర్నీ  ఆకట్టుకుంటాయి.  రాజస్ట్రాన్​లోని  నృత్యం,  తెలంగాణలోని బతుకమ్మ.. రెండింటిలోని అడుగుల చప్పుడు  ఒక్కటే.  గుజరాత్‌‌‌‌‌‌‌‌లో  తినే డోక్లా బీహార్​లోని తిల్‌‌‌‌‌‌‌‌ కుట్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ జొన్నరొట్టె అన్నింటిలోని రుచి ఒక్కటే.  ఈ దర్శనం అంతా భారతీయ దర్శనం. లోక మంథన్‌‌‌‌‌‌‌‌ ద్వారా మహా  భారత దర్శనం చేద్దాం.

- డా. పి.భాస్కరయోగి,
సోషల్ ​ఎనలిస్ట్