అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశం వెనుకంజలో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో అవినీతి అనేది అతి ప్రమాదకరంగా మారింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా దేశ అభివృద్ధికి నిరోధకంగా పరిణమించింది. ఈ అవినీతిని గురించి పూర్వకాలంలోనే ప్రముఖ అర్థశాస్త్రవేత్త కౌటిల్యుడు చెబుతూ ‘నీటిలో ఉన్న చేప నీళ్లు తాగలేదు అన్నది ఎంత అబద్ధమో, ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి లంచం తీసుకోవట్లేదు అన్నది కూడా అంతే అబద్ధం’ అని అన్నారు.
ఈ అవినీతిఅనే వైరస్ దేశంలోని అన్ని రంగాలలో చాలా విస్తృతంగా వ్యాపించింది. దానిని ఏవిధంగా నిరోధించాలో తెలియక ప్రభుత్వాలకు అర్థంకాని ఆగమ్య గోచర స్థితి ఉన్నది. అటువంటి వ్యవస్థ నుంచి దేశాన్ని అవినీతి లేని సమాజంగా నడిపించాలని ఉద్దేశంతో దేశంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల ఫలితంగా ఈ మధ్యకాలంలో ఒక నూతన వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం అమలుపరచడం శుభసూచకం.
లోక్ అంటే ప్రజలు, పాల్ అంటే సంరక్షకుడు అని అర్థం. భారతదేశంలో ఉన్న అత్యున్నత స్థాయి వ్యక్తులు వారి అవినీతి చర్యలను విచారించేందుకు ఒక్క వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో అప్పటి ఆర్థిక మంత్రి అయిన సి.డి.దేశ్‌ముఖ్ ప్రతిపాదించారు. కానీ, అనేక కారణాలవల్ల అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో విఫలమైంది. 1963వ సంవత్సరంలో డాక్టర్ ఎల్.ఎం. సింగ్వి ‘లోక్‌పాల్’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించి ఆ వ్యవస్థ ప్రాధాన్యత గురించి వివరించాడు. 1966లో ప్రముఖ రాజకీయవేత్త మురార్జీ దేశాయ్ లోక్‌పాల్, లోకాయుక్త లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేశారు.
ఈ సిఫారసులో జాతీయస్థాయిలో జరిగే అవినీతి అక్రమాలను విచారించేందుకు స్వయం ప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన వ్యవస్థను లోక్‌పాల్‌గా జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో లోకాయుక్తగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆ తరువాత 1968వ సంవత్సరంలో మొదటిసారిగా ఇందిరాగాంధీ లోక్‌పాల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపడితే, ఆ బిల్లు అప్పట్లో ఆమోదానికి నోచుకోలేదు. అప్పటినుంచి దాదాపు 45 సంవత్సరాలపాటు పదిసార్లు బిల్లును ప్రవేశపెట్టినా వివిధ కారణాల చేత, ఆ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందలేదు. అయితే, ఆ తరువాత దేశంలో చాలా స్వచ్ఛంద సంస్థలు విస్తృత పోరాటాలు చేశాయి. అన్నా హజారే 2013వ సంవత్సరంలో ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
తొలి చైర్‌పర్సన్‌గా పీసీ ఘోష్
2011లో అన్నా హజారే చేసిన ఉద్యమం తరువాత భారత ప్రభుత్వం లోక్‌పాల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని తీవ్రంగా ఆలోచించవలసి వచ్చింది. అవినీతి సమస్యని పరిష్కరించడానికి, లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదనను పరిశీలించడానికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. చివరికి లోక్‌పాల్,
లోకాయుక్త చట్టం, 2013లో రూపొందింది. 2014 జనవరి 16 నుంచి అమలులోకి వచ్చింది. కాగా, బిల్లుకు 2013లో ఆమోదం లభించినప్పటికీ 2019లో లోక్‌పాల్‌కు మొదటి చైర్‌పర్సన్‌ని నియమించారు. ఎంపిక ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. సెలక్షన్ కమిటీలో భాగమైన ప్రతిపక్ష నాయకుడు
లేకపోవడంతో ఆగిపోయింది. 2016లో ఒక సవరణ ప్రవేశపెట్టడమైంది. దీనిలో లోక్‌సభలో అతిపెద్ద పార్టీ సభ్యుడిని ఎంపిక కమిటీలో అర్హత సభ్యునిగా చేశారు. మొదటి చైర్‌పర్సన్‌గా పీసీ. ఘోష్ తర్వాత భారతదేశ ప్రస్తుత లోక్‌పాల్ అయిన జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్ నియమితులయ్యారు.
ఉన్నత పదవుల్లోని వ్యక్తుల అవినీతిపై విచారణ
2024 జనవరి 16వ తేదీన జరిగిన లోక్‌పాల్ సమావేశంలో.. కేంద్ర ప్రభుత్వం 2025 జనవరి 16వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం లోక్‌పాల్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొంది 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. లోక్‌పాల్ బిల్లు ప్రకారం భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులపైన చర్యలు తీసుకొనే అధికారాన్ని లోక్‌పాల్ అధికారులకు కల్పించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం, దేశ ప్రధానితో సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపైన వచ్చిన ఆరోపణలను విచారించే అధికారం లోక్‌పాల్‌కు కలదు. 2014 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రధాన నినాదం వివిధ దేశాల్లో ఉన్న అక్రమ సంపదను, నల్లడబ్బును తిరిగి భారతదేశానికి రప్పిస్తామని, రాబోయే రోజుల్లో అవినీతి లేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చింది.
దీని ప్రకారం ఈ లోక్‌పాల్ చట్టాన్ని పకడ్బందీగా అమలుపరచాలనే ఉద్దేశంతో అనేక సదుపాయాలను, వారికి కావలసినటువంటి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మధ్యకాలంలో ప్రపంచ దేశాల అవినీతిని గురించి అంచనా వేసే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అవినీతికి సంబంధించిన అంతర్జాతీయ నిఘా సంస్థ తన నివేదిక 2023లో 150 దేశాలలో భారతదేశానికి 93వ స్థానం ఇచ్చింది. అదేవిధంగా, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్, అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్ సివిల్ సొసైటీ సంస్థ, 2023 నివేదికలో భారతదేశానికి 39వ స్థానం ఇచ్చింది. దేశం అభివృద్ధి చెందాలంటే లోక్‌పాల్ లాంటి వ్యవస్థలక స్వతంత్రంగా పనిచేసే వెసులుబాటు కల్పించాలి.
డా.బి.లావణ్య,
డిపార్ట్‌మెంట్‌ఆఫ్ పొలిటికల్ సైన్స్,
కే.యూ