లోక్​సభ ఫలితాలు రాజ్యాంగవాదాన్ని నిలబెట్టాయి

లోక్​సభ ఫలితాలు రాజ్యాంగవాదాన్ని నిలబెట్టాయి

ఎన్డీఏ  పార్లమెంటరీ మీటింగ్​లో  టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 'సరైన టైంలో.. సరైన నాయకుడు నరేంద్ర మోదీ' అంటూ వారి నాయకత్వాన్ని సమర్థించారు. అదేవిధంగా వారి ఉపన్యాసం పూర్తిగా  గ్లోబల్  పవర్ హౌస్,  గ్లోబల్ లీడర్​షిప్,  గ్రోత్ రేట్ పర్ క్యాపిట అంటూ భారతదేశం  ప్రపంచంలోనే మొదటి లేక రెండో స్థానంలో ఉండబోతున్నదని అన్నారు. దురదృష్టవశాత్తు వారికి దేశంలో  మతోన్మాదం, ముస్లిం వ్యతిరేకత, పేదరికం,  వెనుకబాటుతనం,  రాజ్యాంగ రక్షణ,  ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు. 2024 ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ,  కుల జనగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఆర్థిక న్యాయం ప్రధాన అంశాలుగా  దేశవ్యాప్తంగా చర్చకు రావడం జరిగింది. అదేవిధంగా ఇండియా బ్లాక్ తో పాటు  ఎన్డీఏ అలయన్స్ కూడా ఈ అంశాలనే చర్చించాయి. 

అఖిలేశ్– రాహుల్​  రాజ్యాంగవాదం

అఖిలేశ్​ యాదవ్, రాహుల్ గాంధీ నాయకత్వంలో      రాజ్యాంగవాదం   బలమైన  ఎన్నికల  ఎజెండాగా నిలిచింది.  ప్రజలు ముఖ్యంగా దళితులు,  వెనుకబడిన తరగతులవారు ఇండియా కూటమిని గెలిపించడా నికి ఉద్యమ రూపంలో  గ్రామస్థాయి దాకా పోరాడారు.  సమాజ్​వాది పార్టీ  ఉత్తరప్రదేశ్​లో  ఎంపీ అభ్యర్థులను  ఎంపిక చేసినప్పుడు 32 సీట్లు బీసీలకు, 16 సీట్లు దళితులకు, 10 స్థానాలు అగ్రవర్ణాలకు,  నాలుగు టికెట్లు ముస్లింలకు ఇవ్వడమైంది.  అందులో  ఇద్దరు  దళితులు  జనరల్ స్థానాలలో ఎస్పీ తరఫున పోటీ చేశారు. ఇది ఒక సంచలనాన్ని సృష్టించింది. అయోధ్య (ఫైజాబాద్) నుంచి పోటీ చేసిన దళిత అభ్యర్థి  అవదేశ్ ప్రసాద్ గెలుపొందడం దేశంలోనే సంచలనంగా మారింది.  అయోధ్య చుట్టుప్రక్కల ఉన్న ఐదు ఎంపీ స్థానాలలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. అయోధ్య రామ మందిరాన్ని కోర్ ఎజెండాగా బీజేపీ దేశంలో ప్రచారం చేసినప్పటికీ అక్కడే వారు ఓడిపోవడం బీజేపీకి తల కొట్టేసినట్లుగా మారింది.  వ్యాపార  రాజకీయాలను  నడిపిస్తున్న బీజేపీని  యూపీలో  పెద్ద ఎత్తున ప్రజలు తిరస్కరించారు. రాజ్యాంగాన్ని మారుస్తాం, 400 ఎంపీలను గెలిపించండి అని మాట్లాడిన బీజేపీకి ఇది ఒక చెంపపెట్టుగా  మారింది.  ఉత్తరప్రదేశ్ తీర్పు ప్రజాస్వామికవాదులకు ఊరటనిచ్చింది. 

సమాజాన్ని విభజించే దిశగా మోదీ

ప్రధాని మోదీ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించి.. మతాల మధ్య పోలరైజ్ చేయడానికి శతవిధాల  ప్రయత్నించారు. కుల సర్వేలు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక న్యాయం జరుపుటకు ఉద్దేశించినప్పటికీ దానిని మతం, మైనారిటీలకు పంచే విధంగా చిత్రీకరించారు.  రాజ్​పుత్​లు  బీజేపీని నిరసించడంతో వారిని తమ వైపు మళ్లించడానికి మంగళ సూత్రాలు, ఆస్తులు హిందువుల నుంచి గుంజుకొని పిల్లలెక్కువున్న సామాజిక వర్గాలకు పంచుతారని ప్రచారం చేశారు. ఇది చాలా దురదృష్టకరం.  దేశాన్ని  ఏకీకరణ వైపు తీసుకొనిపోవాల్సిన  ప్రధాని సమాజాన్ని విభజించే విధంగా,  భయాందోళనకు గురి చేసేవిధంగా చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించేదిగా ఉంది. ముస్లిం వ్యతిరేక స్పృహను ఎన్నికల ప్రచారంలో చూపించినప్పటికీ భారతదేశ ప్రజలు దాన్ని తిరస్కరించారు.  దైనందిన సమస్యలే  ఎలక్షన్ ఎజెండాగా స్పందించారు.  ప్రజలే దేశ విభజన రాజ కీయాలను తిప్పికొట్టారు.  ఇది దేశంలో ఒక గొప్ప రాజకీయ పరిణామంగా చూడాలి.

కార్పొరేట్ స్వామ్యంగా ప్రజాస్వామ్యం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలు సాగిన పాలన.. కాంట్రాక్టర్లను, ఇసుక, మైనింగ్ వ్యాపారులను, లిక్కర్ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, రాజకీయ వ్యాపారులను కలిపి ఒక బిలియనీర్ల  బాహుబలి వ్యవస్థను నిర్మించడమైనది. పెట్టుబడిదారులు మాట్లాడే భాషలో  గ్లోబల్ పవర్ హౌస్ ఉంటుంది.  గ్లోబల్ లీడర్​షిప్, ఉద్యోగాలు ఇవ్వని గ్రోత్ ఉంటుంది. ప్రాంతీయ పెట్టుబడిదారులు జాతీయ పెట్టుబడిదారులుగా  పరిణామం చెందడం నేషనల్ కార్పొరేట్లు, గ్లోబల్ కార్పొరేట్లుగా అభివృద్ధి చెంది ప్రజాస్వామ్యాన్ని కార్పొరేట్ స్వామ్యంగా మార్చడం వీరి లక్ష్యాలు.  కానీ, రాజ్యాంగం అసమానతలను తగ్గించాలని చెబుతున్నది. పెట్టుబడి కేంద్రీకరణను  వ్యతిరేకిస్తుంది . భారత దేశ పౌరులందరికీ  అభివృద్ధిలో  భాగస్వామ్యం కల్పించాలని  పాలనా వ్యవస్థను  నిర్దేశిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షణ మాత్రమే ప్రజల సుఖ సంతోషాలను కాపాడుతుంది.  కాబట్టి,  అన్ని సామాజికవర్గాలు అటువైపు ఆలోచిస్తూ  రాజ్యాంగాన్ని,  ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం మనముందున్న మార్గం.

బీజేపీ మత రాజకీయాలకు చెక్​

మతతత్వ ప్రచారాన్ని ప్రధానంగా నిలువరించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే.  అదేవిధంగా  కొంతమేరకు  బిహార్​లో  కూడా ఈ చర్చ ముందుకుపోయింది. రాజస్థాన్,  హర్యానా,  పంజాబ్,  వెస్ట్ బెంగాల్,  కేరళ,  తమిళనాడు, మహారాష్ట్ర లాంటి  రాష్ట్రాలు ఇండియా కూటమికి బలంగా నిలిచాయి.  గుజరాత్,  మధ్యప్రదేశ్,  చత్తీస్​గఢ్,  కర్నాటక,  ఒడిశా,  ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ  ఎన్డీఏ  రాజకీయాలకు అండగా నిలిచాయి. సామాజిక విశ్లేషణలో బలంగా కనిపించేది అగ్రవర్ణ రాజకీయాలు.  దేశంలోని పలు  రాష్ట్రాలలో  అగ్రవర్ణాలు  బీజేపీ తరఫున ఎన్నికలలో పాల్గొన్నారు.  కొన్ని రాష్ట్రాల్లో  ఓబీసీలు కొంతమేరకు బీజేపీ వెంట నడిచారు. అయినప్పటికీ,  దళితులు, వెనుకబడిన తరగతులు,  ముస్లిం మైనారిటీలు  ఇండియా బ్లాక్​కు మద్దతుగా నిలిచారు. వీరు పెద్ద ఎత్తున ఇండియా కూటమికి అండగా నిలవడంతో బీజేపీ మత రాజకీయాలను చాలావరకు కట్టడి చేయడం జరిగింది.  గ్రామీణ, పట్టణ ఓటర్లను పరిశీలిస్తే పట్టణ ఓటర్లు ఎక్కువగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. 

- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన, అధ్యక్షుడు,  తెలంగాణ రాష్ట్ర సమాజ్​వాది పార్టీ