మనది మార్పును వ్యతిరేకించే దేశం.. అందుకే బిల్లులపై ఇంత గొడవ

కార్పొరేట్ ఫార్మింగ్ రైతుకు మంచిదే

వీ6-వెలుగు ఇంటర్వ్యూలో లోక్ సత్తా చీఫ్ జయ ప్రకాశ్ నారాయణ

‘‘కొత్త వ్యవసాయ చట్టాల వల్ల లాభమే లేదనేది కరెక్ట్​ వాదన కాదు. రాజకీయ కారణాలతో వీటిని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు. రైతులకు వాస్తవాలను చెప్పాలి. ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న వారికి అన్నీ చెపితే వారు కూడా ఈ చట్టాలను సమర్థిస్తారు. మన వస్తువును కొనేందుకు పది మంది పోటీపడటం మంచిదే. వీళ్లకే పంటను అమ్మాలనే ఆంక్షలేవీ లేవు కాబట్టి రైతులకు మేలే జరుగుతుంది’’ అని లోక్​సత్తా చీఫ్​ జయప్రకాశ్​నారాయణ కుండబద్దలుగొట్టారు. కేంద్రం అమలులోకి తెచ్చిన మూడు అగ్రి బిల్లులపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టాల వెనక ఉన్న ఉద్దేశాలు ఏమిటి? వాటి వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే విషయాలను వీ6–వెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అగ్రి చట్టాల వల్ల రైతుకు లాభమా? నష్టమా?

పండించిన పంటకు సరైన రేటు వస్తే రైతుకు ఆదాయం వస్తుంది. ఇప్పటికీ దేశంలో 50% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. కానీ ఎకానమీలో అగ్రికల్చర్​ వాటా 10 నుంచి 15 శాతమే. అందువల్ల అగ్రి ఇన్​కం పెరగాలి.

ఈ చట్టాలతో సాగు మొత్తం మారిపోతుందా?

కొత్త చట్టాలతోనే వ్యవసాయం మొత్తం మారిపోతుందని చెప్పలేం. ఈ చట్టాల నుంచి కొంత మేలు జరుగుతుంది. ఇప్పటి వరకూ మార్కెట్​ యార్డుల్లోనే రైతులు తమ పంటలను అమ్ముకోవాలి. కానీ చాలా మంది రైతులు బయటే అమ్ముకుంటున్నారు. మార్కెట్​ యార్డుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఎక్కడమ్మినా మార్కెట్​ సెస్​ కట్టాలి. మార్కెట్లు వాడుకుంటే సెస్​ కట్టొచ్చు. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. అందువల్ల ఎక్కడైనా ఎవరికైనా పంట అమ్ముకోవచ్చనే రూల్​ తీసుకొచ్చారు. మార్కెట్​లో బాగుంటే.. అక్కడే అమ్మవచ్చు.

మార్కెట్​ యార్డుల్లోనే అమ్మాలనే రూల్​ తొలగిపోవడం రైతులకు మంచిదేనా?

కచ్చితంగా. ప్రస్తుతం 60 శాతం మంది బయటే పంట అమ్ముకుంటున్నారు. బట్టలు తయారు చేసేవారు.. పెన్నులు తయారు చేసేవారు.. కళ్లజోళ్లు తయారు చేసే వారిని ఇక్కడే అమ్మాలని, వీరికే అమ్మాలని ఏమైనా ఆంక్షలు పెట్టారా? లేదుకదా.. మరి రైతుకు మాత్రమే ఈ రూల్స్​ ఎందుకు. వారికి సంకెళ్లు వేయడం ఎందుకు.

ఇన్నేండ్లుగా ఏ ప్రభుత్వాలు ఎందుకు దీని గురించి ఆలోచించలేదు?

ఇవన్నీ మూర్ఖపు ఆలోచనలు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో మన మెతుకు మన దగ్గరే ఉండాలని అనుకున్నారు. 70 ఏండ్లుగా అదే ఆలోచన మన చట్టాలను ప్రభావితం చేసింది. రెండో సారి మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉల్లిపాయ ధర భారీగా పెరిగింది. ఆ టైంలో రేటు తగ్గడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రెండు నెలల తర్వాత రేటు మూడు రూపాయలకు పడిపోయింది. అప్పుడు రైతును పట్టించుకున్న వారు లేరు. అంటే ధర పెరిగితే కంట్రోల్​ చేస్తున్నారు.. అదే తగ్గితే రైతును వదిలేస్తున్నారు.

కార్పొరేట్​ ఫార్మింగ్​ తో నష్టం. అంబానీలు, అదానీల చేతుల్లో రైతులు పావులుగా మారతారనే ఆరోపణలపై మీరేమంటారు?

అంబానీలు, అదానీలు మనకు అవసరం లేదు. మీరు వచ్చి మంచి రేటుకు నా దగ్గర కొనుక్కోండి. మీరు నాకు మంచి రేటు ఇవ్వకుండా చంపేస్తే ఎలా. రైతును బలవంతంగా వీడికే అమ్మాలని ఎవరైనా చెప్పారా? నార్త్​లో పెప్సీ కంపెనీ రైతులతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఆలుగడ్డలు ఉత్పత్తి చేయండి. మేము సీడ్​ ఇస్తాం. ఇంత ధరకు కచ్చితంగా కొంటామని చెబుతోంది. రైతులు స్వచ్ఛందంగా వారికే అమ్ముతున్నారు.

మొదట్లో బాగానే రేటు ఇస్తారు. ఆ తర్వాత రేటు తగ్గించేస్తారనే విమర్శలపై ఏమంటారు.

దాని కోసమే కలెక్టర్, ఆర్డీవోలకు ప్రభుత్వం అధికారాలు ఇచ్చింది. కాంపిటీషన్​ లేకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. ఇప్పుడు కాంట్రాక్టులను 50 ఏండ్లకు చేసుకోవడం లేదు. ఏడాదికే చేస్తున్నారు. ఈ ఏడాది బాగాలేకుంటే తర్వాత వేరే వాళ్లతో డీల్​ కుదుర్చుకోవచ్చు.

ఈ చట్టాలను బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి.

మనది మార్పును వ్యతిరేకించే దేశం. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలంటే పార్టీలు కలిసి వస్తున్నాయి. అంటే డబ్బులతో ఓట్లను కొనే ప్రక్రియ బాగుందని కాదు. పీవీ టైంలో ఎకనమిక్​ రిఫామ్స్​ తీసుకొచ్చినప్పుడు అందరూ అంగీకరించారా? లేదు. అందుకే వాస్తవాలు చూడాలి.

సౌత్​తో పోలిస్తే.. నార్త్​ ఇండియాలో ఎక్కువ నిరసనలు జరుగుతున్నాయెందుకు?

పంజాబ్​లో మార్కెట్లు రాజకీయంగా బలమైనవి. అక్కడి మండీల్లో అన్ని సదుపాయాలుంటాయి. వాటి లీడర్​ పొలిటికల్​గా స్ట్రాంగ్. మార్కెట్​ సెస్​ కింద రూ.4 వేల కోట్లు వసూలు చేస్తారు. ఈ 4 వేల కోట్లు పోతాయి. పెత్తనం పోతుందనే ఆలోచనే నిరసనలకు కారణం. దీనికి కనీస మద్దతు ధరకు లంకె పెట్టారు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ధాన్యం, గోధుమల సేకరణ కొనసాగుతుందని చెప్పింది. కానీ, అది పోతుందనే భయం చాలా మందిలో ఉంది. రైతులకు వాస్తవాలు చెపితే.. వారంతా అంగీకరిస్తారు.

ఈ చట్టాలతో రైతు ఆదాయం రెట్టింపు అవుతుందా?

ఇది అద్భుతాలు చేస్తుందని నేను చెప్పను. 45 కోట్ల టన్నులు కుళ్లిపోయే పంటలను మనం పండిస్తున్నాం. కానీ మన దగ్గర ఉన్న గోడౌన్ల సామర్థ్యం 3.80 కోట్లే. ఇందులోనూ ఎక్కువగా నిల్వ చేసే ఆలుగడ్డే 60 శాతం. గోడౌన్లు లేకపోవడం వల్ల లక్షల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. అందువల్లే మార్కెట్​లోకి ఎక్కువ సరుకు వస్తే రేటు పడిపోతోంది. అదే గోడౌన్లు ఉంటే వాటిని నిల్వ చేసుకునే వీలు రైతులకు కలుగుతుంది. డిమాండ్​ ఉన్నప్పుడు వాటిని మార్కెట్​లోకి తెచ్చి అమ్ముకోవచ్చు. దీంతో రైతుకు లాభం చేకూరుతుంది.

కాంట్రాక్ట్​ ఫార్మింగ్​తో నష్టం ఉండదా?

కచ్చితంగా ఉండదు. పది మంది వచ్చి మన దగ్గర పెట్టుబడి పెడితే మనకు లాభమా నష్టమా? మన దేశంలో వ్యవసాయ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడి కావాలి. గత పదేండ్లుగా వ్యవసాయంలో ఒక్క రూపాయి పెట్టుబడి పెరగలేదు. అదే ఈ పదేండ్లలో ఎకానమీ రెట్టింపుకంటే ఎక్కువ పెరిగింది. అదే కాంట్రాక్ట్​ ఫార్మింగ్​తో పెట్టుబడులు పెరుగుతాయి. గోడౌన్లు, ప్యాకేజింగ్,​ గ్రేడింగ్,​ రవాణా,
ఇన్​పుట్స్​కు సాయం అందుతుంది. మన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్​లోకి వెళతాయి. దీంతో రైతు ఆదాయం పెరుగుతుంది.

For More News..

8 శాతం మంది.. 60 శాతం మందికి కరోనా అంటించిన్రు

బలరాంపూర్ అత్యాచార బాధితురాలు మృతి

హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు చేసిన్రు