లోక్‌సత్తా శ్రీనివాస్‌గా అందరికీ సుపరిచితుడైన నరెడ్ల శ్రీనివాస్ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, ప్రగతిశీల సాహిత్య ఉద్యమాల్లోనూ, ఫిల్మ్ సొసైటీల స్థాపన కార్యాచరణలోనూ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఉద్యమంలోనూ, లోక్‌సత్తా ఉద్యమ సంస్థలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. శ్రీనివాస్ ప్రస్తుతం వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆరేండ్ల క్రితం యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్‌గా రిటైర్ అయిన శ్రీనివాస్ అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ప్రజాసేవలోనే ఉన్నారు.తన దగ్గరకు వచ్చే బాధితులకు న్యాయం చేసేందుకు రిటైర్మెంట్ తర్వాత లా చదివారు. చనిపోయే వరకూ సామాన్యుల పక్షాన పోరాటం చేశారు.
అవినీతి, అన్యాయాన్ని సహించేవారు కాదు
1955లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో నిరుపేద కుటుంబంలో నరెడ్ల శ్రీనివాస్ జన్మించారు. చిన్నప్పుడే తల్లి చనిపోతే పెద్దమ్మ ఇంట్ల పెరిగారు. 1969లో హుజూరాబాద్‌లో ఎస్ఎస్‌సీ మొదటి బ్యాచ్ స్టూడెంట్. అప్పుడే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆవునూరి సమ్మయ్యతో కలిసి పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ మొదటి బ్యాచ్ స్టూడెంట్‌గా హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. నిజాం కాలేజీలో ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. 1976లో యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్ మెయిన్స్ రాత పరీక్షలో పాస్ అయ్యారు. అయితే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్–1 ద్వారా సెక్రటేరియట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికైనా.. అది లంచాలు తీసుకునే ఉద్యోగం అవుతుందేమోనని దానిని వదులుకున్నారు. చిన్నప్పటి నుంచి అవినీతికి, అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవారు. అందుకే సెక్రటేరియట్‌లో ఉద్యోగాన్ని వదులుకుని బ్యాంక్ ప్రొబెషనరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్‌లో పాసై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరారు. నల్గొండ, నిజామాబాద్, గుజరాత్‌లోని రాజ్‌కోట్, కరీంనగర్‌లోని మల్యాల, మానకొండూర్, కొత్తపల్లి ప్రాంతాల్లో బ్యాంక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. అంతకుముందు ఖమ్మం జిల్లా చర్లలో ఆరు నెలలు జూనియర్ లెక్చరర్‌గా పని చేశారు. బ్యాంకులో పని చేస్తున్నప్పుడు రైతులకు, కూలీలకు, ఇతర వర్గాలకు పిలిచి అప్పులిచ్చేవారు. జర్నలిస్టులకు, కవులకు, రచయితలకు 20 ఏండ్ల కిందనే అప్పులు ఇప్పించారు.
1970లో మిత్ర మండలి ఏర్పాటు
వరంగల్‌లోని కాళోజీ మిత్రమండలి స్ఫూర్తితో 1970 ప్రాంతంలో హుజూరాబాద్‌లో ఆవునూరి సమ్మయ్యతో కలిసి మిత్రమండలి స్థాపించారు. అదే 1973 నుంచి జనసాహితిగా మారింది. ఆ కాలంలోనే హుజూరాబాద్‌కు శ్రీశ్రీ, కాళోజీలను తీసుకువచ్చి ఊరేగింపు, బహిరంగ సభలు పెట్టారు. జనసాహితి సంస్థ ఆధ్వర్యంలో ‘నిప్పురవ్వలు’ సాహిత్య సంకలనం వెలువరించారు. అందులో శ్రీశ్రీ, కేవీఆర్, టంకశాల అశోక్ తదితరుల కవితలు ఉన్నాయి. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో నిప్పురవ్వలును నిషేధించారు. 1974 ప్రాంతంలో కరీంనగర్‌లో విజయ్‌కుమార్‌తో కలిసి ‘ఉద్యమ సాహితీ’ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ సంస్థ ద్వారా ‘బదులా’ కథా సంకలనం, శ్రీశ్రీ ‘రెక్క విప్పిన రెవల్యూషన్’ వెలువరించారు. ఆ తర్వాత సాహిత్య కార్యాచరణకు కొంత దూరం జరిగి ఫిలిం సొసైటీ నిర్మాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ సినిమా గురించి బి.నరసింగరావుతో కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ ప్రాంతాల్లో ప్రసంగాలు పెట్టారు. అంపశయ్య నవీన్, వారాల ఆనంద్ తదితరులతో కలిసి కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని, వేములవాడ, హుజూరాబాద్, జగిత్యాల, సిరిసిల్లలో ఫిలిం సొసైటీల ఏర్పాటులో పాల్గొన్నారు.
వినియోగదారుల హక్కుల కోసం పోరాటం
వినియోగదారుల పరిరక్షణ ఉద్యమంలోనూ శ్రీనివాస్ చురుకుగా పాల్గొన్నారు. ఆ సంఘం రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా కొనసాగారు. వినియోగదారుల హక్కుల కోసం కన్స్యూమర్ ఫోరమ్స్, కోర్టుల్లో కొన్ని వేల కేసులు వేసి గెలిచారు. రాష్ట్రంలో కరీంనగర్ వినియోగదారుల మండలికి ఎంతో పేరుంది. దీంతో పాటే జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన లోక్ సత్తా ఉద్యమంలో శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజా పరిపాలన రంగంలో పలు సూచనలు చేశారు. అనేక వ్యాసాలు రాశారు. ఉపన్యాసాలు ఇచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాటం చేశారు. లోక్‌సత్తా రాజకీయ పార్టీగా మారినా శ్రీనివాస్ మాత్రం ఉద్యమ సంస్థలోనే కొనసాగారు. కరీంనగర్ వావిలాలపల్లిలో లోక్‌సత్తా , వినియోగదారుల మండలి కార్యకలాపాల కోసం స్వర్గీయ చుక్కారెడ్డి గారి ప్రింటింగ్ ప్రెస్‌లో ఆఫీస్ నిర్వహించేవారు. ఇక్కడికి ప్రతినిత్యం అన్యాయానికి గురైన వాళ్లు వచ్చి తమ గోడు చెప్పుకునే వారు. ఇటీవల ఏఎస్ఐ మోహన్‌రెడ్డి ఫైనాన్స్ బాధితులు, బొమ్మకల్ భూదందా బాధితుల తరఫున పోరాటం చేశారు.
గొప్ప మానవతావాది
కరీంనగర్ మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి లాంటి రాజకీయ నాయకులు నరెడ్ల శ్రీనివాస్‌తో సంప్రదింపులు చేసి సలహాలు తీసుకునేవారు. లోక్‌సత్తా కార్యాలయంలో ప్రతి రోజు సాయంత్రం లాయర్లు, టీచర్లు, రిటైర్ అయిన నిజాయితీగల అధికారులు, కవులు, రచయితలు కలుసుకునేవారు. ఏసీబీ కేసుల్లో అవినీతి అధికారులను పట్టించిన వారిని సన్మానించేవారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీనివాస్ పలు సభల్లో పాల్గొని తెలంగాణ ఏర్పాటు, ఆవశ్యకత గురించి వివరించారు. ఉదయం, జీవగడ్డ, సుప్రభాత లాంటి పత్రికల్లో కాలమిస్ట్‌గా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా అనేక ప్రజా సమస్యలను వ్యాసాలుగా మలిచారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ పత్రిక, వినియోగదారుల మండలి పత్రిక ప్రచురణలో బాధ్యత తీసుకున్నారు. 2016లో తన బాల్యమిత్రుడు ఆవునూరి సమ్మయ్య వెలువరించిన తెలంగాణ సామాజిక రాజకీయ వ్యాసాలు సంకలనానికి నాతోపాటు సంపాదకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్నింటికీ మించి గొప్ప మానవతావాది అయిన శ్రీనివాస్ మరణం సమాజానికి తీరని లోటు.– అన్నవరం దేవేందర్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కవి.
గొప్ప ఉద్యమ నేత
చివరి శ్వాస వరకు అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప ఉద్యమకారుడు శ్రీనివాస్. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఆయన ముందుండి పోరాడేవారు. బాధితుల పక్షాన నిలుస్తూ, వారిని చైతన్యపరుస్తూ, వారికి న్యాయం జరిగే వరకు కృషిచేసేవారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనో ధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. -బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
సహచరుడిని కోల్పోయా
నాకు ఎంతో సన్నిహితుడైన సహచరుడిని కోల్పోయా. శ్రీనివాస్ మరణం.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి, లోక్‌సత్తాకు, సమాజానికి పూడ్చలేని నష్టం. తెలంగాణ, కరీంనగర్ గొప్ప వ్యక్తిని కోల్పోయాయి. ఆయనో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండేవారు. ఆశావాది. అవినీతికి వ్యతిరేకంగా చివరి వరకూ పోరాటం చేశారు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా.-జయప్రకాశ్ నారాయణ, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు
నిస్వార్థ సేవకుడిని కోల్పోయినం
నరెడ్ల శ్రీనివాస్ తన జీవితాన్ని పేదల కోసం అంకితం చేసిండు. బతికున్నంత కాలం అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిండు. జర్నలిస్టుగా, బ్యాంక్ ఆఫీసర్‌గా ఉన్న టైంలోనూ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ మండలి, లోక్‌సత్తా ఉద్యమ సంస్థలో ప్రతిక్షణం న్యాయం కోసం, సామాన్యుల హక్కుల కోసమే కృషి చేసిండు. ఈ క్రమంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్నడూ వెన్ను చూపలేదు. చనిపోయే ముందు దాకా నోరు లేనోళ్ల గొంతుకై నిలిచిండు. బయట న్యాయం కోసం తిరిగి వేసారిన ఎందరో చివరి ప్రయత్నంగా శ్రీనివాస్ దగ్గరికి వచ్చేవాళ్లు. కేవలం బాధితులకు న్యాయం చేసేటందుకే రిటైర్‌మెంట్ తర్వాత 60 ఏండ్ల వయసులో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం చదివిండు. అలాంటి నిస్వార్థ సేవకుడిని కోల్పోవడం
ఈ సొసైటీకి తీరని లోటు. – అంకం రవి, సీఈవో & చీఫ్ఎడిటర్, వీ6-వెలుగు
ఆయన స్ఫూర్తితోనే పోరాటం
చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరు సాయం కోసం వెళ్లినా చేసే వ్యక్తి శ్రీనివాస్. మా అందరికీ ఆయన స్ఫూర్తి ప్రదాత. ఆయన ప్రోత్సాహంతోనే వినియోగదారుల మండలిలో చేరి ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఎంతో మంది వినియోగదారులకు నష్టపరిహారం ఇప్పించిన ఘనత శ్రీనివాస్‌కు దక్కింది. భవిష్యత్తులోనూ ఆయన నింపిన స్ఫూర్తితో ముందుకు సాగుతం. -చంద్ర ప్రభాకర్, జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షుడు, కరీంనగర్
సార్ వల్లే న్యాయం జరిగింది
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసును శ్రీనివాస్ సారే వెలుగులోకి తెచ్చిండు. సమస్యను డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిండు. కేసు మొదలైన దగ్గరి నుంచి ఎన్ని బెదిరింపులు ఎదురైనా లొంగిపోకుండా చివరి దాకా బాధితుల పక్షాన కొట్లాడిండు. ఆ సార్వల్లే మోహన్‌రెడ్డి బాధితులకు న్యాయం జరిగింది. చాలా మందికి ఆస్తులు తిరిగి వచ్చినయ్. – ముస్కు మహేందర్ రెడ్డి, ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు.
For More News..