మరో బిల్లుపై లొల్లి

ఎవరు పౌరుడు ? ఎవరు కాదు? అనేది ఇప్పుడు ఓ పెద్ద టాపిక్ గా మారింది. అయితే ఇది కొన్ని సరిహద్దు రాష్ట్రాల సమస్య మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మనదేశానికి వలస వచ్చిన ఆరు మతాల వారికి మన సిటిజన్ షిప్ ఇచ్చే విషయంలోనే ఇప్పుడు అబ్జెక్షన్స్ మొదలయ్యాయి. ఈ దేశాల నుంచి వచ్చిన ఆరు మతాల వారికి మన పౌరసత్వం సులువుగా ఇచ్చే బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ ఆరు మతాల్లో ఇస్లాంను చేర్చకపోవడమే అబ్జెక్షన్స్ కు అసలు కారణమైంది. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వేలాది మంది మనదేశంలోకి వచ్చి తిష్టవేయడం ఈనాటి మాట కాదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఇలాంటి వలసలు ఉన్నాయి.ఈ మూడు ముస్లిం దేశాల నుంచి వచ్చిన వేలాది మంది మన సిటిజన్ షిప్ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు.

అయితే ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలను సరిహద్దు రాష్ట్రాలు అంతగా ఆదరించకపోగా వారి విషయంలో ఎన్నో అపోహలు, అనుమానాలు పెంచుకున్నాయి.ఈ దేశాల నుంచి వచ్చిన సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, పార్శీలు, హిందూ మతాలకు చెందిన వారి విషయంలో ఇలాంటి అనుమానాలు తక్కువ. అదీకాక వలస వచ్చిన ముస్లింల సంఖ్యతో పోలిస్తే మిగతా మతాలవారి సంఖ్య తక్కువే. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సిటిజన్ షిప్ సవరణ బిల్లు ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. ఈ ఆరు వర్గాలు ఇండియన్ సిటిజన్ షిప్ పొందడానికి ఉన్న నియమాలను సవరణ బిల్లు ఈజీ చేసింది. అయితే ఈ సడలింపులు ఈ మూడు దేశాల నుంచి వచ్చే ముస్లింలకు మాత్రం వర్తించవు. సవరణ బిల్లులోని ఈ అంశమే వివాదాస్పదంగా మారింది.

ఆర్టికల్ 14కు తూట్లు పొడుస్తుందన్న విమర్శలు

కేంద్రం ప్రవేశపెట్టబోతున్న సిటిజన్ షిప్ (సవరణ) బిల్లు రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ కు తూట్లు పొడుస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనని ( రైట్ టు ఈక్వాలిటీ ) ఆర్టికల్ 14 స్పష్టం చేస్తుంటే సవరణ బిల్లులో మార్చిన రూల్స్ ముస్లింలకు వర్తించవని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ముస్లింల పట్ల వివక్ష చూపుతోందని లెఫ్ట్ పార్టీలు సహా కొన్ని ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

పొరపాట్లను సరిచేసుకోవడానికే  బిల్లు : ప్రధాని

“ భరతమాత బిడ్డలు సమస్యల్లో చిక్కుకుపోతే వారి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? దేశ విభజన కారణంగా ఇక్కడికి రాలేకపోతున్న  భరతమాత బిడ్డలకు ఇక్కడి మట్టితో సంబంధం లేదా? విభజన కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికే సిటిజన్ షిప్ (సవరణ) బిల్లును తీసుకువచ్చాం’’.. అసోంలో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్న మాటలివి. సిటిజన్ షిప్ (సవరణ) బిల్లు–2016 పై వచ్చిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ముస్లింలను టార్గెట్ గా చేసుకుని బిల్లును తయారు చేశారన్న విమర్శలను కొట్టిపారేసింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో ముస్లింలు కానివారు మతం కారణంగా ఇబ్బందులు పడి ఇండియాకు రావాలనుకుంటే వారిని అక్కున చేర్చుకోవడమే బిల్లు అసలు ఉద్దేశమని వివరణ ఇచ్చింది.

రాజ్యాంగ వ్యతిరేకం కాదు : రాజ్ నాథ్ సింగ్

బిల్లు రాజ్యాంగ విరుద్దమంటూ వచ్చిన విమర్శలను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోసిపుచ్చారు. బిల్లు ఏమాత్రం రాజ్యాంగ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. పొరుగుదేశాల్లో బాధలు పడుతున్న భారతీయ మూలాలున్న అల్పసంఖ్యాకవర్గాలకు ఆశ్రయం కల్పించడమే సవరణ బిల్లు లక్ష్యమన్నారు. బిల్లుకు సంబంధించి కొన్ని  ఈశాన్య రాష్ట్రాలు అనవసరంగా అపోహలు పెంచుకున్నాయన్నారు.

అసోం ఒప్పందానికి బిల్లు వ్యతిరేకమా ?

అసోం ఒప్పందానికి పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేకమన్న వాదన వినిపిస్తోంది. పొరుగుదేశాల నుంచి అక్రమ వలసలపై ‘ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్’ (ఆసు) 80ల్లో అనేక పోరాటాలు చేసింది. ఈ పోరాటాల ఫలితంగా 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, అసోం ఉద్యమకారుల మధ్య  ఒక ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం అక్రమ వలసలను నిర్థారించడానికి 1971మార్చి 25ను  ప్రాతిపదికగా తీసుకున్నారు.

2016 జులైలో లోక్ సభకి..

సిటిజన్ షిప్ చట్టానికి చేసిన సవరణ బిల్లును 2016 జులై 19న లోక్ సభ లో ప్రవేశపెట్టారు. బిల్లుపై  స్టడీ చేయడానికి  ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’(జేపీసీ) కి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో  అదే ఏడాది ఆగస్టు 12న బిల్లుపై  జేపీసీ వేశారు. సవరణ బిల్లుపై స్టడీ చేసిన తరువాత 2019 జనవరి 7న జేపీసీ తన రిపోర్ట్ ను పార్లమెంటుకు అందచేసింది. ఆ మర్నాడే జనవరి 8న సవరణ బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడం జరిగిపోయాయి. బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించగానే ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. అసోం ఒప్పందాన్ని సవరణ బిల్లు తూట్లు పొడుస్తుందన్న విమర్శలు వచ్చాయి. ఈ బ్యాక్ డ్రాప్ లో  రాజ్యసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి రెడీ అవుతుండగా ఇదే ఏడాది ఫిబ్రవరి 13న రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో సవరణ బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. పార్లమెంటరీ నియమాల ప్రకారం ఏదైనా బిల్లు లోక్ సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్ లో ఉంటే సమావేశాలు మళ్లీ  ప్రారంభమైన తరువాత ప్రవేశపెట్టవచ్చు. అయితే 2019 ఎన్నికల షెడ్యూల్ రావడంతో 16వ లోక్ సభ రద్దయింది. దీంతో బిల్లును మళ్లీ లోక్ సభ ఆ తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సిందేనని పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చెబుతున్నాయి.