The Hundred Men's Competition 2024: విశ్వవిజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్

The Hundred Men's Competition 2024: విశ్వవిజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్

ఇంగ్లండ్ వేదికగా జరిగిన పురుషుల హండ్రెడ్‌ లీగ్‌ 2024లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ విజేతగా అవతరించింది. ఆదివారం(ఆగస్టు 19) రాత్రి జరిగిన ఫైనల్లో సామ్ బిల్లింగ్స్ సారథ్యంలోని ఓవల్.. సథరన్‌ బ్రేవ్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇన్విన్సిబుల్స్‌ నిర్ణీత ఓవర్లలో147 పరుగులు చేయగా.. ఛేదనలో సథరన్‌ 130 పరుగులకే పరిమితమైంది. 

విల్‌ జాక్స్‌ మెరుపు ఆరంభం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇన్విన్సిబుల్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విల్‌ జాక్స్‌(22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్ లు) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. లోయర్ ఆర్డర్ లో సామ్‌ కర్రన్‌ (25), జోర్డన్‌ కాక్స్‌ (25), టామ్‌ కర్రన్‌ (24) మంచి ఇన్నింగ్స్ లు ఆడారు. దాంతో, తుది పోరులో బిల్లింగ్స్ సేన.. ప్రత్యర్థి ఎదుట సరైన లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. అనంతరం చేధనకు దిగిన సథరన్‌ బ్రేవ్‌.. నిర్ణీత బంతుల్లో 130 పరుగులకే పరిమితమైంది. అలెక్స్‌ డేవిడ్‌ (35), జేమ్స్‌ విన్స్‌ (24) మినహా అందరూ విఫలమయ్యారు. ఇన్విన్సిబుల్స్‌ బౌలర్లలో సకీబ్‌ మహమూద్‌ 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

హండ్రెడ్‌ పురుషుల లీగ్‌లో ఓవల్స్ ఇన్విన్సిబుల్స్‌ కు వరుసగా ఇది రెండో ట్రోఫీ. 2021లో ప్రారంభమైన ఈ లీగ్‌ తొలి ఎడిషన్‌లో సథరన్‌ బ్రేవ్‌ విజేతగా నిలవగా.. 2022 ఎడిషన్‌లో ట్రెంట్‌ రాకెట్స్‌ టైటిల్ చేజిక్కించుకుంది.

విజేత లండన్‌ స్పిరిట్‌

మరోవైపు, మహిళల హండ్రెడ్‌ లీగ్‌లో లండన్‌ స్పిరిట్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు వెల్ష్‌ ఫైర్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్పిరిట్‌ విజయానికి చివరి 3 బంతుల్లో 4 పరుగులు అవసరమున్న సమయాన భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ సిక్స్ కొట్టి టైటిల్ అందించింది.