Team India: నెల రోజులు మ్యాచ్ ల్లేవ్.. టీమిండియా తదుపరి సిరీస్ ఎప్పుడంటే..?

Team India: నెల రోజులు మ్యాచ్ ల్లేవ్.. టీమిండియా తదుపరి సిరీస్ ఎప్పుడంటే..?

క్రికెటే వ్యసనంగా, క్రికెటే జీవితంగా బతికే భారత అభిమానులకు చేదువార్త ఇది. దాదాపు నెల రోజులకు పైగా టీమిండియాకు ఎలాంటి మ్యాచ్‌ల్లేవ్.. అవును మీరు వింటోంది నిజమే..! ఐపీఎల్.. టీ20 ప్రపంచకప్.. జింబాబ్వే సిరీస్.. శ్రీలంక సిరీస్.. అంటూ బిజీ జీవితాన్ని గడిపిన భారత క్రికెటర్లు 40 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. 

ఐపీఎల్ పుణ్యమా అని 50 రోజుల పాటు తీరికలేని క్రికెట్ ఆడిన భారత క్రికెటర్లు.. అది ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ కోసమని అమెరికా, కరీబియన్ దీవులకు వెళ్లారు. అక్కడో 30 రోజులు గడిపారు. అనంతరం పొట్టి ప్రపంచకప్ గెలిచాక స్వదేశానికి చేరుకున్నారో లేదో వెంటనే జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడినుంచి వచ్చిన వెంటనే మరలా శ్రీలంకకు పయనమయ్యారు. ఇలా భారత క్రికెటర్లు ఎప్పుడూ బిజీ బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారు అడపాదడపా విరామం తీసుకొని పిల్లాపాపలతో కలిసి విదేశీ టూర్లకు వెళ్తున్నా.. ఇతర క్రికెటర్లకు మాత్రం విశ్రాంతి అన్నదే లేదు. అలాంటి వారందరికి ఇప్పుడు సుదీర్ఘ విరామం దొరికింది. టీమిండియా తదుపరి సిరీస్ బంగ్లాదేశ్‌తో జరగనుంది. అది సెప్టెంబర్ నెలలో. అంటే, అప్పటివరకు భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడదన్నమాట. అయితే, ఈ సమయంలోనూ పలువురు యువ క్రికెటర్లు దేశవాళీ కటోర్నీల్లో కనిపించనున్నారు. ఆగస్టు 15 నుండి ప్రారంభం కానున్న బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్‌లో సూర్యకుమార్, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి పలువురు సందడి చేయనున్నారు.

భారత్ పర్యటనకు బంగ్లాదేశ్

సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో ఇరు జట్లు రెండు టెస్టులు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి.

  • మొదటి టెస్ట్ (సెప్టెంబర్ 19- 23): చిదంబరం స్టేడియం(చెన్నై)
  • రెండో టెస్ట్ (సెప్టెంబర్ 27- అక్టోబర్ 1): గ్రీన్ పార్క్ స్టేడియం (కాన్పూర్)
  • మొదటి టీ20 (అక్టోబర్ 6): ధర్మశాల క్రికెట్ స్టేడియం (హిమాచల్ ప్రదేశ్)
  • రెండో టీ20 (అక్టోబర్ 9): అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
  • మూడో టీ20 (అక్టోబర్ 12): రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)