పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బృందానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఏస్ అథ్లెట్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగాడు. తన గాయం గురించి, ఒలింపిక్స్‌కు దూరమవ్వడం గురించి శ్రీశంకర్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ప్రకటన చేశారు.
"మంగళవారం శిక్షణ సమయంలో నేను మోకాలి గాయంతో బాధపడ్డాను. అన్ని పరీక్షలు, సంప్రదింపుల తరువాత శస్త్రచికిత్స అవసరమని తేలింది. దురదృష్టవశాత్తూ ఇదొక పీడకలలా అనిపిస్తోంది. నా పారిస్ ఒలింపిక్స్ కల ముగిసింది" అని శ్రీశంకర్ సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.
— Sreeshankar Murali (@SreeshankarM) April 18, 2024
కేరళకు చెందిన 25 ఏళ్ల మురళీ శ్రీశంకర్ 2023 జూలైలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 8.37 మీటర్ల జంప్‌తో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించాడు. కానీ, దురదృష్టవశాత్తూ మోకాలి గాయం అతన్ని ఒలింపిక్స్ కళకు దూరం చేసింది.
కాగా, ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ భారీ క్రీడోత్సవాల్లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.