ఈ మధ్య కాలంలో డయాబెటిస్ అనే పేరే అందరినీ వణికిస్తోంది. గణాంకాలలో డయాబెటిస్ కు సంబంధించి మనకూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇందుకు కారణం జీవన విధానంలో పెను మార్పులు, మొదలైనవి చెప్పుకున్నా ... ఇప్పుడు ఆ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా వచ్చి చేరింది. అందరం చూసీ చూడనట్టు వదిలేసే ఈ వాయు కాలుష్యం డయాబెటిస్ కు ఎలా కారణం కానుందో ఇప్పుడు చూద్దాం.
వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయి.. ఊపిరి పీల్చుకోవడానికి కష్టమవుతోంది. ఈ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్యతో పాటు గుండె సంబంధిత రోగాల బారినపడుతున్నారు. తాజాగా, మధుమేహానికి కూడా కాలుష్యమే కారణమని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. టైప్-2 డయాబెటిస్‌కు దీర్ఘకాలికంగా కాలుష్యమే కారణమని గుర్తించారు.
దీర్ఘకాలం కాలుష్యంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి నిర్దారించింది. వెంట్రుక కంటే 30 రెట్లు సన్నగా ఉండే గాలిలో విషవాయువుల గాఢత పార్టికల్ మ్యాటర్ (PM) 2.5 కాలుష్య కారకాలతో కలుషితమైన గాలిని ఎక్కువ కాలం పీల్చితే టైప్ 2 మధుమేహం వచ్చే ముప్పు పెరుగుతుందని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అధ్యయనం స్పష్టం చేసింది.
20 శాతం టైప్2 మధుమేహం ఈ గాలిలో పీఎం 2.5 కాలుష్య కారకాలు కారణమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని కాలుష్య కారకాలు చమురు, డీజిల్, బయోమాస్, గ్యాస్ మండించడం వల్ల విడుదలవుతాయి. పీఎం 2.5 కాలుష్య కారకం పట్టణ ప్రంతాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతోంది. పెరుగుతున్న కాలుష్యం.. పెద్ద సంఖ్యలో ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా మారుతుందని, భారతదేశంలో విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుందని స్టడీ పేర్కొంది. దీనివల్ల నాడీ వ్యవస్థ ద్వారా ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచుతుంది. దానివల్ల హృదయ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.
సామాజిక ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమూహాలు, అనారోగ్య సమస్యల ఎదుర్కొనే పురుషుల్లో వాయు కాలుష్యం, మధుమేహం మధ్య సంబంధం ఎక్కువగా ఉంటుందని తేలింది. మధుమేహ బాధితులు, లేనివారిలోనూ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో PM 2.5కి సంబంధం ఉందని ఆధారాలు బయటపడ్డాయి. నెలపాటు ఈ పీఎం 2.5 కాలుష్య కారకానికి గురైతే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు దారితీస్తుందని, సుధీర్ఘంగా(దాదాపు ఒక ఏడాది) కాలుష్య కారకానికి గురైతే 20 శాతం టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. దాదాపు 53.7 కోట్ల మంది టైప్2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వారిలో సగం మందికి తాము డయాబెటిక్ అని కూడా తెలియదని అధ్యయనం వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, భారత్‌లో 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 7.7 కోట్ల మంది మధుమేహం(టైప్2), దాదాపు 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్(భవిష్యత్తులో మధుమేహం బారిన పడే ప్రమాదం)తో బాధపడుతున్నారు.
ప్రపంచ కాలుష్య దేశాల జాబితా 2023లో భారత్ మూడో స్థానంలో ఉంది. దేశంలోని గాలిలో PM2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు సగటున 54.4 మైక్రోగ్రాములు ఉన్నట్టు నివేదిక తేటతెల్లం చేసింది. భారత్ తొలి రెండు స్థానాల్లో పొరుగు ఉన్న బంగ్లాదేశ్ (క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములు), పాకిస్థాన్ (క్యూబిక్ మీటరుకు 73.7 మైక్రోగ్రాములు) నిలిచాయి. బిహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య ప్రాంతంగా మారుతోందని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 పేర్కొంది.
అంతకు ముందు ఏడాది సగటున 53.3 మైక్రోగ్రాముల సాంద్రతతో భారత్ 8వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసిన వార్షిక మార్గదర్శక స్థాయి క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా భారతదేశంలోని 1.36 బిలియన్ల మంది PM2.5 సాంద్రతలను అనుభవిస్తున్నారని నివేదిక పేర్కొంది. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. బీహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా మారుతుండగా... కాలుష్య రాజధానిగా ఢిల్లీ నిలిచింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా 2018 నుంచి నాలుగు సార్లు ఢిల్లీ నిలవడం తీవ్రతకు అద్దం పడుతుంది.