
భవనాలు, రోడ్లు వంటి నిర్మాణాలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మొట్టమొదట నష్టపోయేది జీవ వైవిధ్యం. భూమిపై ఉన్న వివిధరకాలైన జీవులు, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల మేళవింపునే జీవవైవిధ్యం అంటారు. సమాజాభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి రెండూ ముఖ్యమైన అంశాలే. కాబట్టి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ స్థిరమైన అభివృద్ధితోనే వివాదాలకు తావు లేని సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఐ.టి. పార్క్ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన 400 ఎకరాల భూమి సేకరణ కార్యక్రమం వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ విధ్వంసం, జీవవైవిధ్య విధ్వంసం జరుగుతుందని హెచ్‌సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ఇతర ప్రజా సంఘాలు ఈ భూసేకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ప్రజా ఉద్యమాల ద్వారా పర్యావరణ, జీవవైవిద్య విధ్వంసాన్ని అడ్డుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనది, స్ఫూర్తిదాయకమైనది ‘చిప్కో ఆందోళన్’. చిప్కో అంటే ‘కౌగిలించుకోవడం’ అని హిందీలో అర్థం. అంటే చెట్లను కౌగిలించుకుని వాటిని నరికివేయకుండా ఆపడం. పర్యావరణ, జీవవైవిధ్యం పరిరక్షణ ఉద్యమాల చరిత్రలో చెట్ల నరికివేతను నిలువరించడానికి చెట్లను కౌగిలించుకోవడం లేదా ఆలింగనం చేసుకునే వ్యూహాన్ని మొట్టమొదటిసారిగా అమలుచేసినవారు రాజస్తాన్‌కి చెందిన ఖేజర్లీ గ్రామ ‘బిష్ణోయి’ జాతి ప్రజలు.
1730 సెప్టెంబరులో మహారాజా అభయ్ సింగ్, తన కొత్త రాజభవన నిర్మాణానికి అవసరమైన కలప కోసం తన సైనికులను ఖేజర్లీ గ్రామానికి పంపించడం జరిగింది. సైనికులు తమకు కావాల్సిన కలప కోసం ఖేజ్రీ చెట్లను నరకటం ఆరంభించగానే బిష్ణోయి జాతికి చెందిన అమృతాదేవి అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలైన అసు, రత్ని, భగులతో కలసి చెట్ల నరికివేతను అడ్డుకుంది. అందుకోసం అమృతాదేవి ఖేజ్రీ చెట్లను కౌగిలించుకుని చెట్ల నరికివేతను నిలువరించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో అమృతాదేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు కూడా చెట్లను కౌగిలించుకొని తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న ఇతర బిష్ణోయి జాతికి చెందిన గ్రామ ప్రజలు కూడా చెట్ల నరికివేతను అడ్డుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టును కౌగిలించుకొని తమ ప్రాణత్యాగం చేశారు. ఈ ఘటనలో మొత్తం 49 గ్రామాలకు చెందిన 363 మంది బిష్ణోయ్‌లు అమరులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాజు చెట్ల నరికివేతను నిలిపివేసి బిష్ణోయిల ధైర్యాన్ని అభినందిస్తూ, వారికి క్షమాపణలు చెప్పాడు. బిష్ణోయ్ గ్రామాలలో, సమీపంలో చెట్లను నరికివేయడం, జంతువులను వేటాడటాన్ని శాశ్వతంగా నిషేధించాడు. ఈ విధంగా బిష్ణోయిలు జీవవైవిధ్యాన్ని కాపాడటం కోసం ప్రారంభించిన చిప్కో ఉద్యమం మరికొన్ని పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా బిష్ణోయిలు ప్రారంభించిన చిప్కో ఆందోళన్ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో ప్రపంచానికి ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
జీవవైవిధ్యంపై ప్రభావం
వివిధరకాలైన జీవావరణ వ్యవస్థలు కలిగిన ఒక అతి పెద్ద జీవావరణ వ్యవస్థ భూమి. జీవావరణ వ్యవస్థలకు ఉదాహరణలు నీటి జీవావరణ వ్యవస్థ, ఎడారి జీవావరణ వ్యవస్థ, అడవి జీవావరణ వ్యవస్థ మొదలగునవి. ప్రతి జీవావరణ వ్యవస్థ మొక్కలు లేదా వృక్షాలతో ప్రారంభమవుతుంది. అంటే ప్రతి జీవావరణ వ్యవస్థలో వృక్షాలు మొట్టమొదటి స్థానంలో ఉంటాయి. రెండో స్థానంలో శాకాహారులు(హెర్బివోర్స్), మూడో స్థానంలో మాంసాహారులు(కార్నివోర్స్). శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు మొదలగు వాటితో కూడిన ‘డికంపోజర్స్’ జీవావరణ వ్యవస్థలో నాలుగో స్థానంలో ఉంటాయి. అంటే, ప్రతి జీవావరణ వ్యవస్థలో నాలుగు స్థానాల్లోని జీవులు జీవవైవిధ్యంలో ప్రధానమైనవి. ఒకదానితో మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. జీవావరణ వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్న వృక్షాలను నరికివేసి నిర్మూలిస్తే దాని ప్రభావం మిగతా మూడు స్థానాలలో ఉన్న జీవులపై పడి అది జీవావరణ వ్యవస్థ వినాశనానికి దారితీస్తుంది.
జీవవైవిధ్యం ప్రాముఖ్యత
1985లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన వాల్టర్ జి. రోసెన్ ‘జీవవైవిధ్యం’ అనే పదాన్ని తొలిసారి ప్రపంచానికి తెలియజేశాడు. ఆహార భద్రతకు జీవవైవిధ్యం చాలా అవసరం. అనేక మొక్కలు ఔషధాలుగా పనిచేస్తాయి. .జీవవైవిధ్యం పర్యాటకం, వినోద కార్యకలాపాలు, ఇతర కార్యకలాపాల ద్వారా ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది. జీవవైవిధ్యంలో ముఖ్యంగా కీటకాలు, ఇతర జంతువులు మొక్కల పరాగ సంపర్కానికి కీలకమైనవి, ఇవి ఆహార ఉత్పత్తికి అవసరం. జీవవైవిధ్యం నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. మొక్కల పోషక చక్రంలో జీవవైవిధ్యం కీలకపాత్ర పోషిస్తుంది. నేలను సారవంతం చేయడంలో జీవవైవిధ్యం ఉపయోగపడుతుంది. జీవవైవిధ్యం వ్యాధుల వ్యాప్తిని అడ్డుకొంటుంది.
మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ
ఇథియోపియాలో జరిపిన ఒక పరిశోధన జీవవైవిధ్యం నష్టాన్ని, మానవులు– వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న అంతర్-జాతుల సంఘర్షణగా పేర్కొంది. అడవులను నిర్మూలించటం వలన వన్యప్రాణులకు ఆహారం లభించక, ఆహారము కోసం అవి జనావాసాలలోనికి ప్రవేశిస్తాయి. ఇది పంట నష్టం, ఆస్తి నష్టం, శారీరక గాయాలు, మానవ ప్రాణనష్టాన్ని కలుగజేస్తుంది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అడవుల నరికివేత వలన జనావాసాలలోనికి ప్రవేశించిన జింకలు..వీధి కుక్కలు జరిపిన దాడిలో మరణించినట్లు వార్తలొచ్చాయి. భూమిపై ప్రస్తుతం నివసిస్తున్న జీవం, జీవవైవిధ్యం కొన్ని బిలియన్ సంవత్సరాల పరిణామక్రమం ఫలితంగా ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాల పేరిట, భవన నిర్మాణాల పేరిట సారవంతమైన వ్యవసాయ భూములను, జీవ వైవిధ్యాన్ని నిర్మూలిస్తే వాటిని తిరిగి పొందలేం. తద్వారా మానవుని ఉనికి భూమిపై కనిపించదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణతో కూడిన మానవ ఆర్ధిక అభివృద్ధిని ఎంచుకోవడం సరైన మార్గం. కాబట్టి ప్రభుత్వాలు ఈ కోణంలో ఆలోచిస్తే ఎటువంటి వివాదాలకు తావు ఉండదు.
- డా.శ్రీధరాల రాము,
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్