ఈ వేసవికి ఎక్కడికి టూర్ వేద్దామా? అని ఆలోచిస్తున్నారా! టూర్ అంటే ఓన్లీ నేచర్, ఫుడ్ ఎంజాయ్ చేయడమే కాదు, ఇంకెన్నో విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా! మనదేశంలోనే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈసారి సమ్మర్ టూర్‌కి రెడీ అయిపోండి. ఎక్కడికి అంటారా... పుణెకి దగ్గర్లో ఉన్న లోనావాలాకి. మైమరిపించే ప్రకృతి దృశ్యాలు, ఆశ్చర్యపరిచే ప్రాచీన గుహలు, ఉల్లాసంగా చేసే అడ్వెంచర్స్‌కు పెట్టింది పేరు ఈ టూరిస్ట్ ప్లేస్. మరి అక్కడ ఏమేం ఉంటాయో... ఎలా ఎంజాయ్ చేయొచ్చో.. చదివి తెలుసుకోండి.
లో నావాలా.. ఇదొక పర్వత ప్రాంతం. 150 అడుగుల ఎత్తు నుంచి కాళ్లకు తాడు కట్టుకుని బంగీ జంప్ చేయడం ఇక్కడి స్పెషల్. చిక్కీ అనే స్వీట్‌కి ఇక్కడ డిమాండ్ ఎక్కువ. వీకెండ్ టైంలో ముంబై, పుణెల నుంచి చాలామంది ఇక్కడకి వస్తుంటారు. అలనాటి కోటలు, పురాతన గుహలు, జలపాతాలు వంటి అద్భుతమైన ప్రదేశాలను చూడాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే.
టైగర్స్ పాయింట్
ఇది 650 మీటర్ల ఎత్తైన కొండ. దీన్ని ‘టైగర్స్ లీప్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది చూడ్డానికి లోయలోకి ఒక పెద్ద పులి దూకుతున్న ఆకారంలో కనిపిస్తుంది. లోనావాలా నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశం ఇక్కడి టూరిస్ట్ పేస్ల్‌లో ఒకటి. ప్రకృతి అందాలతోపాటు ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటి అడ్వెంచర్స్ చేయడానికి వీలుంది.
కార్లా గుహలు
సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుహల్లో నిర్మించిన చైత్యాలు, విహారాలు ఆ కాలాన్ని గుర్తుచేస్తాయి. మనదేశంలో ఉన్న పురాతన బౌద్ధ గుహల్లో ‘కార్లా కేవ్స్’ చాలా ఫేమస్. ఈ గుహల్లో బౌద్ధ మత స్తూపాలు, శాసనాలు కనిపిస్తాయి. ఇక్కడ 37 స్తంభాలతో కట్టిన కళ్లు చెదిరేలాంటి చైత్య హాలు ఉంది.
ఆంబీ వ్యాలీ
లోనావాలాకు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన టౌన్ షిప్ ఆంబీ వ్యాలీ. పిక్నిక్ స్పాట్‌గా, వీకెండ్ ట్రావెల్ స్పాట్‌గా పాపులర్.10 వేల ఎకరాల పర్వత ప్రాంతంలో ఈ టౌన్ షిప్ కట్టారు. సహజమైన ప్రకృతి అందాలు, టూరిస్ట్‌లకు కావాల్సిన అన్ని వసతులతో చాలా బాగుంటుంది ఈ ప్లేస్.
డ్యూక్స్‌నోస్ ట్రెక్కింగ్ ప్లేస్
లోనావాలా నుంచి 7 కిలోమీటర్ల దూరంలో డ్యూక్స్‌నోస్ ఉంది. అందమైన సహ్యాద్రి పర్వత శ్రేణులు, లోయలు, దట్టమైన అడవుల అందాలను చూడ్డానికి టూరిస్టులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్స్‌కి డ్యూక్స్ నోస్ బెస్ట్ ప్లేస్.
భూషి డ్యామ్
భూషి డ్యామ్‌ని ఇంద్రయాణి నదిపై కట్టారు. భూషి డ్యామ్ మెట్లపై నుంచి పారే నీళ్లు కనువిందు చేస్తాయి. వీకెండ్ సమయాల్లో, వర్షాకాలంలో టూరిస్ట్‌లు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.
లయన్స్ పాయింట్
భూషి డ్యామ్, ఆంబీ వ్యాలీ మధ్య లయన్స్ పాయింట్ ఉంది. ఈ కొండ పైభాగమంతా జలపాతాలు, లోయలు, పర్వతాలతో నిండి ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఇక్కడి నుంచి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది.
లోనావాలా సరస్సు
ఈ సరస్సు దగ్గర ఉండే డ్యామ్‌పై నుంచి చూస్తే ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో కనిపిస్తాయి. ఆ కొండల అంచులకు చేరుకునేందుకు ట్రెక్కింగ్ చేస్తుంటారు.
వాల్వన్ డ్యామ్
ఈ అందమైన ప్రకృతి, పచ్చదనం మధ్య సంతోషంగా గడిపేందుకు లోనావాలాలో ఉన్న అనువైన ప్రదేశం ‘వాల్వన్ డ్యామ్’. సహ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి వచ్చే నీటిని నిల్వ చేస్తారక్కడ. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే సెంటర్‌గా కూడా పనిచేస్తుంది ఈ డ్యామ్. అక్టోబర్ నుంచి మే వరకు చూడ్డానికి చాలా బాగుంటుంది లోనావాలా.
భాజే గుహలు
లోనావాలాకు దగ్గర్లో ఉండే భాజే గుహలు దేశంలో ఉన్న పురాతన గుహాలయాల్లో ముఖ్యమైనవి. ఇవి మొత్తం 18 ఉన్నాయి. వీటిని బౌద్ధ సన్యాసులు కట్టారు. మొదటి గుహ మాస్టర్ గుహ. మిగిలినవాటిలో పది బౌద్ధ విహారాలు. వాటిలో బౌద్ధ సన్యాసులు రెస్ట్ తీసుకుంటారు. మిగిలిన ఏడు గుహలు.. బౌద్ధ మత గ్రంథంలోని శిలా శాసనాలతో ఉంటాయి. 300 సంవత్సరాల కాలంలో ఒకే రాయి మీద22 గుహాలయాలు కట్టారు. వాటి ఆర్కిటెక్చర్ చూస్తే హీనయాన బౌద్ధుల నిర్మాణశైలి కనిపిస్తుంది.
రాజ్ మచి కోట
లోనావాలా, ఖండాలాకు మధ్య ఉంది రాజ్ మచి కోట. ఈ కోటపై నుంచి డ్యూక్స్ నోస్, కరనాల, భీమశంకర్, ఉల్హస్ నది వంటి ప్రదేశాల ఏరియల్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో శివాజీ కోట, చుట్టుపక్కల ఉన్న లోయలు కనిపిస్తాయి. వాగ్ జై దారి అనే మరో ఏరియా కూడా చూడొచ్చు.
లోహగడ్ కోట
ఛత్రపతి శివాజీకి చెందిన కోటల్లో మహారాష్ట్రీయుల నిర్మాణ శైలితో కట్టిన కోట ‘లోహగడ్’. దీన్ని ఉక్కు కోట అని కూడా పిలుస్తారు. శివాజీ కాలంలో ఖైదీలను ఉంచడానికి, తరువాతి కాలంలో ఈ కోటలో దోపిడి సొమ్ము దాచి పెట్టేవారు.
క్యూనె ఫాల్స్
చుట్టూ పచ్చదనం, మధ్యలో జలపాతం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. దాదాపు 650 అడుగుల ఎత్తు నుంచి జలపాతం నీళ్లు పడుతుంటాయి. ఇది లోనావాలా, ఖండాలా కొండల మధ్య నుంచి పారుతోంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ట్రైన్లో అయితే13గంటల ప్రయాణం. విమానంలో వెళ్తే పుణె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి ట్యాక్సీలో వెళ్లాలి. అలా అయితే 4 గంటల్లో చేరుకోవచ్చు.