రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. రెండు దేశాల వైఖరిని చూస్తుంటే ఎవరూ తగ్గేటట్లు కనిపించడం లేదు. పైగా ఉక్రెయిన్ లో అమెరికా అధ్యకుడు పర్యటించడం రష్యాకు ఆగ్రహం తెప్పించినట్లు అయింది. ఉక్రెయిన్, అమెరికా సాయం కోరడం, దానికి బైడెన్ వెంటనే ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కు అమెరికా యుద్ధ విమానాలను పంపించింది. ఉక్రెయిన్ భారీ సాయం కోరితే బైడెన్ అందుకు అంగీకరించినట్లు తెలుస్తున్నది. ఒక అమెరికా నుంచే గాక ఉక్రెయిన్ కు ఫ్రాన్స్ నుంచి కూడా సాయం అందుతోంది. అందుకే యుద్ధం ఇప్పుడు ముగియడం లేదు. ఉక్రెయిన్ కూడా ఇప్పుడు బాగా పుంజుకుంది, రాటుతేలింది. ఇదే రష్యాకు మింగుడు పడని విషయంగా పరిణమించింది. అసలు యుద్ధం ఎలా ముగించాలో రష్యాకు అర్థం కాకుండా ఉన్నట్లు ఉంది. పశ్చిమ దేశాలు సైతం ఉక్రెయిన్పక్షం ఉన్నాయి. పైగా అమెరికా నుంచి భారీ సైనిక సాయం, యుద్ధ విమానాలు ‘కీవ్’ కు చేరుతుండటం చూస్తుంటే ఇది ఇప్పట్లో సద్దుమణిగేటట్లు కనిపించడం లేదు.
ఐక్యరాజ్య సమితి పాత్ర?
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఐక్య రాజ్య సమితి కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంది. అలాంటప్పుడు దానికి శాంతి అనే పేరు ఎందుకు? అనేది చర్చ. ఐక్య రాజ్య సమితి చార్టర్లో పేర్కొన్న విధంగా యుద్ధ భయాన్ని తొలగించాలి. దేశాల మధ్య సయోధ్యకు ఐక్యరాజ్య సమితి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. సహకారం, మైత్రి దేశాల మధ్య పెంపొందించాలి. వాటి కోసం కృషి చేస్తేనే అది ‘శాంతి సంస్థ’ అనిపించుకుంటుంది. మరి ఎందుకో రష్యా, ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్య సమితి మౌనంగా ఉండటం, ఎలాంటి శాంతి చర్యలు చేపట్టక పోవడం పలు దేశాలను ఆశ్చర్య పరుస్తోంది. ఐక్యరాజ్య సమితి అగ్రరాజ్య కనుసన్నల్లో మెలుగుతోంది. అగ్రదేశం భారీగా నిధులు ఇస్తోంది. అందుకే ఐక్యరాజ్య సమితి చేసే ఏ చర్యలు సఫలం కావడం లేదు. గతంలో సమితి సమర్థంగా పని చేసినా, కొన్ని యుద్ధ పరిణామాలను విజయవంతంగా పరిష్కరించినా, ఇప్పుడు దాదాపు ఒక ఏడాది నుంచి జరుగుతున్న ఉక్రెయిన్– రష్యా యుద్ధం ఆపే విషయంలో పూర్తిగా విఫలం అయిందనే చెప్పాలి. అమెరికా సరైన దౌత్యం చేస్తే ఈ యుద్ధం ముగుస్తుంది. కానీ అమెరికా, రష్యాను అణగదొక్కాలనే ప్రయత్నంలో ఉంది. పైకి మంచి సంబంధాలే అంటున్నా, వాస్తవానికి ఆ దిశలో సత్సంబంధాలు లేవు. రష్యా, అమెరికా రెండు దేశాలు బలగంలో సమానమైనవే. అయితే అమెరికాతో పోల్చుకుంటే రష్యా అణు శక్తిలోనూ, సైనిక పాటవంలోనూ తక్కువే. ఆ ధైర్యంతోనే అమెరికా ఉక్రెయిన్ కు సహాయ సహకారాలు అందిస్తోంది. అమెరికాను చూసుకొని ఉక్రెయిన్ కదనానికి కాలు దువ్వుతున్నది.
భారత్ చొరవ తీసుకోవాలి
యుద్ధం ముగిసేందుకు శాంతి చర్చలే శరణ్యం అని ఎన్నిసార్లు చెప్పినా, పరిస్థితిలో మార్పు రావడం లేదు. భారత్, అమెరికా కల్పించుకుని శాంతి పరిష్కార మార్గాలు కనుగొంటే యుద్ధం ఆగిపోతుంది. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ రెండు దేశాలు ముందుకు వచ్చినా అమెరికా చెప్పే దౌత్యం రష్యా అంగీకరించదు. శాంతి మార్గాలు మూసుకు పోతాయి. అమెరికా, ఉక్రెయిన్ కు అనుకూలమైన దౌత్యం చేస్తుందని రష్యాకు తెలుసు. అందుకే అది ఒప్పుకోదు. ఏదైనా చేయగలిగితే భారత్ కే సాధ్యమవుతుంది. భారత్ ఇప్పటికే రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన శాంతి పరిష్కారం ఏ దేశమైన చూపగలదా అనే సూటి ప్రశ్న సంధించింది. దీనికి ఏ దేశం స్పందించలేదు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తున్నంత వరకు ఈ యుద్ధం ఆగదు.
కనుమ ఎల్లారెడ్డి, పాలిటీ లెక్చరర్