కారుణ్య నియామకాల్లో జీసీసీ దగా

భద్రాచలం, వెలుగు: గిరిజన సహకార సంస్థలో కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ సంస్థ షాక్​ ఇచ్చింది. వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో 15 ఏండ్లుగా పోరాటం చేస్తున్న వారు తమకు జాబ్​ వస్తుందని ఆశించారు. అయితే ఇటీవల జీసీసీ ఎండీ పేరుతో జారీ అయిన జీవో వారి ఆశలపై నీళ్లచల్లింది. జీవో ప్రకారం రాష్ట్రంలోని అభ్యర్ధుల దరఖాస్తులను పరిశీలించి కొందరికి పరిహారం, మరి కొందరికి ఉద్యోగం, అనర్హుల పేరుతో ఇంకొందరిని పక్కన పెట్టేసింది. పరిహారం కూడా రిలీజ్​ చేసేశారు. భద్రాచలం డివిజన్​కు రూ.7.35 లక్షలు, ఏటూరునాగారం డివిజన్​కు రూ.9 లక్షలు, ఉట్నూరు డివిజన్​కు రూ.8.65 లక్షలు, మాన్నూర్​ డివిజన్​కు రూ.60 వేలు ఫండ్స్​ రిలీజ్​ చేస్తూ చెక్కులు కూడా పంపించారు. 120 మంది 15 ఏండ్లుగా తమకు ఉద్యోగాలు వస్తాయని పోరాటం చేశారు. వీరిలో 60 మందికి పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.75 వేల వరకు ఇవ్వాలని నిర్ణయించారు. 30 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 30 మందిని నాట్​ ఎలిజబుల్ అంటూ డిసైడ్​ చేశారు. వివిధ రకాల వివాదాలు, డిస్మిస్​లు, సస్పెన్షన్లు తదితర కారణాలు చూపించి అనర్హులుగా తేల్చినట్లు వివరణ ఇచ్చారు. 2008 కంటే ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఏపీ జీవో ప్రకారం పరిహారం, తర్వాత చనిపోయిన వారి కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నట్లు తెలిపారు. 

ఆందోళనలో బాధితులు

జీసీసీ నిర్ణయంతో బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో పరిహారం వద్దని కలెక్టర్​కు బాధితులు వినతిపత్రం ఇచ్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐటీడీఏ వద్ద బాధితులు ఆందోళన చేశారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జీసీసీ నుంచి ఎటువంటి సమాచారం లేదంటూ బాధితులు వాపోతున్నారు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లిలో జీసీసీ సేల్స్ మెన్​గా పని చేస్తున్న పానుగంటి సూర్యప్రకాశరావు 2006లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయనకు రెండు షాపుల్లో విధులు కేటాయించారు. ఒక షాపు నుంచి మరో షాపునకు పోతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆయన కుటుంబం వీధిన పడింది. కుమారుడు పానుగంటి సాయికిరణ్​ కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకున్నాడు. ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటన చేసిన ప్రతీసారి ఆఫీసర్ల చుట్టూ తిరిగాడు. చివరకు ఇప్పుడు ఉద్యోగం లేదు, పరిహారం ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఆ పరిహారం కూడా రూ.30 వేల నుంచి రూ.70వేల లోపే ఉండడంతో ఇన్నాళ్ల పోరాటానికి ఇదేనా ఫలితమని సాయికిరణ్​ వాపోతున్నాడు. పరిహారం వద్దు.. ఉద్యోగం కావాలని వేడుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఒక్కరికో, ఇద్దరికో కాదు. ఏకంగా మరో 60 మందికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 30 మందిని అనర్హులుగా ప్రకటించి, 30 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. 

జీవో ప్రకారమే నియామకాలు చేపడతాం..

కమిషనర్, ఎండీ జారీ చేసిన జీవో ప్రకారం కారుణ్య నియామకాలు, పరిహారం విషయాన్ని తేల్చుతాం. ఐటీడీఏ పీవో ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు వచ్చాయి. గైడ్​లైన్స్  ప్రకారమే ముందుకెళ్తాం. -విజయ్​కుమార్, జీసీసీ, డీఎం, భద్రాచలం