- పీహెచ్ డీ, నెట్/సెట్ ఉన్నా రూ.20 వేలు మించని జీతం
- వర్సిటీకో తీరుగా జీతాలు పదేండ్లుగా ఇదే దుస్థితి
- ఫిక్స్ డ్ సాలరీ రూ.50 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పార్ట్ టైమ్ లెక్చరర్ల పరిస్థితి దుర్భరంగా తయారైంది. పీహెచ్ డీ, నెట్, సెట్ అర్హత ఉండి కూడా తక్కువ జీతాలకు పని చేస్తున్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీకి రెండు, మూడు లక్షలు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు రూ.60 వేలకుపైగా శాలరీలు వస్తుండగా.. వాళ్లతో సమానంగా పని చేసే పార్ట్ టైమ్ లెక్చరర్లకు నెలకు రూ.20 వేలు మించడం లేదు. అది కూడా ఆర్నెళ్లకో, ఏడాదికోసారి వస్తున్న దుస్థితి నెలకొంది. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ సర్కార్ పార్ట్ టైమ్ లెక్చరర్లను కాంట్రాక్ట్ లెక్చరర్లుగా అప్ గ్రేడ్ చేయకుండా పదేండ్లు వెట్టి చాకిరీ చేయించుకుందనే విమర్శలు ఉన్నాయి.
పార్ట్ టైమ్ లెక్చరర్లే ఎక్కువ..
వర్సిటీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పార్ట్ టైమ్ లెక్చరర్లు, అకాడమిక్ కన్సల్టెంట్లు, గెస్టు లెక్చరర్లు విద్యార్థులకు బోధిస్తున్నారు. తొలుత నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూల ద్వారా పార్ట్ టైమ్ లెక్చరర్లుగా రిక్రూట్ చేసుకుని, 16 పిరియడ్ల ఫుల్ వర్క్ లోడ్ కాగానే కాంట్రాక్ట్ లెక్చరర్లుగా అప్ గ్రేడ్ చేసేవారు. ఇది 2014 వరకు అమలైంది. ఓయూ పరిధిలో 418, కేయూ పరిధిలో 220, ఎంజీయూ పరిధిలో 35 , శాతవాహన వర్సిటీ పరిధిలో 17, పాలమూరు, తెలంగాణ, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలు, తెలుగు వర్సిటీలో కలిపి మరో 150 మంది పార్ట్ టైమ్ లెక్చరర్లు, అకాడమిక్ కన్సల్టెంట్లు ఉన్నారు. అన్ని వర్సిటీల్లోని ఫ్యాకల్టీలో సగం మంది పార్ట్ టైమ్ లెక్చరర్లే. రాష్ట్రం వచ్చాక కూడా అప్ గ్రేడ్ చేయకపోవడంతో కొందరు పార్ట్ టైమ్ లెక్చరర్లుగానే రిటైర్డ్ అవుతున్న పరిస్థితి ఉంది.
అరకొర జీతాలు.. ఆర్నెళ్లకోసారి
పెద్ద చదువులు చదివినా..జీతాలు అరకొరగానే ఉన్నాయి. రెగ్యులర్ ఫ్యాకల్టీకి వచ్చే శాలరీలో నాలుగో వంతు, పార్ట్ టైం లెక్చరర్లకు అందులో 10 శాతం కూడా లేదు. వీరికి వర్సిటీకో తీరుగా చెల్లిస్తున్నారు. యూజీసీ రూల్ మేరకు.. పిరియడ్ కు రూ.1,500 ఇవ్వాల్సి ఉండగా రూ.700 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో నెల జీతం రూ.15 వేల నుంచి రూ.20 వేల లోపే ఉంది. కేయూలోనైతే గత వీసీ రమేష్ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల లెక్చరర్లకు వచ్చే జీతమే తక్కువంటే అందులోనూ 40 శాతం కోత విధించి అమానవీయంగా వ్యవహరించారు. రెగ్యులర్ గా జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను వెళ్లదీయాల్సి వస్తోంది. సర్కార్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చెప్పే కాంట్రాక్ట్ లెక్చరర్లకు రూ.55 వేలకు పైగా శాలరీలు ఇస్తోంది. పీజీ కాలేజీల్లో చెప్పే లెక్చరర్లకు మాత్రం రూ.20 వేలు కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు తీవ్ర వస్తున్నాయి.
ఎస్ఎఫ్ సీ, రెగ్యులర్ కోర్సుల పేరిట వివక్ష
రాష్ట్రంలో క్యాంపస్ లు, అనుబంధ కాలేజీలు కలిగిన యూనివర్సిటీల్లో పదుల సంఖ్యలో కోర్సులు నిర్వహిస్తున్నారు. పది, పదిహేనేండ్లలో కొత్తగా ప్రారంభించిన పీజీ కాలేజీల్లో కోర్సులన్నీ రెగ్యులర్ మోడ్ లో కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగానే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆయా కోర్సులు బోధించేందుకు ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, నిధులను మంజూరు చేయలేదు. దీంతో స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ వస్తేనే కోర్సులు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్ల కు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూజీసీ రూల్స్ ప్రకారం ఏదైనా ఒక కోర్సును ఐదేండ్లపాటు సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తే రెగ్యులర్ కోర్సుగా మార్చాల్సి ఉంటుంది. శాతవాహన, కాకతీయ వర్సిటీలకు కొత్తగా వచ్చిన వీసీలు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ గా మార్చేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మేనిఫెస్టోలోనూ పెట్టిన కాంగ్రెస్
వర్సిటీల్లోని పార్ట్ టైమ్ లెక్చరర్ల బాధలను అర్థం చేసుకుని నెలకు రూ.50 వేలు మినిమం సాలరీ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇటీవల ఉన్నత విద్యాశాఖ వర్సిటీల్లోని పార్ట్ టైమ్, గెస్ట్, అకడమిక్ కన్సల్టెంట్ల జాబితా కూడా తెప్పించుకున్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ ఆమోదం పొందితే పార్ట్ టైమ్ లెక్చరర్లకు న్యాయం జరిగే చాన్స్ ఉంది.