యూట్యూబర్‌‌ సన్నీయాదవ్‌‌పై లుకౌట్‌‌ నోటీసులు

యూట్యూబర్‌‌ సన్నీయాదవ్‌‌పై లుకౌట్‌‌ నోటీసులు

సూర్యాపేట, వెలుగు: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో యూట్యూబ్ ఇన్‌‌ఫ్లూయెన్సర్‌‌‌‌ బయ్యా సన్నీ యాదవ్‌‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ ప్రమోషన్ల విషయంలో ఈ నెల 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్‌‌లో సన్నీ యాదవ్‌‌పై కేసు నమోదైంది. విచారణలో భాగంగా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించి పోలీసులు లుకౌట్ సర్కులర్ జారీ చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ రవి మీడియాకు తెలిపారు. సన్నీ యాదవ్ విదేశాల నుంచి ఏ మార్గంలో భారత్ వచ్చినా ఇమిగ్రేషన్ అధికారుల ద్వారా అతన్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు. 

యూట్యూబ్‌‌ వీడియోలతో బెట్టింగ్‌‌ యాప్‌‌లకు ప్రచారం చేస్తున్న సన్నీయాదవ్‌‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌ సోషల్ మీడియాలో పోస్టు చేసి, సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్‌‌ మీడియా అకౌంట్‌‌కు ట్యాగ్‌‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌ పోలీసులు.. సన్నీ యాదవ్‌‌ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను లండన్‌‌లో ఉన్నట్లు తెలియడంతో సూర్యాపేట జిల్లా సైబర్‌‌ క్రైం పోలీసులు లుకౌట్‌‌ నోటీసులు జారీ చేశారు.