హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఐడీ జారీ చేసిన లుక్‌ఔట్ నోటీసుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరుతూ మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కె.శరత్.. కేసుకు సంబంధించి ఉత్తర్వులను తర్వాత వెలువరిస్తామని చెప్పారు. శైలజా కిరణ్ తరఫు సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, వాసిరెడ్డి విమల్ వర్మ వాదిస్తూ, ఏప్రిల్ 27 నుంచి మూడు వారాల పాటు విచారణను వాయిదా వేయాలని సీఐడీకి పిటిషనర్ ఇ–మెయిల్ చేశారన్నారు. ఈ నెల 6న ఇంటి వద్ద విచారణకు సిద్ధంగా ఉండాలని కోరితే అందుకు సిద్ధమేనని చెప్పిన తర్వాత కూడా సీఐడీ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయడం అన్యాయ మని పేర్కొన్నారు.
దీనిపై ఏపీ సీఐడీ తరఫు లాయర్ వాదిస్తూ, ఇంతకుముందు ఇచ్చిన మూడు నోటీసులకు పిటిషనర్ స్పందించలే దన్నారు. సీఐడీ అనుమతి లేకుండానే అమెరికా వెళ్లారని, దీంతో మే 17న లుక్‌ఔట్ సర్క్యులర్ కోసం కేంద్రానికి లేఖ రాశామని వివరించారు. కేంద్రం తరఫు లాయర్ స్పందిస్తూ, లుక్‌ఔట్ నోటీసు జారీ పరిధి రాష్ట్రాలకు లేదని, అయితే, కేంద్రం ఇప్పటి వరకు లుక్‌ఔట్ నోటీసు ఇవ్వలేదని చెప్పారు. వాదనల తర్వాత పిటిషన్‌పై తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది.