
అంబర్పేట్,వెలుగు: చట్టాల్లోని లొసుగులే భూ సమస్యలకు ప్రధాన కారణమని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటు పార్థసారథి రాసిన ‘ధరణి భూ భారతి చట్టాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సారంపల్లి మాట్లాడుతూ.. భారత దేశంలో భూమి అనేది సామాజిక అంశంగా స్థిరపడిందని, అన్ని సమస్యలు దానితోనే ముడిపడి ఉన్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఆయా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూ సమస్యలు తీరడం లేదని చెప్పారు.
చట్టాల్లో ఉన్న లొసుగులే.. ప్రజలకు శాపంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాం హయాంలో 1940 లో జరిగిన భూ సర్వే తర్వాత ఇప్పటివరకు సర్వే జరగలేదని, ఫలితంగా భూ హక్కులకు సంబంధించి అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయన్నారు. 2020లో ఆర్ఓఆర్ చట్టాన్ని ధరణి పేరుతో తెచ్చారని చెప్పారు.
ఆ పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కారం కాకపోగా మరిన్ని పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన ప్రజా పాలనలో వచ్చిన లక్ష 30 వేల దరఖాస్తులో 70 వేల పైగా భూ సమస్యలకు సంబంధించినవేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎం శ్రీనివాస్, ఎస్ వెంకటేశ్, మూర్తి, అడ్వకేట్ సి రామచంద్ర రెడ్డి, రోజా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.