నీటి వాటాను ఆగం పట్టించి..పక్క రాష్ట్రానికి దోచిపెట్టారు

నీటి వాటాను ఆగం పట్టించి..పక్క రాష్ట్రానికి దోచిపెట్టారు

 కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ, తప్పొప్పులు ఎత్తి చూపుకుంటున్న సందర్భం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు  ఏలిన ఆ ఒక్కడే రెండు నెలల ప్రభుత్వాన్ని నిందిస్తుంటే ఎంత ఆశ్చర్యానికి గురిచేస్తుందంటే.. తాము చేసిన తప్పులు పక్కదారి పట్టించేందుకు అధికార పక్షాన్ని గందరగోళానికి గురిచేస్తున్న వైనంగా కనపడుతున్నది. రాష్ట్రం ఏర్పడగానే కొలువుదీరిన ప్రభుత్వం నీళ్ల విషయంలో  కృష్ణా నదీ జలాల వాటా కోసం కొట్లాడవలసి ఉండే. కానీ, నేడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​పై  కృష్ణా జలాలను మొత్తం కేంద్రానికి అప్పజెప్పారని, ఏపీకి కట్టబెట్టారని నేడు అనడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.  ప్రాజెక్టులు, నీళ్లంటే మాకే తెలుసు అనుకుంటున్న కేసీఆర్, హరీష్​లు మరి ఎందుకు సాధింలేకపోయారు?

గత ప్రభుత్వ తప్పిదాలను, తప్పులను, అవినీతిని చర్చకు రాకుండా ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే గత ప్రభుత్వంలో కృష్ణా నదీ జలాలపై చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేఆర్ఎంబీకి ఈ ప్రభుత్వం అప్పగించిందని బుకాయింపులు మొదలుపెట్టారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మంత్రులు మేం అప్పజెప్పలేదని చెప్పినా.. పదే పదే  మాట్లాడుతున్నారంటే ప్రభుత్వాన్ని తమ ట్రాప్​లోకి దించాలనే ప్రయత్నం కనపడుతున్నది. అసలు కేఆర్ఎంబీ పాత్ర ఏమిటి? దాని విధి నిర్వహణ ఏమిటి? దాని విధి విధానాలు తెలిసిన ఎవరైనా చర్చ చేయరు. అది ప్రభుత్వమైనా! ప్రతిపక్షమైనా! కేఆర్ఎంబీ అనేది.. కేవలం చౌరస్తాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనాలను కంట్రోల్ చేయడం లాటింది. కేఆర్ ఎంబీ పాత్ర కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ లాంటిదే! 

బీఆర్​ఎస్​ ట్రాప్​లో పడొద్దు

అసలు కేఆర్ఎంబీ పరిధి కేసీఆర్​ తన  మొదటి అపెక్స్ సమావేశంలో  ఒప్పుకున్న వాటాను మాత్రమే పర్యవేక్షణ చేస్తుంది. ఇది నదీ జలాల వాటాను నిర్ణయించదు. నిర్ణయించిన వాటాను పంపిణీ చేస్తుంది. ఆ సోయి మరిచి ప్రతిపక్షం చేస్తున్న వాదనలో ప్రభుత్వం కూడా వారి ట్రాప్ లో పడి చర్చ చేయడం ద్వారా ఏం ప్రయోజం లేదు. కృష్ణా నదీ జలాల్లో  తెలంగాణ వాటా సాధించడంలో విఫలమైన దోషి గత ప్రభుత్వ అధినేత కేసీఆర్​ ఇయ్యాల ‘ఉల్టా చోర్​ కోత్వాల్​ కో డాటా’  అన్నట్లుంది. 

ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపిన పాపాన పోలేదు

నీటివాటాను అటుంచితే.. నేటి ఏపీ ప్రభుత్వం అన్యాయంగా కొత్త ప్రాజెక్టులు అనగా.. పోతిరెడ్డిపాడు పెంపు సామర్థ్యం లక్ష క్యూసెక్కులు, హంద్రీనీవా 6 వేల క్యూసెక్కులు, ముచ్చుమర్రి 6 వేల క్యూసెక్కులు, వెలిగొండ రెండు టన్నెల్స్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, రాయలసీమ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35 వేల క్యూసెక్కులు అనగా.. మొత్తంగా లక్షా 55 వేల క్యూసెక్కులు అంటే.. ఒక రోజుకు సుమారు 13.5 టీఎంసీలు తరలించడానికి ఏపీ తన ప్రాజెక్టులు నిర్మించుకుంటుంటే..మన గత ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయింది?  కృష్ణా నది ఎడమ భాగం నుంచి 13.5 టీఎంసీలు తరలించే ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదు?  కృష్ణా నది బేసిన్ పై మన వద్ద 2 టీఎంసీలకు ప్రాజెక్టులు కూడా నిర్మించలేదు. పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్టులు కలిపి కూడా నిర్మించలేదు. 

ఏపీకి దోచిపెట్టారు

పదేండ్లలో ఏపీ ప్రభుత్వం 13.5 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుంటుంటే వారితో కలిసి మీరు కలిసి భోజనాలు చేశారు తప్ప..తెలంగాణపై కేసీఆర్​కు ప్రేమ ఎక్కడిది?  మనకు 15 టీఎంసీలతో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకునే వనరు, వసతి, సరిపడా ఆయకట్టు  దక్షిణ తెలంగాణలో పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు కలిసి 45 లక్షల ఎకరాల సాగునీటి యోగ్యత కూడా ఉంది. ఇంత సౌలభ్యం ఉన్నా గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనపడుతుంది.

299 టీఎంసీలకే సంతకం పెట్టాడు

తెలంగాణకు రావలసిన వాటాపై జరిగిన మొదటి అపెక్స్ సమావేశంలోనే.. యధావిధిగా బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్​కు ఎన్ బ్లాక్ గా 811 టీఎంసీలు కేటాయింపులు జరిపితే.. ఆనాటి  ఉమ్మడి ఏపీలో ఆంధ్రాకు చెందిన చీఫ్ ఇంజనీరు రాజారావు కమిటీ వేసి ఎన్ బ్లాక్​గా  ఉన్న 811 టీఎంసీల వాటాను ఆంధ్ర ప్రాంతానికి  512, తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలుగా 1990లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపారే తప్ప.. పరీవాహక ప్రాంత ప్రకారంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా నీటి కేటాయింపులు చేయలేదు. స్పష్టంగా మన కండ్లముందు ఆధారాలు ఉన్నప్పుడు మరి అపెక్స్ సమావేశంలో లేవనెత్తి పరీవాహక ప్రాంతం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందే అని తాత్కాలిక పంపకాలు చేసుకుని ఉంటే.. కనీసం మన వాటా పెరిగేది. ఈ ఇంగిత పరిజ్ఞానం గత ప్రభుత్వానికి లేకపోవడం వల్లనే ఈ పదేండ్లుగా మనవాటా నఫ్టపోయాం.  మరోవైపు వాటా కోసం కొట్లాడటానికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. 

కృష్ణా ప్రాజెక్టుల ద్వారా నీటి వాడకం పెరగాలి

కృష్ణా నదీ జలాలపై గత ప్రభుత్వం చేసిన తప్పులను చరిత్రను క్షమించదు. వాటిపై చర్చ చేయకుండా, గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను ఈ ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అవి కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల మీద 30 రోజుల వ్యవధికి అనుకూలంగా రోజుకు 15 టీఎంసీల నీటిని తోడుకునే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం టాప్ ప్రయార్టీగా తీసుకోవాలి. ఇలాంటి ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు అవసరం. అయితే.. ఆర్థిక వనరులు లేనిపక్షంలో యాన్యుటి/బీవోటి పద్దతి ప్రకారం ప్రాజెక్టులు చేపట్టడానికి ఇలాంటి అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలి.

జూరాల సోర్స్​కే ప్రాధాన్యమివ్వాలి

 కృష్ణా నదిపై ఎగ్జిస్టింగ్ పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కంటిన్యూ చేసుకుంటూనే జూరాల సోర్స్ నుంచి దాదాపు 4 టీఎంసీల కెపాసిటీతో కొత్తగా భారీ ప్రాజెక్ట్ ను చేపట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కల్వకుర్తి ప్రాజెక్ట్ ను మరింత పటిష్టం చేయాలి. ఎస్ఎల్ బీసీ టన్నెల్​ను వెంటనే పూర్తి చేయాలి. డిండీ ఎత్తిపోతలను కూడా సత్వరమే పూర్తి చేసుకోవాలి. దీంతో మనం ప్రధాన ప్రయార్టీగా జూరాల సోర్సునే పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి అయితేనే దక్షిణ తెలంగాణను సస్య శ్యామలం చేసుకోగలం. 
 
ఎత్తిపోతలకు సోలార్​ విద్యుత్ వాడాలి

 ఈ ప్రాజెక్ట్​లు ఎత్తిపోతలవి కావడం వల్ల విద్యుత్ అనేది చాలా ప్రధాన అవసరం.  ఇది అధిగమించడానికి ఇరిగేషన్ శాఖలో 13 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. దీంట్లో 1.5 లక్షల ఎకరాలు సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ప్రైవేటు ఏజెన్సీకి లీజుకు బీవోటీ బేసిస్ మీద ఇచ్చినచో 30 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ప్రభుత్వం ఎలాంటి ఖర్చు లేకుండా15 వేల మెగా వాట్ల విద్యుత్​ను షేర్ వాడుకోవచ్చు. ఇలాంటి వనరులను ప్రభుత్వం ఉపయోగించుకుంటే సాధ్యం కానిది ఉండదు. అదేవిధంగా, కేఆర్ఎంబీపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను పట్టించుకోకుండా వారు చేసిన తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.

కొత్త ఆయకట్టు లేదు

తెలంగాణ వచ్చిన తర్వాత  పదేండ్లలో కొత్తగా ఏర్పడ్డ ఆయకట్టు ఎంత అంటే శూన్యం.  2004 నుంచి 2024 వరకు ఈ ఇరవై ఏండ్లలో సాగునీటిపై అంచనా వ్యయం రూ. 3 లక్షల కోట్లు. ఖర్చు పెట్టింది దాదాపు రూ. 2 లక్షల కోట్లు. దీని మొత్తం ఆయకట్టు 75 లక్షల ఎకరాలు. కానీ ఎక్కడా కూడా కొత్త ఆయకట్టు సాగులోకి రాలేదు. కేవలం గతంలో ఉన్న మీడియం, మైనర్ ఇరిగేషన్​లో ఉన్న 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది తప్ప, కొత్త ఆయకట్టుకు ఉపయోగపడలేదు. అంటే.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు కొన్ని పూర్తయినా .. మెయిన్ కెనాల్ నుంచి ఫీల్డ్ కెనాల్ వరకు పూర్తి కాలేదు. అందుకే కొత్త ఆయకట్టు సాగులోకి రాలేదు. వీటిపైన ప్రస్తుత ప్రభుత్వం దృష్టిపెట్టాలి. తమకు ఎంతో అనుభవం ఉందని అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ కనీసం వీటిని కూడా పూర్తిచేయలేదు. ఇక తాను గొప్పగా చెప్పకుంటున్న కాళేశ్వరం ఏమైందో అందరికీ తెలుసు. అది ఇప్పుడు కుంగిన షో పీస్​లా.. టూరిస్ట్ స్పాట్​గా మారింది.  

Also Read : సుడా ప్లాట్లు సేల్​ అయితలేవ్! సిద్దిపేటలోని మెగా వెంచర్​పై నీలి నీడలు

పాలమూరు–రంగారెడ్డి సోర్స్​మార్చి  మరింత అన్యాయం చేశారు

 ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కట్టుకుంటుంటే.. తెలంగాణకు  కొత్త ప్రాజెక్టులు కట్టకపోవడం,  కేసీఆర్ తప్పిదం కాదా?  ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు నిర్మించగా, పాలమూరు– -రంగారెడ్డికి జూరాల సోర్స్ నుంచి డీపీఆర్ తయారు చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కృష్ణా నదిపై చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం ఏది? ఆయన చేసిపెట్టిన తీరని నష్టం పాలమూరు-–రంగారెడ్డిని జూరాల సోర్స్ నుంచి కాకుండా,  శ్రీశైలం సోర్స్ ద్వారా తీసుకుని కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. 

-  బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షుడు,
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక

  • Beta
Beta feature
  • Beta
Beta feature