
వినాయకుడి పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఓ చైతన్యం తమను ఆవహించినట్లుగా భావిస్తారు. వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు. తన గోడు వింటాడు. తనకు ఏ కష్టమూ రానివ్వడని ప్రతి భక్తుడూ భావిస్తాడు. భక్తుల మనసులలో ఇంతగా సుప్రతిష్ఠితమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. అయితే గణపతి ఆరాధన రకరకాలుగా ఉటుంది. శాంత రూపం నుంచి ఉగ్రరూపం వరకు లోహం నుంచి మట్టి వరకు ఇలా రకరకాల రూపాల గణపతులను ఆరాధిస్తే రకరకాల ఫలితాలు వస్తాయని శాస్త్ర ప్రవచనం. వాటి గురించి తెలుసుకుందాం…
పూజకు ఎలాంటి విగ్రహాన్ని వినియోగించాలి
మన ఇంట్లో నిత్యం చేసుకొనే పూజలకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి వంటి వ్రతములు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది. ఎంతపెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూపదీప నైవేద్యములు జరగాలి. గనక సాధారణంగా ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండాఉండే విగ్రహాలను మాత్రమే వాడాలి. వినాయక చవితి రోజు భక్తులంతా తమ అభీష్టానికి, స్తోమతకు అనుగుణంగా బొమ్మను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. అయితే వినాయకుడు ఒక్కడే అయినా రకరకాల ఆకృతుల్లో, రంగుల్లో బొమ్మలు ఎంపిక చేసుకుంటారు. ఒక్కో వినాయకుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
తొండం ఎడమ వైపు ఉన్న వినాయకుడు
వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేస్తే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఏపని మొదలెట్టినా విజయం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. రాముడు... రావణాసురుడిని చంపేందుకు మొదట శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో మొదట చేసిన గణపతి ఆరాధన సమయంలో అర్చించిన వినాయకుడికి తొండం ఎడమవైపున ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
తొండం కుడివైపు ఉన్న వినాయకుడు
వినాయకుడి తొండం కుడి వైపు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని తెచ్చుకుంటే..మీ కోర్కెలు నెరవేరతాయట. ఇలాంటి విగ్రహాన్ని పూజించేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలి...లేదంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. రాజులు సాధారణంగా ప్రజాపాలనపై దృష్టి సాగిస్తారు. కాని దేవాలయాలు కట్టిస్తారు కాని... వాటి నిర్వహణ ఎలా సాగుతుందో పట్టించుకోరు. అంతా మంత్రులు.. తదితరులే చూసుకుంటారు. పాండవులు పరిపాలించే సమయంలో యాధృచ్చికంగా తొండం కుడివైపున ఉన్న వినాయకుడిని పూజించారట. గణపతి హోమం నిర్వహించినప్పుడు.. వేదాల ప్రకారం నిర్వహించలేదని... అందులో కొంత లోపం జరిగిందని ద్రోణాచార్యులు చెప్పినా... ఆయన మాటలు పెడచెవిన పెట్టారని చెబుతుంటారు. అందుకే పాండవులకు గణపతి ఆశీస్సులు లేక అడవుల పాలయ్యారని సామవేదంలో ఉందని చెబుతుంటారు.
Also Read :- మట్టి గణపతినే ఎందుకు పూజించాలి.. విగ్రహం ఎంత ఎత్తు ఉండాలి... పురాణాల్లో ఏముంది..
తొండం మధ్యలో ఉంటే...
వినాయకుడి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందట. ఇంట్లోని కుటుంబ సభ్యులకు మంచి శక్తి లభిస్తుంది. పాడి పంట వృద్ది చెంది.... సంపద పెరుగుతుందని పండితులు చెబుతుంటారు. ఇలాంటి వినాయకుడిని పూజిస్తే వారు చేపట్టిన ప్రతి పనిలోనూ... కెరీర్ లోనూ సక్సెస్ అవుతారని చెబుతున్నారు.
తెలుపు రంగు వినాయకుడు
తెల్లని రంగులో ఉండే గణేషుని విగ్రహాన్ని పూజించే ఇంట్లో శాంతి ఉంటుంది. సాధారణంగా ఇంట్లో, దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే తెల్లని వినాయకుడి విగ్రహాలను పూజిస్తే ఆ కలహాలు అన్నీ తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారట.
రావి ఆకు వినాయకుడు
రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.
ఇక గ్రహచారరీత్యా మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు .
- సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
- చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
- కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
- బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
- గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
- శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతిని పూజించాలి.
- శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
- రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
- కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.
వెండి గణేషున్ని పూజిస్తే పేరు ప్రఖ్యాతులు, చెక్క రూపంలో ఉన్న గణేషున్ని పూజిస్తే ఆరోగ్యం, ఇత్తడి గణేషున్ని పూజిస్తే సంతోషం, మట్టి గణపతిని పూజిస్తే కెరీర్‌లో సక్సెస్ అవుతారు. ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు, పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. స్ఫటిక గణపతి సుఖశాంతులు ప్రసాదిస్తాడు. మట్టి గణపతిని ఆరాధిస్తే సకల శుభాలను ఇస్తాడు. ఇక హరిద్ర, పాదరస, పసుపుకొమ్ము ఇలా రకరకాల గణపతులను పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. భక్తితో, శ్రద్ధతో ఎంత పూజిస్తే అంతకు రెట్టింపు ఫలితం ఇస్తాడు. ఇక ఆలస్యం ఎందుకు విఘ్ననాయకుడుని పూజించి సకల కోరికలను నెరవేర్చుకోండి.