ధంతేరస్ వచ్చిందంట... ఊరు వాడలన్నీ దీపాలతో నిండిపోతాయి. చిచ్చుబుడ్డుల మెరుపులు, టపాసుల మోతలు మొదలవుతాయి. అందుకే ఈ పండుగను చోటీ దివాళీ అని కూడా అంటారు. ఈ రోజు ఆడవాళ్లంతా బంగారం, వెండి షాపులకు క్యూ కడతారు. కనీసం అరకాసు బంగారమైనా కొనాలనుకుంటారు. ఇంటింటా లక్ష్మీదేవి కొలువు తీరే ధంతేరస్ పండుగ ఏ ఏడాది నవంబర్ 10 వ తేదీన జరుపుకుంటారు. అయితే ఈ పండుగ తెలుగురాష్ట్రాల్లో తక్కువ గానీ.. నార్త్ ఇండియాలో బాగా జరుపుకొంటారు.
దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే త్రయోదశి (నవంబర్ 10) రోజున ధంతేరస్ జరుపుకుంటారు. ఈ పండుగనే ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు. సిరి సంపదలలిచ్చే శ్రీ మహాలక్ష్మికి ఆ రోజున ఘనంగా పూజలు చేస్తారు, ఆరోజు అనగా నవంబర్ 10వ తేదీన వెండి, బంగారం కొంటే అష్టైశ్వరాలు వస్తాయని నమ్ముతారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ ఎలా వచ్చింది.. ఈ పండుగ పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాం. . .
అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీర సాగరాన్ని చిలుకుతున్నారు. ఆ సమయంలో ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున పాలకడలి నుంచి లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవితో పాటు కల్పవృక్షం, కామధేనువు విష్ణుమూర్తి అవతారమైన దేవ వైద్యుడు ధన్వంతరి కూడా అవతరించారు. దాంతో అప్పటి నుంచి ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరి పుట్టిన రోజునే ధంతేరస్ పండుగగా జరుపుకుంటున్నారు. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కూడా ఆ రోజే పుట్టడంతో ఈ పండుగను ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు.
ధన త్రయోదశి పండుగ గురించి మరో పురాణ గాథ కూడా కలదు. అదేంటంటే హిమ అనే రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడికి పెళ్లైన నాలుగో రోజున పాముకాటుతో మరణగండం ఉంటుంది. ఈ విషయం తెలిసిన అతని భార్య అతడిని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటుంది. ఆ రోజు భర్త నిద్రపోకుండా ఆభరణాలు, బంగారు, వెండి నాణాలను గుమ్మం దగ్గర కుప్పగా పోసింది. కథలు చెబుతూ, భజనలు పాడుతూ కూర్చోబెట్టింది. దాంతో పాము రూపంలో వచ్చిన యముడికి ఆ బంగారు వెలుగుల మధ్య ఏమీ కనిపించలేదు. గది లోపలకు వెళ్లలేక ఆ రాశి మీదే కూర్చొని ఆ కథలు పాటలు వింటూ ఉండిపోయాడు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. ఆ పెళ్లి కూతురి తెలివి తేటలకు గుర్తుగా అప్పటి నుంచి ఆ రోజున ధంతేరస్ వేడుకలు జరుపుకుంటున్నారని పురాణాలు చెబుతున్నాయి.
బంగారం... వెండి...
ధంతేరాస్ రోజున ( నవంబర్ 10) మహిళలు తెల్లవారుజామున లేచి ఇల్లు, వాకిలిని శుభ్రం చేస్తారు. సిరి సంపదకోసం ఆ రోజు లక్ష్మీదేవికి, ఆయురారోగ్యాలకోసం ధన్వంతరికి పూజలు చేస్తారు. యమధర్మరాజు దయకోసం సాయంత్రం దీపాలు కూడా వెలిగిస్తారు. ఆ రోజు ధనానికి అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. అలాగే ధంతేరస్ రోజున ప్రతి ఒక్కరు వాళ్ల స్థోమతరె బట్టి బంగారం, వెండి లేదా కొత్త పాత్రలు కొని పూజలో పెడతారు.