రామ భక్తుల ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురికి గాయాలు.. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో ప్రమాదం

రామ భక్తుల ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురికి గాయాలు.. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో ప్రమాదం

అశ్వారావుపేట, వెలుగు: రామదండు సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన భద్రాచల పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం మండలాల్లోని 20 గ్రామాల నుంచి 6 వేల మంది రామభక్తులు పాదయాత్రగా భద్రాచలానికి మంగళవారం సాయంత్రం బయలుదేరి గురువారానికి అశ్వారావుపేట చేరారు. కొందరు భక్తులు అలసిపోగా వెంట వచ్చిన ట్రాక్టర్ ఎక్కారు. అశ్వారావుపేట మండలం ఆసుపాక, నందిపాడు గ్రామాల మధ్యలో ముత్యాలమ్మ గుడి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో చాగల్లు మండలం దారవరం గ్రామానికి చెందిన యువతి కూచిపూడి మంజు ఎడమ కాలు పాదం పూర్తిగా తెగిపడింది.

కొండపల్లి శ్రీనివాసరావు కుడి చేతికి తీవ్రంగా గాయమైంది. వృద్ధురాలు కలవర్తి గంగాభవాని ఎడమ కాలు విరిగింది. మరో ముగ్గురు భక్తులకు స్వల్ప గాయాలవగా అంబులెన్స్ లో అశ్వారావుపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంజులను విజయవాడకు, గంగాభవానిని రాజమండ్రికి పంపించారు. ఘటనపై సమాచారం అందడంతో  ఎస్ఐ  యయాతి రాజు వెళ్లి వివరాలు సేకరించారు.