పుష్యమి వేళ వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

భద్రాచలం, వెలుగు  :  పుష్యమి నక్షత్రంను పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అభిషేక జలాలను భక్తులకు పంపిణీ చేశారు. ముత్తయిదువులకు స్వామి వారి అభిషేక మంజీరాలు అందజేశారు. బంగారు పుష్పాలతో మూలవరులకు అర్చన నిర్వహించి ఉత్సవమూర్తులను బేడా మండాపానికి తీసుకొచ్చారు. 

అక్కడ భక్తులు కంకణాలు ధరించి స్వామి నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పంతో కల్యాణ క్రతువు ముగించారు. పట్టాభిషేకం చేశారు. ముందుగా సమస్త నదీ,సముద్ర జలాలతో ప్రోక్షణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించాక భక్తరామదాసు చేయించిన ఆభరణాలను సీతారాములకు అలంకరించారు. 

వేదమంత్రోచ్ఛరణల మధ్య ముందుగా స్వామికి గద, రాజముద్రిక తర్వాత బంగారు కిరీటం అలంకరించి రామయ్యను పట్టాభిషిక్తుడిని చేశారు. సాయంత్రం పట్టాభిరామయ్యకు దర్బారు సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీసీతారామచంద్రస్వామిని దేవనాథ రామానుజ జీయర్ ​స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.