ఎక్కడైనా రాములోరికి ఏడాదికి ఒకసారి పెండ్లి చేస్తారు. కానీ.. జీడికల్‌లో మాత్రం ఏడాదికి రెండుసార్లు రాముడి కల్యాణ వేడుకలు చేస్తారు. భద్రాద్రిలో స్వామిని ప్రేమకు ప్రతీకగా చెప్పుకుంటే... ఇక్కడ రాముడిని వీరత్వానికి ప్రతీకగా చెప్తారు. ఇక్కడి మరో ప్రత్యేకత.. స్వయంగా రాములోరే త్రేతాయుగంలో ఇక్కడికి వచ్చాడని, ఓ భక్తుడి కోరిక మేరకు ఇక్కడే కొలువుదీరాడనే భక్తుల నమ్మకం.
జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం జీడికల్‌లోని వీరాచల రామచంద్రస్వామి ఆలయం రెండో భద్రాద్రిగా పేరుగాంచింది. జిల్లా కేంద్రానికి13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో ఏటా రెండు సార్లు రాములోరి కల్యాణం జరుగుతుంది. శ్రీరామనవమితో పాటు కార్తీకమాసంలోని పునర్వసు నక్షత్రంలో ఇక్కడ కల్యాణ వేడుకలు వైభవంగా జరుగుతాయి. భద్రాచలంలోని ఆలయం రాముడి ప్రేమకు ప్రతీకగా చెప్పుకుంటే జీడికల్‌లో రాముడిని వీరత్వానికి ప్రతీకగా చెప్తుంటారు. ఇక్కడ కార్తీక మాసంలో నెల రోజులు జాతర జరుగుతుంది. ఈ జాతరకు తెలంగాణలోని నలుమూలల నుంచి, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు.
పాప హరిణిలు
జీడికల్ వీరాచల రామచంద్ర స్వామి ఆలయం పైవైపున ఉన్న జీడి గుండం, పాలగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ గుండాలకు సంబంధించిన ఒక పురాణకథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో భీమసేనుడు, చంద్రసేనుడు అనే ఇద్దరు రాజులు ఉండేవాళ్లు. వాళ్లు ఒకసారి యుద్ధంలో తలపడ్డారు. చంద్రసేనుడు వీరమరణం పొందాడు. అతనికి బాలచంద్రుడు, బాలచంద్రిక అనే కవల పిల్లలు ఉండేవాళ్లు. తండ్రి చనిపోయాక ఈ ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పెరిగారు. పెద్దయ్యాక వాళ్ల మధ్య ఉన్నది అన్నా
చెల్లెలి బంధం అని తెలియక స్వయంవరంలో కలుసుకుని, ఇద్దరూ పెండ్లి చేసుకుంటారు. దాంతో వాళ్ల శరీరాలు నల్లబడిపోతాయి. అదే సమయంలో ఆకాశవాణి ‘101 పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటే మీ పాపానికి పాప పరిహారం దక్కుతుంద’ని చెప్తుంది. దాంతో ఆ ఇద్దరూ ఆలయాలను దర్శించుకుంటూ చివరకు జీడికల్‌కు వచ్చి జీడిగుండం, పాలగుండాల్లో స్నానం చేశారు. అప్పుడు వాళ్ల శరీరాలు పూర్వస్థితికి వచ్చాయి. అందుకే భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు.
త్రేతాయుగంలో వీరుడు, భద్రుడు అనే ఇద్దరు మునులు గోదావరి తీరంలో తపస్సు చేస్తే ఆ ఇద్దరికీ నారాయణుడు ఒకేసారి ప్రత్యక్షమవుతాడు. వాళ్ల కోరిక మేరకే భద్రుడి కోసం భద్రాచలంలో శ్రీరాముడిగా, వీరుడి కోసం జీడికల్‌లో వీరాచల రామచంద్ర స్వామిగా వెలిసినట్లు పురాణాలు చెప్తున్నాయి.
మరో స్థల పురాణం కూడా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. ఈ ప్రాంతానికి రామాయణంతో కూడా సంబంధం ఉంది. తండ్రి మాట జవదాటక వనవాసానికి వచ్చిన రామచంద్రుడు సీతమ్మను పర్ణశాలలో ఉంచాడు. అక్కడి నుంచి సీత కోరిన బంగారు లేడి తీసుకొచ్చేందుకు బయల్దేరతాడు. అలా వేటాడుతూ చివరకు జీడికల్‌లోని బండపై బాణం సంధించి ఆ లేడిని సంహరించినట్లు చెప్తుంటారు.
అందుకే ఆ బండకు ‘లేడి బండ’ అని పేరొచ్చింది. అంతేకాదు.. మాయా లేడి రూపంలో ఉన్న మారీచుడు పవిత్రమైన గంగా జలంతో తనను శాప విముక్తిడిని చేయాలని రాముడిని కోరాడు. స్వామి గంగా దేవిని ప్రార్థించి తన బొటన వేలితో బండను నొక్కి అందులోనుంచి వచ్చిన జలంతో మారీచుడికి విముక్తి ప్రసాదించాడు. లేడి సంహారం తర్వాత రాముడు సంధ్యావందనం చేసుకుని, పడమర వైపు నడవగా ఓ వీర రుషి రామనామ జపం చేస్తూ కనిపించాడు. అతడిని చూసిన రాముడు ఆ వీరుడిని ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడతను తనకు ‘సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ సేవ చేసుకునే అదృష్టం కల్పించాల’ని కోరాడు. వెంటనే రాముడు ‘తథాస్తు’ అంటూ వీరాచాల రామచంద్రుడిగా వెలిసినట్లు నమ్ముతారు భక్తులు.
జనగామ, వెలుగు