Sriramanavami 2025: రామయ్య భార్య సీతాదేవికి ఆత్మాభిమానం ఎక్కువ.. అందుకే మళ్లీ అయోధ్యకు రాలేదు..

Sriramanavami 2025:  రామయ్య భార్య సీతాదేవికి ఆత్మాభిమానం ఎక్కువ.. అందుకే మళ్లీ అయోధ్యకు రాలేదు..

శ్రీరామనవమి అనగానే  సీతారాముడు పెళ్లి.. రామాయణం.. సీతారాములతో పాటు హనుమంతుడు.. లక్ష్మణుడు.. రావణాసురుడు లవకుశలు.. త్రేతా యుగంలో వారి పాత్రలు గుర్తుకువస్తాయి.  ఇదంతా బాగానే ఉన్నా.. సీతమ్మ తల్లి విషయంలో చాలామందికి ఒక అబలగా... లక్ష్మణరేఖను దాటినందునే రావణాసురుడు అపహరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.    సినిమాల్లో అంజలీదేవిలాగానే సీతాదేవి కూడా నిరంతరం దుఃఖితురాలై ఉంటుందని ఓ అంచనా! నిజంగా సీతాదేవి అలానే ఉండేదా.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. .

 పురాణాల ప్రకారం రామాయణానికి మందే సీతాదేవి గురించి కొన్ని గ్రంథాల్లో పేర్కొన్నారు.  రామ అన్న పేరు మాదిరిగానే సీత అనే పేరు కూడా రెండు అక్షరాలే.. తిరగేసి వల్లెవేస్తే అదే పేరు పదేపదే వినిపిస్తుంది. విచిత్రంగా సీత అన్న పేరు రామాయణానికి ముందే వచ్చిన వేదాలలో కూడా వినిపిస్తుంది. రుగ్వేదంలో వ్యవసాయానికి అధినేత్రిగా సీత అనే దేవత కనిపిస్తుంది. ఆ తరువాతకాలంలో జనకుడు భూమిని దున్నుతుండగా సీత దొరికిన విషయం తెలిసిందే! అందుకే సీత అన్న పదానికి నాగటిచాలు అన్న అర్థం కూడా వస్తుంది. అంటే అనాదిగా మన పూర్వికులు భూమిలోని జీవానికి సీతమ్మ తల్లిని ఓ ప్రతిరూపంగా భావించేవారన్నమాట!

పట్టిన పట్టు వీడని సీత

రామాయణంలో సీత మహా సాదుజీవిగా కనిపిస్తుంది. కానీ అవసరం అనుకున్నప్పుడు ఆమె పట్టిన పట్టుని వీడకపోవడాన్ని గమనించవచ్చు. మహా బలశాలి అయిన రావణాసురుడు ఆమె చెంతకు చేరినప్పుడు.... అతను ఒక గడ్డిపోచతో సమానం అన్నట్లుగా ప్రవర్తించి అహాన్ని దెబ్బతీస్తుంది. హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు అతనితో తిరిగివెళ్లే అవకాశం ఉన్నా కూడా... రాముడే వచ్చి రావణుని ఓడించి తనని చెర నుంచి విడిపించాలని కోరుతుంది. ఇంతకంటే బలమైన వ్యక్తిత్వాన్ని ఊహించగలమా!

గీత దాటింది స్వేచ్ఛ కోసమే!

లక్ష్మణుడు గీసిన గీత దాటిందని సీతను వేలెత్తి చూపుతారు కొందరు. కానీ సీత గీత దాటకపోయి ఉంటే రావణుని సంహారమే జరిగి ఉండేది కాదు .  అయినా ఒకరు గీసిన గీత వెనకే ఉండిపోతే సీతకి సొంత వ్యక్తిత్వం ఉన్నట్లు ఎలా అవుతుంది? సీత  లక్ష్మణుడు గీసిన గీతను దాటాలనుకుంది. దాటింది. అంతే! దాని తరువాత వచ్చే పర్యవసానాలకి ఆమె సిద్ధపడే దాటిందని రుషి పుంగవులు పేర్కొనారు.  తనని ఎవరూ లోబరుచుకోలేరనో, ఎవరన్నా తనకి హాని తలపెట్టినా భర్త రక్షిస్తాడనో... ఆమెకు నమ్మకం ఉండవచ్చు.

అనుమానానికి ఆత్మాభిమానమే జవాబు

సీత గర్భవతిగా ఉండగానే రాముడు  కొంతమంది ప్రజల చెప్పుడు మాటలు విని శంకించి... ఆమెను అడవులకి పంపాడు. కానీ సీతమ్మ బేలగా మారి తన పుట్టింటికి చేరలేదు. బిడ్డలను కని అడవిలోనే పెంచి పెద్దచేసింది. వారు తండ్రిని సైతం ఎదుర్కొనే యోధులుగా తీర్చిదిద్దింది.  ఆ పిల్లలని రాముడు కనుగొని వారిని ఆహ్వానించగానే.... వారితో పాటు సీతాదేవి అయోధ్యకు బయల్దేరలేదు. తనని అనుమానించి అవమానకరంగా వెళ్లగొట్టిన అయోధ్యాపురికి ఆమె అలా చేరుకుంటే ఆమె గొప్పదనం ఏముంటుంది? అందుకే తన తల్లి భూదేవిలోకే వెళ్లిపోయేందుకు సీతాదేవి సిద్ధపడింది. అది ఆత్మహత్య కాదు- నిష్క్రమణ! నిరసన! అవతార సమాప్తి!