
చంఢీగర్: న్యాయం కోసం పరమశివుడు కోర్టు మెట్లెక్కాడు. ఈ మహాశివరాత్రికి తన గుడిని తెరిపించాలని న్యాయస్థానాన్ని కోరాడు. దేవుడి వినతిని పరిశీలించిన న్యాయస్థానం ఎట్టకేలకు ఆ మహాదేవుడికి అనుకూలంగా తీర్పు ప్రకటించింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు ఆ శివయ్య గుడి తలుపులను తెరవాలని, భక్తులు పూజలు చేసుకునేందుకు అనుమతించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటన ఛండీగర్లో జరిగింది.
అసలు ఈ ఆలయాన్ని ఎందుకు మూసేశారో.. మహా శివరాత్రి రోజు మాత్రమే తెరిచేందుకు హైకోర్టు ఎందుకు అనుమతించిందో తెలియాలంటే ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియాలి. అనధికారిక ఆక్రమణల తొలగింపు చట్టం, 1971 ప్రకారం తొలగింపు ఉత్తర్వులకు అనుగుణంగా ఛండీగర్ లో ఉన్న ఈ ప్రాచీన శివ్ మందిర్ను, ఆలయ ప్రాంగణాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ గుడిలో లింగాకారుడుగా కొలువై ఉన్న శివయ్యకు పూజలు లేవు. ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులకు అనుమతి కూడా లేదు.
Also Read:-నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి మరుసటి రోజు కూడా సెలవు..
ఈ ఆలయంలోని శివయ్యకు మహాశివరాత్రి సందర్భగా పూజలు చేయాలని భావించిన భక్తులు ఆ శివయ్య పేరుతోనే పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ అయిన ఆ త్రినేత్రుడి తరపున అడ్వకేట్స్ దినేష్ కుమార్ మల్హోత్రా, సాక్షం మల్హోత్రా హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఈ ఆలయ తలుపులు మహాశివరాత్రి పర్వదినాన కూడా తెరవకపోతే విపరీతంగా వచ్చే భక్తుల కారణంగా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్, జస్టిస్ వికాస్ సూరితో కూడిన డివిజన్ బెంచ్ మహాశివరాత్రి రోజు పూజలకు, మార్చి 2న లంగర్ సేవకు ఆలయ గేట్లను తెరవడానికి అనుమతించింది. మార్చి 3న మళ్లీ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని అధికారులకు న్యాయస్థానం స్పష్టం చేసింది.