శివ భక్తులు ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర మంచు చేయాలనుకుంటారు. కారణం.. ఎప్పుడంటే అప్పుడు అక్కడికి వెళ్లలేం. వెళ్లడం అంత ఈజీ కూడా కాదు. మంచు కొండల్లో కాలి నడకన వెళ్లి పరమశివుడిని దర్శించుకోవాలి. అయితే..... అంతకు మించిన సాహస యాత్ర మరొకటి కూడా ఉంది. అదే శ్రీఖండ్ మహదేవ్ యాత్ర. అమర్నాథ్ శివుడు మంచురూపంలో ఉంటే ఇక్కడ మాత్రం రాయి రూపంలో ఉంటాడు. మరో విశేషం ఏంటంటే.. ఈ రాయిపై ఎంత మంచు పడినా వెంటనే కరిగిపోతుంది. అసలు ఈ క్షేత్రం ఎక్కడుంది?.. ఎలా వెళ్లాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీఖండ్ మహదేవ్ క్షేత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూ జిల్లాలో ఉంది. సముద్రమట్టానికి 18,570 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఎత్తైన హిమాలయ పర్వతాలపై 72 అడుగుల శివలింగం ఉంది. ఈ మహాదేవుడిని దర్శించుకోవడం అంత సులభం కాదు. ఎన్నో ప్రయాసలకు ఓర్చుకుంటే తప్పు అక్కడికి చేరుకోలేం. ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న సింగ్ హడ్' బేస్ క్యాంప్ నుంచి శ్రీఖండ్ యాత్ర మొదలవుతుంది. హిమచల్ గవర్నమెంట్ ఈనెల 15 నుంచి 25 వరకు ఈ యాత్రకు అనుమతి ఇచ్చింది. అందుకోసం శ్రీఖండ్ యాత్ర ట్రస్టుతో పాటు హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కుల్లూ జిల్లా అధికారులు సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేశారు.
యాత్ర ఎన్నిరోజులో తెలుసా..!
సింగ్ హడ్ నుంచి మొదలయ్యే ఈ యాత్ర పది రోజుల పాటు సాగుతుంది. పరమశివుడి దర్శన భాగ్యం కలగాలంటే 32 కిలోమీటర్లు. ప్రయాణించాలి. ముందుగా సింగ్ హడ్ నుంచి భీమా ద్వార్ గుండా పార్వాతీ బాగ్ చేరుకోవాలి. అక్కడే పార్వతీ దేవి, గణేశుడు, కార్తికేయ స్వామి కొలువై ఉన్నారు. అక్కడ దర్శనం పూర్తైన తర్వాత మరో యాభై అడుగులు వేస్తే భోలేనాథ్ మహాదేవుడి క్షేత్రం చేరుకుంటారు. అక్కడ 72 అడుగుల శివలింగ దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ దారి పొడవునా అనేక ఆలయాలు ఉంటాయి. యాత్ర చేసేటప్పుడు భక్తులు 'హర హర మహాదేవా” అంటూ శివుడిని స్మరిస్తుంటారు. యాత్రలో భాగంగా ఆరు కిలోమీటర్ల దూరం పూర్తిగా మంచుపైనే నడవాల్సి ఉంటుంది.
శివుడు ధ్యానం చేసిన క్షేత్రం:
పరమేశ్వరుడు హిమాలయ పర్వతాలపై ధ్యానం చేశాడని మన పురాణాలు చెప్తున్నాయి. అది ఈ ప్రాంతంలోనే ధ్యానం చేశాడని ఇక్కడివాళ్లు చెప్తున్నారు. అంతేకాదు.. ఈ శివలింగాన్ని పాండవులు కూడా దర్శించుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ వెలసిన శివలింగం చాలా శక్తివంతమైనది అని స్థానికులు అంటున్నారు.
మంచు కరిగిపోతుంది:
హిమాలయాల్లోని చాలా ఎత్తయిన ప్రాంతం ఇది. గడ్డ కట్టుకుపోయే చలి. ఎటు చూసినా మంచు పర్వతాలే.అయినా ఈ శివలింగంపై మాత్రం మంచు నిలవదు. సంవత్సరం పొడవునా... మంచు కురిసినా అది వెంటనే కరిగిపోతుంది. దీనంతటికి కారణం పరమశివుడే అంటుంటారు ఇక్కడివాళ్లు.
ఎంత కష్టమో తెలుసా..!
శ్రీఖండ్ యాత్ర ఉండేది 32 కిలోమీటర్లే కానీ... వెళ్లి రావడానికి పది రోజులు పడుతుంది. అంటే.. అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. యాత్రలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఊహించుకోవచ్చు. అందుకే అందరూ దీన్ని ఇది ఒక సాహసయాత్రగా కూడా చెప్తుంటారు. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ సరిగా అందదు. అంతేకాదు. ఎత్తైన కొండలు ఎక్కి దిగడంతో తొందరగా అలసిపోతుంటారు.
ఎలా వెళ్లాలి:
శ్రీఖండ్ మహాదేవ్ క్షేత్రానికి వెళ్లాలి అనుకునే భక్తులు ముందుగా సిఘా వెళ్లాలి. అక్కడి నుంచి 13 కిలోమీటర్లు ప్రయాణించి 'రాంపూర్' చేరుకోవాలి. అక్కడి నుంచి 17 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 'నిరామండ్ " వస్తుంది. మరో 17 కిలోమీటర్లు వెళ్లే బాగిపుల్ వస్తుంది. అక్కడి నుంచి సింగ్ హడ్ బేస్ క్యాంప్ మీదుగా వెళ్లాలి.