
తెలంగాణలో శివాలయాలకు.. విష్ణు సంబంధమైన ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే శివుడు.. విష్ణుమూర్తి ఒకే ఆలయంలో.. ఒకొండపై గుహల్లో దర్శనం ఇస్తారు. ఇక్కడ ప్రతిశివరాత్రికి ఐదు రోజుల పాటుఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. పాలకుర్తిలో ఒకే కొండపై వెలిసిన సోమేశ్వరుడు, లక్ష్మీనరసింహ స్వామి గురించి తెలుసుకుందాం. . .
శివకేశవులు ఇద్దరూ స్వయంభువులుగా ఒకే కొండపై వెలసిన దివ్యక్షేత్రం పాలకుర్తి. కొండ పై ఉన్న గుహల్లో సోమేశ్వరుడు, లక్ష్మీనరసింహుడు కొలువుదీరారు. శివారాధకులకు, వీరశైవులకు దర్శనీయ క్షేత్రం ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు స్వాములను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి, గండ దీపాలు వెలిగిస్తారు. కోడెలను కట్టేసి మొక్కులు చెల్లిస్తారు
జనగామ జిల్లాలోని పాలకుర్తిలో సోమేశ్వర, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివ కేశవులు. ఇద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు గుహల్లో కొలువై ఉన్నారు. ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ప్రదక్షిణ మార్గం ఉంది.
శివ కేశవులను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం దగ్గర ఉండే రెండు రాళ్లకు, చెట్ల కొమ్మలకు తేనెపట్లు ఉంటాయి. ఎవరైనా శుభ్రత పాటించకుండా ఆలయానికి వస్తే తేనెటీగలు వాళ్ల వెంట పడి కుడతాయని భక్తులు చెప్తుంటారు. కోర్కెలు తీరినా మొక్కు చెల్లించకపోతే దేవుడే కలలో కనిపించి గుర్తు చేస్తాడని అంటుంటారు.
ఇక్కడున్న కొండ ఒకప్పుడు కలిసే ఉండేది. అయితే ఒక భక్తురాలు..ప్రదక్షిణ చేయడానికి కొండ అడ్డుగా ఉంది. దీన్ని చీల్చి దారి ఏర్పాటు చేయాలని స్వామిని కోరింది. దాంతో కొండ రెండుగా చీలి ప్రదక్షిణ మార్గం ఏర్పడింది అని భక్తులు చెప్తుంటారు. కొండ మీద ఉన్న శిఖర దర్శనం చేసుకోవడానికి పెద్దపెద్ద రాళ్ల మధ్య నుంచి పైకి మెట్ల మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా భక్తులు పైకి ఎక్కి గండదీపం వెలిగించి మొక్కులను తీర్చుకుంటారు.
ఆలయ విశేషం
మెట్ల మార్గం స్వామి వార్ల రెండు గుహలకు దక్షిణంగా ఉంటుంది. ఈ మార్గానికి ఆనుకొని కొండ లోపలికి ఒక సొరంగ మార్గం ఉంది. దీన్ని నేల బయ్యారం' అని పిలుస్తారు. ప్రస్తుతం సొరంగాన్ని మూసివేశారు. ఇది మహర్షులు తపస్సు, యజ్ఞ యాగాదులు చేసిన రహస్య స్థలం అని చెప్తుంటారు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. రాత్రి వేళల్లో ఇప్పటికీ ఈ కొండ నుంచి ఓంకారం వినిపిస్తుంటుంది. అయితే.. ఈ సొరంగంలో ఏముందో తెలుసుకునేందుకు గతంలో కొందరు అర్చకులు, గ్రామ పెద్దలు కలిసి ప్రయత్నించారు. సొరంగంలోకి కొంతదూరం వెళ్లిన తర్వాత గాలి సరిగా ఆడక వెనక్కి వచ్చేశారు. గుహకు పక్కనే వీరాంజనేయస్వామి విగ్రహం ఉంది. అక్కడికి వెళ్లాలన్నా పెద్ద రాళ్ల మధ్య ఉండే మెట్లు ఎక్కాలి. వేల సంవత్సరాల క్రితం ఈ కొండ గుహల నుంచి పాలలా ఉండే తెల్లటి నీరు ప్రవహించేదట. అందువల్లే దీన్ని క్షీరగిరి అని కూడా పిలుస్తారు.
దేవుళ్ళ దర్శనం
గుహలో దక్షిణంగా సోమేశ్వర స్వామి ఉన్నారు. ఆ స్వామికి ఎడమవైపు ఉన్న మార్గం నుంచి వెళ్తే అక్కడ నరసింహ స్వామి కొలువుదీరాడు. సోమేశ్వరుడి ఉత్సవ మూర్తి అడుగున్నర ఎత్తులో.... లక్ష్మీనరసింహుడి విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంది. స్వాములను దర్శించుకున్న ప్రతి భక్తుడిని అర్చకులు స్వామి పాదాల దగ్గరున్న చిన్న బెత్తంతో వీపుపై తాకించడం అనవాయితీ. ఇలా చేస్తే మానసిక .. శారీరక సమస్యలు తొలగిపోతాయని చెప్తుంటారు.
లక్షలాదిగా భక్తులు..
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలు మూలల నుంచేకాక కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల వాళ్లు కూడా లక్షలాదిగా వస్తారు. కొండ చుట్టూ ఎడ్ల బండ్లకు ప్రభలు కట్టి ఆలయం చుట్టూ తిరుగుతారు. యజ్ఞ... యాగాదులతో పాటు దివ్య రథోత్సవం వైభవంగా జరుగుతుంది. పిల్లలు లేని వాళ్లు కొబ్బరికాయ ముడుపు కడతారు. సంతానం కలిగాక తొట్టెలు కట్టి డోలారోహణం చేస్తారు. ఇల్లు కడితే బంగారు, వెండి, కర్రలతో బొమ్మలు చేసి మొక్కులు చెల్లిస్తారు.
శివరాత్రి సమయంలో ఐదు రోజులు జరిగే ఉత్సవాల్లో చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. కొండపైకి ఈజీగా వెళ్లేందుకు ఘాట్ రోడ్డు ఉంది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, స్టేషన్ ఘనపూర్, జనగామ, తొర్రూరుల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి
సోమనాథుడు ఇక్కడివాడే..
ప్రసిద్ధ వీరశైవ కావ్యం ....బసవపురాణం... రాసిన పాల్కురికి సోమనాథుడు ఈ గ్రామానికి చెందినవాడే. ఆయన 12వ శతాబ్దానికి చెందినవాడు. విష్ణురామిదేవుడు, శ్రీయాదేవమ్మ దంపతులకు సోమేశ్వరస్వామి వరప్రసాదంగా ఆయన పుట్టాడట. అందుకే ఆయనకు సోమనాథుడు' అని పేరు పెట్టారంటారు. సోమనాథుడు.. సోమేశ్వర స్వామిని స్తుతిస్తూ 'సోమనాథుని స్వరాలు' రాశాడు. 'అనుభవ సారము, పండితారాధ్య చరిత్ర, చతుర్వేద సారము'.. ఇలా అనేక గ్రంథాలు, ఎన్నో లఘు కృతులను సోమనాథుడు రచించాడు.
గ్రామంలో సోమనాథుని స్మృతి చిహ్నంగా కట్టిన శివాలయం ఉంది. శ్రీ ఆంధ్ర మహా భాగవత మందార మకరందాన్ని తెలుగు వాళ్లకు అందించిన భక్తకవి పోతన పుట్టిన బమ్మెర కూడా ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు... సోమేశ్వరుడు... లక్ష్మీనరసింహుడిని తరచూ దర్శించుకునేవాడని....
అప్పటి గ్రంథాల్లో ఉంది. వాల్మీకి మహర్షి కూడా పాలకుర్తికి ఐదు మైళ్ళ దూరంలో పల్మెడి(వాల్మీకి పురం)లోని కొండల్లో కొన్నాళ్లు ఉన్నట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి
ఎలా వెళ్లాలి
వరంగల్ కు 60 కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి ఉంది. వరంగల్- హైదరాబాద్ హైవేలో ఉన్న స్టేషన్ ఘన్పూర్ నుంచి 23 కిలో మీటర్లు ప్రయాణించాలి. పాలకుర్తికి వెళ్లగానే రైట్ సైడ్ ఆర్చి ఉంటుంది. దాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే సోమేశ్వర, లక్ష్మీనర్సింహాలయం కనిపిస్తుంది.