Mahashivratri 2025 : శివుడు పెళ్లికి దేవతలే కాదు.. దయ్యాలు, పిశాచాలూ కూడా వచ్చాయి..!

Mahashivratri 2025 : శివుడు పెళ్లికి దేవతలే కాదు.. దయ్యాలు, పిశాచాలూ కూడా వచ్చాయి..!

శివుడు మనకు నేర్పించే పాఠాలు ఏముంటాయి? దేవుడంటే మనల్ని కాపాడేవాడే కాదు, మంచి మార్గంలో నడిపించే ఆలోచనను ఇచ్చేవాడు కూడా... ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడించే ఎన్నో విషయాల్లో ... మనిషి ఎలా ఉంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో శివుడు తన ఆచరణల్లో చూపించాడు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . . 

పురాణాల ప్రకారం శివుడికి పుట్టుక, చావు ఉండదు.  అలాగే ఆయన నుంచి నేర్చుకున్నే ఈ పాఠాలకు కూడా చావు ఉండదు. ఎన్ని తరాలైనా ఈ పాఠాలు నేర్చుకోవాల్సిందే. శివ తత్త్వం నుంచి పుట్టిన కొన్ని మంచి ఆలోచనలు ఇవి. శివుడి నుంచి మనం నేర్చుకునే గొప్ప విషయాలు ఇవి. 

మంచితనం, కలుపుకుపోయే తత్త్వం 

శివుడిని పూజించేది దేవుళ్లూ దేవతలూ మాత్రమే కాదు. రాక్షసులేమిటి, భూతాలేమిటి, అన్ని రకాల జీవులూ ఆయనను ఆరాధిస్తాయి. దయ్యాలూ, భూతాలూ, ప్రేతాలూ, పిశాచాలూ, అసురులూ ఇలాంటివారిని అందరూ తిరస్కరించి దూరంగా పెట్టేస్తే, శివుడు మాత్రం వాళ్ళను స్వీకరించాడు. 

ఆయన పెళ్లి జరిగినప్పుడు ఈ లోకంలో ఎంతో కొంత ప్రాముఖ్యత గల ప్రసిద్ధులందరూ ఆ పెళ్ళికి వెళ్లారు. ఏ ప్రాముఖ్యతా లేని అనామకులు కూడా వెళ్లారు. ఈ రెండు తరగతుల మధ్యలో ఉండేవారూ వెళ్లారు. అందరు దేవుళ్లూ, దేవతలూ, అసురులూ, దానవులూ, ఉన్మాదులు, దయ్యాలు, పిశాచాలూ  ప్రతివారు వెళ్లారు. 

ALSO READ | మహా శివరాత్రి స్పెషల్ : ఎవరీ శివుడు.. ఎవరికి పుట్టాడు.. కొత్త మంత్రం ఏంటీ.. ఈ మంత్రాన్ని ఎలా పలకాలి..!

మామూలుగా వీళ్ళందరికీ ఒకళ్లతో ఒకళ్లకు సరిపడదు. కానీ శివుడి పెళ్లి అంటే మాత్రం అందరూ వెళ్లారు. ఆయన 'పశుపతి'. పాశవిక తత్త్వానికి ప్రభువు కనుక పశువులన్నీ వచ్చాయి. ఇక ఆయన పెళ్ళికి పాములు రాకుండా ఉండవు కదా! పక్షులూ కీటకాలూ కూడా మేమూ రావాల్సిందే అంటూ అతిథుల గుంపులో చేరిపోయాయి. జీవంగల ప్రతి ప్రాణీ శివుడి పెళ్ళికి వెళ్లింది. 

ఈ కథ వల్ల మనకు తెలిసి వచ్చేదేమిటంటే, శివుడు అనే వ్యక్తి రూపం గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పేది ఒక అతి నాగరికుడైన పెద్దమనిషి గురించి కాదు. ఒక ప్రాథమికమైన ఆదిమమైన శక్తి గురించి..  జీవ చైతన్య స్రవంతితో సంపూర్ణమైన ఏకత్వం సాధించిన ఒకానొక మూర్తి ..  ఆయన శుద్ధ చైతన్య మూర్తి, ఏ భేషజాలూ ఎరగడు. ఆయన నిత్య నూతనుడు, నిత్య స్వతస్సిద్ధుడు, కల్పనాశక్తి గలవాడు, విరామమెరగని సృజనాత్మకత ఆయనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవ చైతన్యానికే వ్యక్తీకరణ.