శ్రావణమాసం గురించి పరమేశ్వరుడు ఏమన్నాడో తెలుసా...

శ్రావణమాసం గురించి పరమేశ్వరుడు ఏమన్నాడో తెలుసా...

శ్రావణ మాసం అంటే చాలా మంది ఎంతో నిష్ఠగా లక్ష్మీ దేవిని పూజిస్తారు. శ్రావణమాసంలో మహిళలు వ్రతాలు.. పూజలు ఎందుకు చేయాలి.. శ్రావణ మంగళవారం.. శుక్రవారాలకు ఎందుకు అంత ప్రాధాన్యత.. పరమేశ్వరుడు.. శ్రావణమాసం గురించి ఎలా వివరించాడో తెలుసుకుందాం. . . . 

శ్రావణమాసం.. మహిళలకు.. కొత్తగా పెళ్లయిన వారికి ఎంతో పవిత్రమైనమాసం.  ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వర మహాలక్ష్మీ దేవిని పూజించి.. వరాలు పొందుతారు. . శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి. 

శ్రావణమాసం గురించి పరమేశ్వరుడు స్వయంగా చెప్పినమాట:
ఏడాదిలో ఉండే 12 నెలల్లో శ్రావణమాసం చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవి అమ్మవారికి  ఎంతో ఇష్టమైనది. సాక్షాత్తు ఆమె భర్త అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం రోజున పూర్ణిమ వచ్చింది కావున ఈ నెలకు శ్రావణమాసం అని పేరు వచ్చింది.  ఈ నెల చాలా విశిష్టమైనదని.. ఈ నెలలో చేసే పూజలకు చాలా మహిమ కలదని...అనేక సిద్దులను ఇస్తుందని పరమేశ్వరుడు వివరించాడని  మార్కండేయ పురాణంలో రుషి పుంగవులు పేర్కొన్నారు. 

శ్రావణ మాసంలోని వ్రతాలు.. పూజలు  శ్రద్ధగా చేసిన వారు నాకు అత్యంత ప్రియులుగా ఉంటారని .. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడడట.  ఈమాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరి.... . కోరికలు లేకుండా పూజించిన వారికి మోక్షాన్నీ శివ భగవానుడు ప్రసాదంగా ఇస్తాడని పండితులు చెబుతున్నారు.  ఈ మాసంలో ప్రతి రోజూ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది

మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈమాసం గురించి చెప్తూ ... -ఎవరైతే శ్రావణ మాసంలో ఏక భుక్తము (ఒక్కపూట భోజనం) చేస్తూ ఇంద్రియ నిగ్రహముతో గడుపుతారో వారికి అన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు.  

శ్రావణ మాసంలో  దైవకార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అనంత ఫలితాలను ఇస్తాయి. మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూశయనం ( నేలపై పడుకోవడం) , బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి. ఫలహారము లేదా హవిష్యాన్నము ఆకులో మాత్రమే భుజించాలి. ఆకుకూరలు తినరాదు. ఈ మాసంలో చేసే నమస్కారములు, ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేలరెట్ల ఫలితాన్ని ఇస్తాయి.

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట" అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం. వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.

స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు.

 శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నదని .... ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రోత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.

ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.

ఓం శ్రీ మంగళా దేవ్యై నమః.. శుభంభుయాత్​....