ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెలలో విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. చైత్రమాసంలో మేషంలోకి ప్రవేశించిన సూర్యుడు, మార్గశిర మాసంలో ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలను ధనుర్మాసం అంటారు. కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతో.. ధనుర్మాసం విష్ణుమూర్తికి అంత ఇష్టం. ఈ నెలలో తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తారు. ఇక ఈ నెలలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే భక్తుల కోర్కెలు తీరుతాయని అంటారు.
పురాణ వేత్తలు తెలిపిన వివరాల ప్రకారం మార్గశిర మాసం.. ముక్తికి మార్గం.. ఈ నెలలో శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తే వైకుంఠానికి వెళతారని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది. ఈ నెలలో లక్ష్మీ దేవిని పూజించి.. ఉపవాస దీక్షలు పాటిస్తే అన్ని శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ద్వాపర యుగంలో మాసానాం.. మార్గశీర్నాహం అని శ్రీకృష్ణుడు ప్రబోధిస్తాడు. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు.. కాలభైరవుడు... దత్తాత్రేయుడితో పాటు.. భగవద్గీత కూడ ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. ధునుర్మాసంలో వైష్ణవ సంబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.
గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో .... నారాయణుడిని కొలిచిందని.. ధనుస్సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేసిందని పురాణాలు చెబతున్నాయి. ఈ నెలలో వైష్ణవ, సూర్యాలయాలను కూడా సందర్శించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
ఈ నెలలో గోదాదేవి నారాయణుని అర్చించడం వలనే సాక్షాత్ శ్రీరంగ నాయకుడితో వివాహం జరిగిందని పద్మపురాణంలో ఉంది. ఈ నెలలో చిన్నపాటి క్రతువైనా ... అమోఘమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ధనుర్మాసంలో మరో ముఖ్యమైనది తిరుప్పావై పాశురాలు పారాయణం. భూదేవి అవతారమూర్తి అయిన ఆండాళ్ రచించారు.
తిరు అంటే మంగళగిరి..... పావై అంటే మేలుకొలుపు అని అర్థం.. ఈ నెలలో విష్ణుమూర్తిని మధుసూధనుడు అనే పేరుతో పూజించి.... మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేనురోజులు దద్యోజనం సమర్పించాలి. పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ళముందు ముగ్గులు, గొబ్బిళ్ళతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. గోదాదేవి కూడా శ్రీరంగానాయకుడిని భర్తగా పొందడానికి ఇలానే చేసిందని పండితులు చెబుతున్నారు.
గోదాదేవిరంగనాయకుడి వివాహం ఎలా జరిగిందంటే..
ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు.... పురాణ కథనం ప్రకారం.. ధనుర్మాసంలో గోదాదేవి విష్ణుమూర్తికి పూజలు చేసేది. ప్రతి రోజు పద్యాలు .. పాటలు పాడుతూ... రోజుకొక కీర్తనతో స్వామి వారిని అర్చించేది. గోదాదేవి విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణుని కుమార్తె. గోదాదేవి.. తోటలోని పూలను కోసి మాల కట్టి ..ముందుగా తాను మెడలో అలంకరించుకొనేది. అద్దం ముందు చూసుకొని మురిసి పోయేది.. ఆ తరువాత అదే మాలను తన తండ్రికి ఇచ్చేది. విష్ణుచిత్తుడు ఆ మాలను గుళ్లో శేషశయనుడు శ్రీరంగనాధస్వామి వారికి సమర్పించగా అర్చకులు స్వామివారికి అలంకరించు సమయమందు ఆ మాలలో దాగి ఉన్న ఒక పొడవాటి వెంట్రుకను ఉన్నది గమనించారు. అది స్త్రీ వెంట్రుక అని గుర్తించిన అర్చకులు ఆ మాల తీసుకొచ్చిన మహాభక్తుడైన విష్ణు చిత్తుడను నానా దుర్భాషలాడారు.
అక్కడి నుంచి సరాసరి ఇంటికి వెళ్లిన విష్ణుచిత్తుడికి అక్కడ మాలను అలంకరించుకుని స్వామి వారితో మాట్లాడుతున్న కుమార్తెను చూసి ఆగ్రహంతో రగిలిపోయెను. వెంటనే కత్తి తీసుకొని చంపబోగా.. గోదాదేవి తన ప్రేమ వృత్తాంతము తెలిపెను. తనకూతురి మాటలు విశ్వసించక.. ఆమెను చంపబోగా.. స్వామి ప్రత్యక్షమై.. తనకు గోదాదేవి ధరించిన మాలలే ఇష్టమని అందరి సమక్షంలో శ్రీరంగనాథస్వామి... గోదాదేవిని వివాహమాడాడు.
ఇలా మానవ స్త్రీ సాక్షాత్తు దేవున్ని తన భక్తిశ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం చేసుకుంది. నిష్ట కలిగిన భక్తికి భగవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటి నుండి గోదాదేవిని ఆండాళ్‌గా పిలుస్తారు. . ధనుర్మాసం వ్రతంలో బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. అవివాహితులు మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు.