అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నమైన ఈ వేడుక శ్రావణమాసంలో పౌర్ణమిరోజు జరుపుకుంటారు. ఈ రక్షా బంధన్ కులమతాలకు అతీతమైనది. ప్రాంతాలకు అతీతమైనది. అటువంటి రక్షా బంధన్ పురాణాల్లో కూడా కనిపిస్తోంది. అసలు పురాణాల నుంచే ఈ రక్షా బంధన్ ప్రారంభమైనది అంటారు. రక్షా బంధన్ అనేది సోదర ప్రేమకేనా.. పరిమితం కాదని..సోదర ప్రేమతో పాటు మరో ఆసక్తికర పురాణ కథనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
రాఖీ. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీక. సోదరుల శ్రేయస్సు కోసం..వారి రక్షణ కోసం తోబుట్టువులు కట్టే రక్షా బంధన్.. రాఖీ అంటే రక్షణనిచ్చే బంధం అని అర్థం. సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి కట్టేది రక్షాబంధన్. అలాగే తన రక్షణ కోసం సోదరి ప్రేమకు ఆమె జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు ఇచ్చే భరోసా రక్షా బంధన్ పండుగ.
శ్రీకృష్ణుడుకి ద్రౌపది కట్టిన రాఖీ..
భారతంలో శ్రీకృష్ణుడు లేని ఘట్టాలు చాలా అరుదుగా ఉంటాయి. పాండవులకు రక్షణ కవచంలా నిలబడిన శ్రీకృష్ణుడు పాండవుల పత్ని ద్రౌపదికి తోడబుట్టినవాడు కాకున్నా ఆమెను అనుక్షణం కాపాడాడు. నిండు సభలో వివస్త్ర కాకుండా ఆమె మానప్రాణాలు కాపాడిన దేవుడు శ్రీకృష్ణుడు. దీని వెనుక ఓ కారణం ఉంది.
దుష్ణ శిక్షణకు ఆవతరించిన దేవాదిదేవుడైన శ్రీ కృష్ణుడు దుర్మార్గాలు చేసే ఛేది రాజ్య చక్రవర్తి అయిన శిశుపాలుడుని సంహరించాలనుకుంటాడు. కృష్ణుడికి మేనత్త శ్రుతాదేవి కుమారుడే శిశుపాలుడు. అయినా ధర్మం కోసం దుర్మార్గాన్ని అణచటం కోసం కృష్ణుడు సొంత బంధువునే సంహరించటానికి వెనుకాడడు. మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు 100 తప్పులు పూర్తి అయ్యేవరకు ఆగాలనుకుంటాడు. అలా శ్రీకృష్ణుడు శిశుపాలిడ్ని తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. అలా సంహరించే సమయంలో శ్రీకృష్ణుడు చేతికి గాయమవుతుంది. దీంతో అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగు చింపి కృష్ణుడి గాయానికి కట్టుకడుతుంది.
దాంతో కృష్ణుడు సంతోషపడి..నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి, నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో అంటూ అభయమిస్తాడు. అలా కృష్ణుడు ఇచ్చిన మాటను ద్రౌపది అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెబుతారు. తరువాతి కాలంలో కురు సభలో పాండవులు జూదంలో ఓడిపోవటం..ఆ జూదంలో ద్రౌపదిని కూడా పందెంగా పెట్టటం వంటి ఘట్టాలు జరిగాయి. దీంతో కౌరవులు రెచ్చిపోతారు. ఏక వస్త్రగా ఉన్న ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకొచ్చి ఆమెను పరాభవించాలనుకుంటున్నారు. దుర్యోధనుడు ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగి వివస్త్రను చేసే సమయంలో ద్రౌపది వేడుకోలుతో అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు.అలా వీరిద్దరు తోడబుట్టినవారు కాకపోయినా..అన్నగా భావించి రక్షణను కట్టిన ద్రౌపది..చెల్లెలు మానం కాపాడిన అన్నగా శ్రీకృష్ణుడు ఘట్టాలు రక్షాబంధన్ కు మూలం అని అంటారు.
బలి చక్రవర్తికి లక్ష్మీదేవి కట్టిన రక్షా బంధన్..
మహా పరాక్రమశాలి..దానాలకు మారు పేరుగా నిలిచి బలి చక్రవర్తికి సాక్షాత్తు ఆదిదేవుడు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి రక్షా బంధన్ కట్టిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకానొక సందర్భంగా రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి.. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో తెలిపిందట. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుందట.
సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే తనను సోదరుడిగా భావించి కోరిక కోరితే తీర్చకుండా ఉంటాడా బలి చక్రవర్తి. పైగా దానంలో ఆయన శిభి చక్రవర్తిలాంటివాడు. ఇచ్చిన మాట కోసం తన రక్త మాంసాలనే కోసి ఇచ్చిన మహా దాత శిభి చక్రవర్తి. అంతటి శిభి చక్రవర్తితో సమానుడైన బలి చక్రవర్తి సాక్షత్తు ఆ నారాయణుడే తన వద్దకు వచ్చి దేహీ అని అడిగితే దానం ఇచ్చిన గొప్ప రాక్షస చక్రవర్తి. అటువంటి బలి వద్దకు ఆ లక్ష్మీదేవి స్వయంగా వెళ్లి రక్ష కట్టి కోరితే ఇవ్వకుండా ఉంటాడా..? అలా బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.. ఇలా విభిన్న రకాలుగా ‘రాఖీ పౌర్ణమి’ పుట్టిందని చెపుతారు.
వినాయకుడి కుమారులకు రాఖీ కట్టిన దేవత కథ..
రాఖీ పండుగ వెనుక పరాణాలలో మరో కథ ఉంది. గణనాధుడు వినాయకుడి కుమార్తెగా సంతోషిమాత ఎలా మారిందో తెలిపే కథ ఒకటుంది. సంతోషి మాత. ఎవరీ సంతోషిమాత..? వినాయకుడి కుమార్తెగా జన్మించటం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. సంతోషిమాతను ఉత్తర భారతీయులే ఎక్కువగా పూజిస్తారు. సంతోషిమాత ఆలయాలు దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలోనే ఎక్కువగానే ఉన్నాయి.
గణనాధుడు గణేషుడి సిద్ధి, బుద్ది అనే ఇద్దరు భార్యలున్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి, పుష్టి, శ్రీ అనే మరో ముగ్గురు భార్యలున్నాయని పురాణ కథలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి ఇద్దరు పుత్రులున్నారు. వారి పేర్లు శుభ్, లభ్. వీరికి సోదరి లేదు. దీంతో సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా చెప్పబడిన రక్షా బంధనం తమకు కూడా చేసుకోవాలని ఉందని విఘ్నాలు తొలగించే తండ్రి అయిన ఆ విఘ్నేశ్వరుడిని కోరుతారు.
అయితే తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడట. ఆ జ్యోతిగా వెలువడి బాలిక రూపం ధరించింది. ఆ తర్వాత గణేష పుత్రులైన క్షేమ లాభాలకు రాఖీ కట్టింది.అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కల్గించింది కాబట్టి ఆమెకు సంతోషీ దేవతగా, సంతోషీ మాతగా మారినట్లు చెబుతుంటారు.
భర్త దేవేంద్రడుకి రక్ష బంధన్ కట్టిన భార్య శచీదేవి..
అంతేకాదు స్వర్గలోకాధి పతి దేవేంద్రడు రాజ్యమైన అమరావతిని, బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు. ఆ బలిచక్రవర్తిని ఓడించి, తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు, బలి మీదకు యుద్ధానికి బయల్దేరాడు. ఆ సమయంలో తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ… ఇంద్రుని భార్య శచీదేవి, విష్ణుమూర్తిని వేడుకొంది. అంతట విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను ఆమెకు అందించాడు. శచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి సాగనంపింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడు.
విజయం కోసం భార్యలు భర్తలకు కట్టే రక్షా బందన్..
రక్షా బంధన్ అనేది కేవలం సోదర సోదరీ మణులకే కాదు భార్యా భర్తల మద్య కూడా ఉందని తెలుస్తోంది. యుద్ధానికి వెళ్లే భర్తలకు, భార్యలు వీరతిలకాన్ని అద్ది, రక్షను కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది. ఇదే క్రమంగా రక్షాబంధనంగా మారిందని అంటారు. కానీ రక్షా బంధన్ అనేది బంధాలకే కాదు రక్షకు గుర్తు అని చెప్పకనే చెబుతోంది. అది భర్తకు.. భార్య కట్టిన సోదరులకు ..సోదరీమణులు కట్టినా రక్షా బంధన్ అనేది రక్షకు గుర్తు అని మాత్రం నిదర్శనంగా కనిపిస్తోంది.