
2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ కు భారత్ అర్హత సాధించలేకపోయింది. ఒకదశలో భారత్ ఫైనల్ కు వెళ్లడం ఖాయమనుకున్నా అనూహ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్ పై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 1-3 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చిత్తుగా ఓడారు. వరుసగా రెండు సార్లు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన భారత్.. మూడోసారి ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకున్నాయి.
ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు తొలిసారి లార్డ్స్ వేదిక కానుంది. ఈ ఏడాది (2025) జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ 2024 సెప్టెంబర్ 3 న ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. ఈ సారి టీమిండియా లేకపోకవడంతో ఫైనల్ చప్పగా సాగనుంది. భారత జట్టు లేకపోవడంతో ఇంగ్లాండ్ లోని లార్డ్స్ ఏకంగా రూ. 45 కోట్లు నష్టపోనుందని సమాచారం.
ఈ సంవత్సరం ఇండియా ఫైనల్ కు అర్హత సాధించలేదని తెలిసి లార్డ్స్ యాజమాన్యంలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ టిక్కెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. టీమిండియా కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడితే అభిమానులు భారీగా వచ్చేవారు. ఈ క్రమంలో లార్డ్స్ లో హోటళ్లు మొత్తం బుక్ అవ్వడంతో పాటు విమానాలకు విపరీతమైన గిరాకీ ఉండేది. స్థానికంగా ఉండే వ్యాపారులు కూడా లాభం పొందేవారు. లార్డ్స్ మైదానం భారత అభిమానులతో నిండిపోయేది. తద్వారా క్రికెట్ ఇంగ్లాండ్ కు కూడా దండిగా ఆదాయం వచ్చేది. అయితే భారత్ క్వాలిఫై కాకపోవడంతో నష్టం తప్పట్లేదు.
ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లు సౌతాంప్టన్ (2021), ఓవల్ (2023) వేదికలుగా జరిగాయి. 2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023 ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఈ రెండు మ్యాచ్ లకు అభిమానులు భారీగా వచ్చారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆదాయం బాగా వచ్చింది. ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా ఫైనల్ ఆడడం ఇదే తొలిసారి.
🚨 BREAKING : Lord's likely to lose 45cr INR revenue due to India failing to qualify for the WTC Final.#ViratKohli𓃵 pic.twitter.com/fHRT7KCe3o
— Misran Ahmad 🏏Shahzadain 🇵🇰 (@MisranAhmad19) March 11, 2025