మేడ్చల్ జాతీయ రహదారిపై ఒ లారీ బీభత్సం సృష్టించింది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోంగార్డ్ శ్రీనివాస్ (35) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మండల పరిధిలోని కండ్లకోయ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పుడే హైదరాబాద్ నుండి మేడ్చల్ వైపు వస్తున్న లారీ కంటైనర్ అదుపు తప్పి తనిఖీలు నిర్వహిస్తున్న హోంగార్డ్ శ్రీనివాస్ పైకి దూసుకువెళ్లింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కు బలమైన గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు గాయాలైన శ్రీనివాస్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే శ్రీనివాస్ మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.