
భూపాలపల్లి అర్బన్, వెలుగు : కొద్దిరోజులుగా అంతర్గతంగా జరుగుతున్న భూపాలపల్లి, గణపురం లారీ అసోసియేషన్ల మధ్య గొడవ గురువారం రచ్చకెక్కింది. చర్చల కోసం నిర్వహించిన మీటింగ్‌లో ఇరు అసోసియేషన్ల సభ్యులు దాడికి దిగడంతో పలువురికి గాయాలు అయ్యాయి. అనంతరం రెండు అసోసియేషన్ల సభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బస్వరాజుపల్లి కేటీకే 8 ఇంక్లైన్, ఓసీ-3కి సంబంధించి గణపురం లారీ అసోసియేషన్‌కు కాకుండా భూపాలపల్లి లారీలకు ఆఫీసర్లకు పర్మిషన్ ఇచ్చారు. బుధవారం రాత్రి భూపాలపల్లి లారీలను గణపురం అసోసియేషన్ మెంబర్స్ అడ్డుకున్నారు. దీంతో గురువారం భూపాలపల్లి జీఎం ఆఫీసు వద్ద గణపురం, భూపాలపల్లి అసోసియేషన్ మెంబర్లు చర్చలు జరిపారు. అనంతరం భూపాలపల్లి సభ్యులు గణపురం మెంబర్స్‌పై దాడి చేశారు. రామప్ప కాలనీ వద్ద మరోసారి దాడి చేయడంతో గణపురం అసోసియేషన్ లీడర్ అన్నం జగ్గారావు, మరో వ్యక్తి చలపతిరావుకు గాయాలు అయ్యాయి. దీంతో గణపురం అసోసియేషన్ సభ్యులు గణపురం పీఎస్‌లో, భూపాలపల్లి అసోసియేషన్ సభ్యులు భూపాలపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.