- మూడ్రోజులుగా సమ్మె చేస్తున్న ఓనర్స్ అసోసియేషన్
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లో ఎస్పీఎం పేపర్ కంపెనీ, లారీ ఓనర్స్ అసోసియేషన్ మధ్య మరోసారి వివాదం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కాగ జ్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మూడ్రోజులుగా సమ్మె చేస్తున్నారు. పలుమార్లు పోలీసు, రెవెన్యూ, ఆర్టీఏ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఈ సమ్మెకు శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ బాధ్యులు మద్దతు పలికారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమని ఆయా అసోసియేషన్ బాధ్యులు ప్రకటించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే విషయంలో ఎస్పీఎం జేకే యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించడం దారుణమన్నారు. చర్చల సందర్భంగా కంపెనీ ప్రతినిధులు కనీసం రెస్పాన్స్ ఇవ్వకపోవడం పద్ధతి కాదని అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ బాబు పేర్కొన్నారు.
సమ్మె విరమించాలని కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్,టౌన్ సీఐ శంకరయ్య పలుమార్లు వారిని సముదాయించినా ఫలితం రాలేదు. టౌన్ పోలీసులు సాయంత్రం వరకు అక్కడ బందోబస్తు నిర్వహించారు.