ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం

బూర్గంపహాడ్, వెలుగు: మండలంలోని మోరంపల్లిబంజర్ నేషనల్ హైవే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి సోమవారం లారీ దూసుకెళ్లిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోరంపల్లిబంజరకు చెందిన చేతుల ఆనంద్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లోకి లక్ష్మీపురం వైపు నుంచి పాల్వంచ వైపునకు వెళ్తున్న లారీ దూసుకెళ్లింది. ఈ సమయంలో ఆనంద్ దంపతులు ఇంటి వెనుకాల ఉండగా కుమారుడు ముందు గదిలో నిద్ర పోతున్నాడు. దీంతో కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఇళ్లు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. స్థానికులు వారిని బయటకు తీసి స్థానిక పీహెచ్ సీకి తరలించారు. క్లీనర్ కు కాలు విరిగింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై సంతోష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.