చేవెళ్ల ఆలూరు గేటు దగ్గర లారీ బీభత్సం.. అసలేం జరిగిందంటే..

చేవెళ్ల ఆలూరు గేటు దగ్గర లారీ బీభత్సం.. అసలేం జరిగిందంటే..

రంగారెడ్డి: చేవెళ్ల సమీపంలోని ఆలూరు దగ్గర సోమవారం సాయంత్రం లారీ బీభత్సం సృష్టించిన ప్రమాదంపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు ఆలూరుకి చెందిన వారిగా గుర్తించామని, పక్క గ్రామం వారు ఒకరు, మరొకరు హైదరాబాద్కు చెందిన వ్యక్తి అని డీసీపీ చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి రాకముందే గాయపడ్డ వారిని ప్రైవేటు వెహికల్స్లో స్థానికులు ఆసుపత్రికి తరలించారని, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడని.. అతనిని హాస్పిటల్కి తరలించామని ఆయన తెలిపారు. 

ప్రమాదం సమయంలో ఆలూరుకి చెందిన రైతులు రోడ్డుపై కూరగాయల అమ్ముతున్నారని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందని దానిపై విచారణ కొనసాగిస్తున్నామని, లారీ కింద ఒక స్కూటీ కూడా చిక్కుకుని స్కూటీపై వచ్చిన హైదరాబాద్ వ్యక్తి మృతి చెందాడని ఆయన వెల్లడించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేడా అనేది ట్రీట్మెంట్ తర్వాత టెస్ట్ చేస్తారని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు.

లారీ ప్రమాదంలో మరణించిన మృతుల వివరాలు:
* నక్కల పల్లి రాములు(45) అంజయ్య, గ్రామం ఆలూరు
* దామరగిద్ద కృష్ణ (22) తండ్రి జంగయ్య, గ్రామం ఆలూరు
* శమల సుజాత భర్త వెంకటేష్, గ్రామం నంచేరి
* చేవెళ్ల ఆసుపత్రికి తరలించిన మరొకరు చనిపోయారు

ALSO READ : తెలంగాణలో ఘోరం: రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేవాళ్లపైకి దూసుకెళ్లిన లారీ

లారీ ప్రమాదంలో చనిపోయిన బాధితుల కుటుంబాలను  మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. హైదరాబాద్--బీజాపూర్ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయి 24 గంటలు గడవకముందే మరో నలుగురు చనిపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై తాము రాజకీయాలు చేయాలనుకోవడం లేదని, ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుని విస్తరించాలని ఆమె డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలోనే అన్ని అనుమతులు, నిధులు తెచ్చామని, మరి ఇప్పటి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడంలేదని.. మరిన్ని దుర్ఘటనలు జరగకముందే ప్రభుత్వం పనులు చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.